World Bank About India: వచ్చే ఏడాది.. ఇండియా.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనుంది. ఈ నేపథ్యంలో.. పాపులేషన్‌కి తగ్గట్లే ప్రాథమిక సౌకర్యాలు పెరగాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు వచ్చే 15 ఏళ్లలో.. ముఖ్యంగా.. నగరాలకు ఎన్ని కోట్ల రూపాయల నిధులు కావాలి?, ప్రస్తుతం ఎంత లోటు బడ్జెట్ నెలకొంది? సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చుల్లో దేని వాటా ఎంత అనే విషయాలను వివరిస్తూ ప్రపంచ బ్యాంకు ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..
2036 నాటికి మన దేశంలోని అర్బన్ సిటీల్లో 60 కోట్ల మంది వరకు నివసించనున్నారు. అందువల్ల.. శరవేగంగా పెరుగుతున్న ఈ జనాభాకు తగ్గట్లు మౌలిక సదుపాయాలను కల్పించాలంటే ఏకంగా 840 బిలియన్ డాలర్ల మూలధన పెట్టుబడి కావాలని వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్‌లో వెల్లడించింది.
నగరాలు ఇప్పటికే విస్తరిస్తున్నాయి. కానీ.. నిధుల లేమి వల్ల ఆ ప్రక్రియ మందగిస్తోంది. ఈ నేపథ్యంలో సిటీలు ఆర్థికంగా వృద్ధి చెందాలన్నా.. ప్రజలు నాణ్యమైన జీవనం సాగించాలన్నా ఇన్వెస్ట్‌మెంట్లు ఇతోధికంగా సాయపడాలి. నగరాల్లో నివాసయోగ్యత మెరుగుపడాలన్నా.. వాతావరణ మార్పులను తట్టుకునేట్లు తయారుకావాలన్నా.. పెట్టుబడుల రూపంలో ఆర్థిక మద్దతు ఎంతైనా అవసరం.
read more: Indian Smart Watch Market: సరసమైన ధరల వల్లే నంబర్-1 స్థానం: కౌంటర్‌పాయింట్ రిపోర్ట్
వరల్డ్ బ్యాంక్ లెక్కేసిన ఈ 840 బిలియన్ డాలర్లలో సగం కన్నా కొంచెం ఎక్కువ.. అంటే.. 450 మిలియన్ డాలర్లు మునిసిపాలిటీల్లోని బేసిక్ సర్వీసులకే కావాలి. మంచి నీటి సరఫరా, మురుగు నీటి మళ్లింపు, మునిసిపల్ ఘన వ్యర్థాలు మరియు వీధి దీపాల నిర్వహణ, వరద నీటి పారుదల, పట్టణ రహదారుల నిర్మాణం, ప్రజా రవాణా వంటివాటికి భారీగా బడ్జెట్లు అవసరం.
మన దేశంలో ఇప్పటికే పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు చేస్తున్న మూలధన వ్యయం.. తలసరి అవసరాల అంచనా కంటే నాలుగు రెట్లు తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి పబ్లిక్-ప్రైవేట్ ఫైనాన్స్ అందుబాటులోకి రావాల్సిన అవసరముంది.
నిధుల అవసరానికి, కొరతకు మధ్య ఉన్న అంతరాన్ని చెరిపేయాలంటే పురపాలక రుణాలు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు, ప్రైవేట్ కమర్షియల్ ఫైనాన్సింగ్ పెరగాలని కేంద్ర ప్రభుత్వం సైతం ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ప్రస్తుతం పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు చేస్తున్న ఖర్చులో 75 శాతం వాటాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి.
పట్టణ స్థానిక సంస్థలు 15 శాతం ఫైనాన్స్ చేస్తున్నాయి. అత్యంత స్వల్పంగా 5 శాతం నిధులను ప్రైవేట్ వనరుల నుంచి పొందుతున్నారు అని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో వివరించింది. గ్రీన్, స్మార్ట్, ఇంక్లూజివ్ అండ్ సస్టెయినబుల్ అర్బనైజేషన్‌ను ప్రమోట్ చేయాలంటే భారీఎత్తున నిధులు కావాలి.
పట్టణ స్థానిక సంస్థలు.. ప్రత్యేకించి పెద్దవి మరియు క్రెడిట్ యోగ్యమైనవి.. ప్రైవేట్ వనరుల నుంచి మరిన్ని రుణాలు తీసుకోవడానికి అనుకూల వాతావరణాన్ని సృష్టించాలి. తద్వారా.. నగరాల్లో పెరుగుతున్న జనాభా జీవన ప్రమాణాలను ఆ లోన్లు స్థిరమైన పద్ధతిలో మెరుగుపరచగలవని నిర్ధారించుకోవడం చాలా కీలకమని ప్రపంచ బ్యాంక్ ఇండియా డైరెక్టర్ అగస్టే తనో కౌమే సూచించారు.
మరో వైపు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇదే ఆలోచనతో ఉండటం గమనించాల్సిన విషయం. మునిసిపల్ కార్పొరేషన్లు తమ వ్యవస్థాపక ఖర్చులను, పరిపాలన వ్యయాలను, వాటికయ్యే వడ్డీలను, ఫైనాన్స్ ఛార్జీలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరముందని ఆర్బీఐ అంటోంది.
ఇదిలాఉండగా.. మునిసిపాలిటీల సర్వీసులకు తక్కువ ఛార్జీలు అమల్లో ఉండటం, రెవెన్యూ వసూళ్లు నానాటికీ తీసికట్టుగా మారుతుండటంతో ప్రైవేట్ ఫైనాన్సింగ్ అవకాశాలను పొందటం దుర్భరంగా మారింది. సొంత ఆదాయ వనరుల సామర్థ్యం తగ్గిపోతుండటం వల్ల ట్యాక్సులు, గ్రాంట్ల పైన ఆధారపడటం పెరిగింది. ఈ నేపథ్యంలో సరికొత్త ఆర్థిక మార్గాలను అన్వేషించాల్సిన ఆవశ్యకత ఏర్పడుతోందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.