Site icon NTV Telugu

IPL Media Rights: ఐపీఎల్ బిడ్డింగ్ రేసు నుంచి అమెజాన్, గూగుల్ అవుట్

Ipl Media Rights

Ipl Media Rights

ఎంతో ఆసక్తి రేపిన ఐపీఎల్ 2022 సీజన్ దిగ్విజయంగా ముగిసింది. దీంతో తదుపరి సీజన్‌పై బీసీసీఐ దృష్టి సారించింది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో కొత్తగా ఈ ఏడాది రెండు జట్లు చేరడంతో పోటీతత్వం పెరిగి టోర్నీ మరింత రసవత్తరంగా సాగుతోంది. 2022 వరకు ఈ టోర్నీ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను స్టార్ ఇండియా కొనుగోలు చేసింది. అప్పట్లో సోనీ పిక్చర్స్‌ను బీట్ చేసిన స్టార్ ఇండియా రూ.16,347.50 కోట్ల రూపాయలకు బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు దక్కించుకుంది. ఈ డీల్‌తో ఒక్కో ఐపీఎల్ మ్యాచ్ ఖరీదు రూ.55 కోట్లకు చేరింది. అయితే ఈ డీల్ ఈ ఏడాదితో ముగిసింది.

కొత్త డీల్ కోసం ఈనెల 12న వేలం నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ ప్రక్రియ రెండు మూడు రోజులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రపంచ కుబేరులు జెఫ్ బెజోస్‌కు చెందిన అమెజాన్, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌ల మధ్య పోటీ ఉంటుందని వ్యాపార వర్గాలు భావించాయి. అయితే తాజాగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ వేలం నుంచి అమెజాన్ తప్పుకుందట. కారణం ఏంటో తెలియరాలేదు కానీ.. అమెజాన్ ఈ వేలంలో పాల్గొనడం లేదని మాత్రం వార్తలు వస్తున్నాయి.

మరోవైపు గూగుల్ (యూట్యూబ్) కూడా డిజిటల్ ప్రసారహక్కులపై ఆసక్తి చూపుతూ బిడ్ డాక్యుమెంట్ తీసుకుందని.. కానీ ఎందుకో ఆ డాక్యుమెంట్‌ను తిరిగి సమర్పించలేదని బీసీసీఐ అధికారులు వెల్లడించారు. దీంతో ప్రస్తుతం టీవీ, స్ట్రీమింగ్ హక్కుల రేసులో 10 సంస్థలు మిగిలాయని తెలిపారు. కాగా 2023 నుంచి 2027 వరకు టెలివిజన్, డిజిటల్ కంటెంట్ ప్రసార హక్కుల కోసం బీసీసీఐ ఈ బిడ్డింగ్ నిర్వహిస్తోంది. ఈ ఐదేళ్లలో తొలి మూడేళ్ల పాటు 74 మ్యాచ్ లు, చివరి రెండేళ్లలో 94 మ్యాచ్ లు నిర్వహించనున్నారు.

Exit mobile version