అండర్-19 ఆసియా కప్ 2025లో భారత్ భారీ విజయం అందుకుంది. దుబాయ్ వేదికగా మంగళవారం మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో 315 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్ దీపేశ్ దేవేంద్రన్ (5/22) మలేషియా పతనాన్ని శాసించాడు. 409 పరుగుల లక్ష్య ఛేదనలో మలేషియా 93 పరుగులకే ఆలౌట్ అయింది. మలేషియా జట్టులో హంజా పంగి (35) టాప్ స్కోరర్. డీయాజ్ పాత్రో (13), ముహద్ అఫినిద్ (12) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ అందుకున్నారు.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన మలేషియా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 రన్స్ చేసింది. అభిజ్ఞాన్ కుందు (209; 125 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లు) డబుల్ సెంచరీ బాదాడు. 121 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేయడం విశేషం. వేదాంత్ త్రివేది (90; 106 బంతుల్లో 7 ఫోర్లు), వైభవ్ సూర్యవంశీ (50; 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు చేశారు. మలేషియా బౌలర్లలో మహ్మద్ అక్రమ్ 5 వికెట్స్ పడగొట్టాడు.
భారీ ఛేదనలో మలేషియా తడబడింది. ఓపెనర్లు అజీబ్ వాజ్ది, మహ్మద్ హైరిల్ డకౌట్ అయ్యారు. డీయాజ్ పాత్రో (13), ముహద్ అఫినిద్ (12) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. దీపేశ్ దేవేంద్రన్ చెలరేగడంతో వరుస విరామాల్లో మలేషియా వికెట్స్ కోల్పోయింది. బ్యాటర్లు ముహమ్మద్ ఆలీఫ్ (1), ముహమ్మద్ ఫతుల్ ముయిన్ (6), ఎన్ సత్నకుమారన్ (5) నిరాశపరిచారు. ఇన్నింగ్స్ చివరలో హంజా పంగి 35 రన్స్ చేశాడు. లేదంటే మలేషియా 50-60 పరుగులకే ఆలౌట్ అయ్యేది. ఉదవ్ మోహన్ 2 వికెట్స్ పడగొట్టగా.. కిషన్ కుమార్ సింగ్, ఖాలాన్ పటేల్, కాన్షిక్ చౌహాన్ తలో వికెట్ తీశారు.
