Aiden Markram Reaction: ఓ పక్క సుస్సు పడింది.. ఇలాంటి మ్యాచ్ ఎప్పుడూ ఆడలేదు!

  • అఫ్గానిస్థాన్‌పై రెండో సూపర్‌ ఓవర్లో దక్షిణాఫ్రికా విజయం
  • దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్‌ మార్‌క్రమ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
  • ఇలాంటి మ్యాచ్ కెరీర్‌లోనే ఎప్పుడూ ఆడలేదు
Aiden Markram Reaction

Aiden Markram Reaction

టీ20 ప్రపంచకప్‌ 2026లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్‌ మార్‌క్రమ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన క్రికెట్ కెరీర్‌లో ఎన్నడూ ఇలాంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఆడలేదన్నాడు. మ్యాచ్‌లో జరిగిన కొన్ని పరిణామాలు తనను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయని, ఓటమి భయం కూడా కలిగిందని నిజాయితీగా చెప్పాడు. నిజం చెప్పాలంటే ఓ సమయంలో సుస్సు పడిందని మార్‌క్రమ్‌ చెప్పుకొచ్చాడు. బుధవారం అఫ్గానిస్థాన్‌తో నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రెండో సూపర్‌ ఓవర్లో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఎయిడెన్‌ మార్‌క్రమ్‌ మాట్లాడుతూ… ‘నా క్రికెట్ కెరీర్‌లో ఇలాంటి మ్యాచ్ నేను ఎప్పుడూ ఆడలేదు. ఇది నిజంగా అద్భుత మ్యాచ్. బంతి బంతికి నాలో ఉత్కంఠ పెరిగింది. ఓడిపోతామేమో అన్న భయం నాకు చాలాసార్లు అనిపించింది. ఒక సమయంలో క్వింటన్ డీకాక్ నా దగ్గరకు వచ్చి.. ఈ మ్యాచ్ ఓడిపోతే మన పరిస్థితి ఏంటి?, ఎంత అవమానంగా ఉంటుందని అన్నాడు. అది ఆలోచించాక నాలో ఇంకా టెన్షన్ పెరిగింది’ అని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో మొదట దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేయగా. అఫ్గాన్‌ 19.4 ఓవర్లలో 187 పరుగులకే ఆలౌటైంది. మొదటి సూపర్ ఓవర్ టై కాగా.. రెండో సూపర్‌ ఓవర్లో సఫారీలు గెలిచారు.

Also Read: Nara Lokesh: ప్రతీ కంపెనీ క్రెడిబులిటీ ఉన్నవే.. అయానా, గయానా కంపెనీలకు భూములు ఇవ్వలేదు!

అఫ్గానిస్థాన్‌ జట్టు ప్రదర్శనను ఎయిడెన్‌ మార్‌క్రమ్‌ ప్రశంసించాడు. అఫ్గానిస్తాన్ బ్యాటర్ గర్బాజ్‌తో పాటు మొత్తం జట్టుకు అభినందనలు తెలిపాడు. ‘అఫ్గానిస్థాన్‌ టీమ్ అద్భుతంగా ఆడింది. గర్బాజ్‌ ఆసాధారణ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాడు. మిగతా వారు కూడా చాలా బాగా ఆడారు. చివరకు విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. మా ప్లేయర్స్ చాలా సంతోషించారు. టెన్షన్ పడిన నా సహచరులు.. విన్ కాగానే ఒక్కసారిగా గంతులేశారు. ఈ మ్యాచ్ మాకు ఓ గుణపాఠం. టోర్నీలో ఇంకా మంచి ప్రదర్శన చేయాల్సి ఉంది’ అని మార్‌క్రమ్‌ చెప్పాడు. మార్‌క్రమ్‌ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.