ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎంత నిరాశజనకమైన పెర్ఫార్మెన్స్ కనబర్చిందో అందరూ చూశారు. ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. కేవలం నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. చెన్నై లాంటి డిఫెండింగ్ ఛాంపియన్ నుంచి ఇంత దారుణమైన ఫలితాల్ని ఎవ్వరూ ఊహించలేదు. ఈ నేపథ్యంలోనే ఈ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఇక రాజస్థాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో చెన్నై ఆడిన ఆటతీరుపై ప్రతిఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా మాజీ బ్యాట్స్మన్ ఆకాశ్ చోప్రా అయితే తారాస్థాయిలో చెన్నై జట్టుపై విరుచుకుపడ్డాడు.
‘‘చెన్నైకి ఇంతకంటే చెత్త సీజన్ మరొకటి లేదు. ఈసారి ఈ జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఇది ఎంతమాత్రం ఆమోద్యయోగ్యం కాదు. ఈ సీజన్‌లో చెన్నై ఆటగాళ్ళు తమ మార్కును అస్సలు చూపించలేకపోయారు. ఒక్క దీపక్ చాహర్ మాత్రమే గాయం కారణంగా సీజన్‌కి దూరమయ్యాడు. కానీ.. ఒక్క ప్లేయర్ లేనంత మాత్రాన, మరీ ఇంత ఘోరంగా విఫలమవడం వారి స్థాయికి తగదు’’ అంటూ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇదే సమయంలో రాజస్థాన్‌తో ఆడిన చివరి మ్యాచ్‌పై తన విశ్లేషణ సెటైరిక్‌గా ఇచ్చాడు.
‘‘ఈ మ్యాచ్.. ముఖ్యంగా చెన్నై ఇన్నింగ్స్ అయితే చాలా ఆసక్తికరంగా సాగిందనే చెప్పుకోవాలి. మొదట టీ10, తర్వాత వన్డే, ఆ తర్వాత టెస్టు క్రికెట్‌ను చెన్నై జట్టు తలపించింది. మొదటి ఆరు ఓవర్లలో టీ10 మాదిరి మొయిన్ అలీ అదరగొట్టాడు. అయితే డెవాన్ కాన్వే ఔటవ్వగానే 50-50 మ్యాచ్‌ను గుర్తు చేసింది. ఇక జగదీశన్, అంబటి రాయుడు ఔటయ్యాక టెస్టు క్రికెట్‌లాగా చెన్నై ఇన్నింగ్స్ సాగింది. ధోని 28 బంతుల్లో 26 పరుగులు చేయడం చూశాం కదా!’’ అంటూ ఆకాశ్ చోప్రా పెదవి విరిచాడు. అభిమానులు ఇదే రేంజ్‌లో చెన్నై జట్టుపై ధ్వజమెత్తుతున్నారు.