భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు విజయ్ హజారే ట్రోఫీ 2025–26 కలిసిరాలేదు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ వికెట్ తీయకపోవడంతో.. అర్జున్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈరోజు ముంబైతో జరిగిన కీలక మ్యాచ్‌లో గోవా తరఫున ఆడుతున్న అర్జున్ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్జున్ కేవలం 8 ఓవర్లలోనే 78 పరుగులు సమర్పించుకున్నాడు.
ముంబైతో మ్యాచ్‌లో గోవా తరఫున దర్శన్ మిసాల్, లలిత్ యాదవ్‌లు ఎక్కువ ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చినా.. ఇద్దరు కలిపి ఐదు వికెట్లు తీసి జట్టుకు కొంత ఊరట కలిగించారు. అర్జున్‌కు ఓపెనర్‌గా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. బ్యాట్‌తోనూ అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ కొత్త బంతిని ఎదుర్కొన్న అర్జున్.. ఈ మ్యాచ్‌లో 27 బంతుల్లో 24 పరుగులకే పరిమితమయ్యాడు. గోవా తరఫున అభినవ్ తేజ్రానా (70 బంతుల్లో 100), దీప్రాజ్ గావోంకా (28 బంతుల్లో 70) పోరాడినా జట్టు ఓటమిని తప్పించుకోలేకపోయారు. 445 పరుగుల ఛేదనలో 87 పరుగుల తేడాతో గోవా పరాజయం పాలైంది. సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసకర సెంచరీ (75 బంతుల్లో 157)తో ముంబై జట్టుకు భారీ స్కోరు అందించాడు.
విజయ్ హజారే ట్రోఫీ 2025లో అర్జున్ టెండూల్కర్‌కు ఇప్పటివరకు ఒక్క వికెట్ తీయలేదు. హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. అయినా ఆ మ్యాచ్‌లో గోవా 286 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిక్కింతో జరిగిన మ్యాచ్‌లోనూ అర్జున్ వికెట్ తీయలేదు. 9 ఓవర్లలో 49 పరుగులే ఇచ్చి.. రెండు మెయిడెన్ ఓవర్లు వేయడం కొంత సానుకూలాంశం. ఆ మ్యాచ్‌లో గోవా 62 పరుగుల తేడాతో గెలిచింది. ప్రస్తుతం గోవా 4 మ్యాచ్‌లలో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
Also Read: Mollywood 2025: నెవ్వర్ బిఫోర్ హైస్.. 96 ఏళ్ల మాలీవుడ్ చరిత్రను మార్చిన కళ్యాణి!
ఇక ఐపీఎల్ విషయానికి వస్తే.. అర్జున్ టెండూల్కర్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడనున్నాడు. ముంబై ఇండియన్స్ నుంచి ట్రేడ్ ద్వారా అతడు లక్నో జట్టులోకి చేరాడు. 2021 నుంచి 2025 వరకు ముంబై ఇండియన్స్‌లో భాగంగా ఉన్న అర్జున్.. 2023లో ఐపీఎల్ అరంగేట్రం చేసి నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. 2024లో ఒక మ్యాచ్ మాత్రమే ఆడిన అతడు.. 2025 సీజన్‌లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఫామ్‌లోకి రావడం అర్జున్‌కు అత్యవసరం. అయినా కూడా మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. అర్జున్ ఫామ్‌పై ఆందోళన నెలకొంది. ఇప్పటికే టీమిండియా ఎంపికకు చాలా దూరంలో నిలిచిన అర్జున్.. ఇదే ఫామ్ కొనసాగిస్తే ఐపీఎల్‌లో ఆడడం కూడా కష్టంగానే మారనుంది.
