టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అభిమానులకు అక్టోబర్ 31 మరపురాని రోజు అని చెప్పాలి. సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజు ధోనీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 2005లో శ్రీలంకతో టీమిండియా ఏడు వన్డేల సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో ధోని తన మాస్టర్ స్ట్రోక్ చూపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 299 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించింది. అక్టోబర్ 31,2005 జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.
Also Read: భారత్‌ను ఆందోళనకు గురి చేస్తున్న కివీస్ గత రికార్డులు
ఈ మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లను ధోనీ ఊచకోత కోశాడు. లక్ష్య ఛేదనలో మొదటి ఓవర్‌లోనే ఓపెనర్ సచిన్ టెండూల్కర్ వికెట్‌ను కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. కానీ మూడో స్థానంలో వచ్చిన ధోనీ మ్యాచ్ స్వరూపానే మార్చాడు. చివరి వరకు క్రీజులో ఉండి గెలుపును సులభతరం చేశాడు. ధోనీ 145 బంతుల్లో 183 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు. ముఖ్యంగా 15 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 183 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాతే ధోనీ టీమిండియా తుదిజట్టులో తన స్థానం ఖరారు చేసుకున్నాడని తెలిసిన విషయమే.
