Akash Chopra About Jasprit Bumrah Injuries: భారత జట్టులో ఉన్న అత్యంత కీలక ఆటగాళ్లలో జస్‌ప్రీత్ బుమ్రా ఒకడు. తన స్వింగ్ బౌలింగ్‌తో ఏ క్షణమైనా మ్యాచ్‌ని మలుపు తిప్పే ప్రతిభ అతని సొంతం. అలాంటి ఆటగాడు ఇప్పుడు వరుస గాయాల కారణంగా జట్టుకి దూరమవుతూ వస్తున్నాడు. ఆల్రెడీ విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు బుమ్రా విశ్రాంతి తీసుకోగా.. త్వరలో జరగబోతున్న ఆసియా కప్‌కి కూడా దూరమయ్యాడు. దీనికితోడు.. మరో రెండు నెలల్లో ప్రారంభం కాబోతున్న టీ20 వరల్డ్‌కప్‌కి కూడా బుమ్రా దూరమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే.. అభిమానులు మాత్రం బుమ్రా త్వరగా కోలుకొని, జట్టులోకి రావాలని కోరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా.. బుమ్రాకి వరుస గాయాలు ఎందుకు అవుతున్నాయన్న విషయంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తన బౌలింగ్ యాక్షన్ వల్లే బుమ్రాకి గాయాలు అవుతున్నాయని పేర్కొన్నాడు. అందుకే, ఇతర బౌలర్ల కన్నా ఎక్కువగా బుమ్రా గాయాలపాలవుతున్నాడన్నాడు. ‘‘బుమ్రాకి అయిన గాయం ఎలాంటిదో అర్థం కావడం లేదు. అయితే.. అతని బౌలింగ్ యాక్షన్ అసాధారణమైనది. దాని వల్ల తన శరీరంలోని వేర్వేరు అవయవాలు బాగా ఒత్తిడికి గురవుతాయి. ఇదే అతడిపై భారం మోపుతూ.. గాయపడటానికి కారణమవుతోంది’’ అంటూ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
ఇదే సమయంలో.. పని ఒత్తిడి వల్లే ఇటీవల బుమ్రా మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నాడని వ్యాఖ్యల్ని ఆకాశ్ చోప్రా తోసిపుచ్చాడు. గాయాల కారణంగానే అతడు జట్టుకి దూరంగా ఉండాల్సి వస్తోందని అన్నాడు. భారత జట్టుకి ఎంతో కీలకమైన ఆటగాడిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం తగదని పేర్కొన్నాడు. అయితే.. గాయాల కారణంగా బుమ్రా దూరమైతే.. జట్టుకి సమస్యలు తప్పవని సూచించాడు. అతని ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సలహా ఇచ్చాడు.
