Site icon NTV Telugu

Ajay Jadeja: ఏడు గంటలు ఎవరు ఆడుతారు.. వన్డే క్రికెట్‌పై బాంబ్

Ajay Jadeja On Odi Future

Ajay Jadeja On Odi Future

Ajay Jadeja Gives Blunt Response On Future Of ODIs: ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో వన్డే ఫార్మాట్‌పై ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి. తొలుత పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ క్రికెట్ షెడ్యూల్ నుంచి వన్డే ఫార్మాట్‌నే తొలగించాలని బాంబ్ పేల్చారు. ఈ ఫార్మాట్‌పై మునుపటిలా ఆసక్తి లేదని, ఎక్కువ సమయం వృధా అవుతోందని, దానికి పూర్తి స్వస్తి పలికే సమయం ఆసన్నమైందంటూ కుండబద్దలు కొట్టారు. అప్పుడు మరో పాక్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రీది రంగంలోకి దిగి.. వన్డేని 40 ఓవర్లకు కుదిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. అతని ప్రతిపాదనకు భారత మాజీ కోచ్ రవిశాస్త్రి సైతం మద్దతు తెలిపాడు.

ఇంతకుముందు 60 ఓవర్లున్న వన్డే పార్మాట్‌ను 50 ఓవర్లకు కుదించారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని 40 ఓవర్లలకు కుదిస్తే మంచిదని రవిశాస్త్రి పేర్కొన్నారు. అంతేకాదు.. 40 ఓవర్లలకు కుదిస్తే, వన్డేకు పూర్వవైభవం రావడంతో పాటు మునుపటి కన్నా మరింత ఆదరణ వస్తుందన్నారు. ఇప్పుడు టీ20కి ఎంత క్రేజ్ ఉందో, దానికి సమానంగానే వన్డే ఫార్మాట్ పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఇతరులు కూడా అలాంటి అభిప్రాయాల్నే వ్యక్తపరుస్తూ.. వన్డే క్రికెట్‌కు పూర్వవైభవం రావాలంటే, మల్టీ సిరీస్‌లతో పాటు ట్రయాంగులర్‌ సిరీస్‌లను ఎక్కువగా ఆడిస్తే మంచిదని చెప్తున్నారు. తాజాగా అజయ్ టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా సైతం రవిశాస్త్రి తరహాలోనే వన్డేను కొత్తగా డిజైన్ చేయాలని, లేదంటే ఈ ఫార్మాట్ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.

‘‘టెస్టులతో వన్డే క్రికెట్‌ను ఎప్పుడూ పోల్చలేం కానీ.. టీ20 ఫార్మాట్‌ వచ్చిన తర్వాత వన్డే క్రికెట్‌పై అందరికి ఆసక్తి తగ్గిపోయింది. టి20 మ్యాచ్‌ పుణ్యమా అని మూడు గంటల్లోనే ఫలితం వస్తోంది. అదే వన్డే మ్యాచ్‌లో ఏడు గంటలు ఆడాల్సి ఉంటుంది. ఏ ఆటగాడైనా.. త్వరగా ఫలితం వస్తున్న దానిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు. ప్రస్తుతం అదే జరుగుతోంది. ఆటగాళ్లు టీ20పైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మూడు గంటల్లో ఫలితం వస్తుంటే.. ఏడు గంటలు ఎవరు ఆడతారు? వన్డే క్రికెట్‌ను సరికొత్తగా డిజైన్‌ చేయాలి.. లేకపోతే ఆ ఫార్మాట్‌తో త్వరలో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది’’ అని జడేజా తెలిపారు. సర్వత్రా ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి.. వన్డేను 40 ఓవర్లకు కుదించొచ్చని అనిపిస్తోంది.

Exit mobile version