Anaya Bangar’s Viral Interview: భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు లింగమార్పిడి చేసుకుని అమ్మాయిగా మారిన విషయం తెలిసిందే. ఆర్యన్ బంగర్ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకుని అనయ బంగర్ అయింది. లండన్‌లో ఉంటున్న అనయ.. మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. తాజాగా కృష్ణంక్ ఆత్రే యూట్యూబ్ చానెల్‌కు అనయ ఇచ్చిన ఇంటర్య్వూ నెట్టింట వైరల్ అయింది. టీమిండియా ప్లేయర్స్ ‘శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా’ అంటూ అనయ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్వ్యూలో భాగంగా భారత స్టార్ క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్‌లలో ఎవరిని పెళ్లి చేసుకుంటారు, ఎవరితో డేటింగ్ చేస్తారు, ఎవరిని కిల్ చేస్తారు అని అనయ అడిగారు. ‘కిల్, మ్యారీ, హుక్‌అప్’ అనే ప్రశ్నకు అనయ తనదైన శైలిలో సమాధానమిచ్చింది. శ్రేయస్ అయ్యర్‌ను కిల్ చేస్తా, అభిషేక్ శర్మను పెళ్లి చేసుకుంటా, శుభ్‌మన్ గిల్‌తో హుక్‌అప్ చేస్తా అని చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి ఇంత వైలెన్స్ ఏంటి తల్లి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అనయ గతంలో ముంబై తరఫున వయోపరిమితి పురుషుల క్రికెట్‌లో ఆడింది. 2022లో ప్రారంభించిన తన జెండర్ ట్రాన్సిషన్ ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది మార్చిలో జెండర్-అఫర్మింగ్ సర్జరీ చేయించుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాకు వెళ్లి తన క్రికెట్ కెరీర్‌ను తిరిగి కొనసాగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళల క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ క్రీడాకారిణులు పాల్గొనేందుకు స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని అనయ కోరింది. క్రికెట్ ఆస్ట్రేలియా అనుసరిస్తున్న విధానాలను బీసీసీఐ కూడా పరిశీలించాలని అభిప్రాయపడింది. ఆస్ట్రేలియా తరహాలో బీసీసీఐ కూడా మార్గదర్శకాలను రూపొందిస్తే బాగుంటుందని పేర్కొంది. జెండర్-అఫర్మింగ్ సర్జరీ తర్వాత ఆన్‌లైన్‌లో ఎదురైన వేధింపులపైనా ఆమె స్పందించింది. తాను ఎదుర్కొన్న పరిస్థితులను విమర్శలు చేస్తున్నవారు అనుభవించలేదని వ్యాఖ్యానించింది.
మహిళల క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ క్రీడాకారిణుల భాగస్వామ్యంపై క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం కూడా చర్చకు దారితీసింది. ఆ నిర్ణయంపై దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మారిజానే కాప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని అనుమతించకూడదని ఆమె సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తూ మహిళల బిగ్‌బాష్ లీగ్ అధికారిక ఖాతాను ట్యాగ్ చేశారు. కాప్ వ్యాఖ్యలపై అనయ స్పందిస్తూ.. మహిళల క్రికెట్‌లో పాల్గొనేందుకు తనకు అనుమతి లభించే ముందు శాస్త్రీయ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. మాంచెస్టర్ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్ తన శారీరక సామర్థ్యాలపై 12 వారాల పాటు పరీక్షలు నిర్వహించిందని వివరించింది. ఏడాది పాటు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకున్న తర్వాత ఈ పరీక్షలు జరిగాయని, వాటి ఫలితాల ప్రకారం తన శారీరక ప్రమాణాలు సిస్‌జెండర్ మహిళా అథ్లెట్ల పరిధిలో ఉన్నట్లు తేలిందని ఆనయ పేర్కొంది.

