NTV Telugu Site icon

Work From Home: ఇన్ఫోసిస్‌కి ఇష్టం.. టీసీఎస్‌కి కష్టం..

Work From Home

Work From Home

Work From Home: ఐటీ రంగంలో అగ్రగామి సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరియు ఇన్ఫోసిస్‌ కొత్త సంవత్సరంలో తమ ఉద్యోగులకు సరికొత్త ఆఫర్‌ ప్రకటించాయి. అయితే.. ఆ ఆఫర్‌.. ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు ఆమోదయోగ్యం అనిపిస్తుండగా టీసీఎస్‌ ఉద్యోగులకు మాత్రం హార్డ్‌గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఉద్యోగులు వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ చేయాల్సిందేనని టీసీఎస్‌ కంపెనీ తేల్చిచెబుతుండగా.. వర్క్‌ ఫ్రం హోం అయినా పర్లేదంటూ ఇన్ఫోసిస్‌ అనుమతిస్తోంది. ఇన్ఫోసిస్‌కి ఇండియాలో దాదాపు 45 వేల మంది ఎంప్లాయీస్‌ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులు కంపల్సరీగా వర్క్‌ ప్లేస్‌కి వచ్చి రిపోర్ట్‌ చేయాల్సిన పనిలేదని ఇన్ఫోసిస్‌ సీఈఓ సలిల్‌ పరేఖ్‌ పేర్కొన్నారు.

Telangana Government: హైదరాబాద్‌లో మోడ్రన్‌ హాస్పిటల్స్‌ నిర్మాణ కాంట్రాక్టులు

వర్కర్లు ఆఫీసుకు ఆన్‌ టైమ్‌ రావాల్సిందేనని టీసీఎస్‌ సంస్థ.. రెండో మాటే లేదన్నట్లుగా.. నిక్కచ్చిగా చెబుతున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ సీఈఓ సలిల్‌ పరేఖ్‌ మాత్రం తమ ఉద్యోగులకు ఇలాంటి కండిషన్లేమీ లేవనే అర్థం వచ్చేలా పరోక్షంగా వ్యాఖ్యానించటం ప్రాధాన్యత సంతరించుకుంది.

సుదూర ప్రాంతాల్లో ఉంటూ వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ తక్షణం ఆ పని విధానానికి స్వస్తి చెప్పాలని టీసీఎస్‌ స్పష్టంగా చెబుతోంది. అనారోగ్యంతో బాధపడేవాళ్లు.. ఫిట్‌నెస్‌ విషయంలో అనీజీగా అనిపించేవాళ్లు డాక్టర్‌ సర్టిఫికెట్లను సమర్పించాలని, వాటిని కంపెనీ మెడికల్‌ బోర్డ్‌ చెక్‌ చేసి తగిన నిర్ణయం తీసుకుంటుందని టీసీఎస్‌ వివరించింది.

కంపెనీ మెడికల్‌ బోర్డు ఓకే అంటే ఆయా ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం చేయటానికి అభ్యంతరం లేదని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ తెలిపింది. ఇండియన్‌ సిలికాన్‌ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో వరదలొచ్చిన సమయంలో వర్క్‌ ఫ్రం హోం అనే అంశంపై ఐటీ దిగ్గజ సంస్థలు ఇలా భిన్నాభిప్రాయలను వ్యక్తం చేయటం చర్చనీయాంశంగా మారింది.

ఇదిలాఉండగా.. ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం చేసినా తమకు సమ్మతమేనని చెప్పిన ఇన్ఫోసిస్‌.. మూన్‌ లైటింగ్‌ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తుండటం గమనించాల్సిన విషయం. మూన్‌ లైటింగ్‌ సరికాదంటూ విమర్శించిన ఈ కంపెనీ.. ఏక కాలంలో ఒకటికి మించి బాధ్యతల్లో తలమునకలైన ఉద్యోగులను గతేడాది కొలువుల నుంచి తీసేసిన సంగతి తెలిసిందే.

అయితే.. మూన్‌ లైటింగ్‌ మరియు వర్క్‌ ఫ్రం హోం.. ఈ రెండింటి వల్ల కలిగే లాభనష్టాల మీద జరుగుతున్న చర్చ మధ్యలో ఉండగానే ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకోవటం చెప్పుకోదగిందే. బెంగళూరులోని ఐటీ హబ్ మొత్తం వరదల్లో చిక్కుకోవటంతో రవాణా వ్యవస్థ స్థంభించింది. అందుకే ఇన్ఫోసిస్ వర్క్ ఫ్రం హోంకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉద్యోగుల మనసు గెలుచుకుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో.. అసలు.. ఐటీ కంపెనీలకు అత్యుత్తమ వర్క్ ఫ్రం హోం పాలసీ ఏదీ అనే ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. దీనికి కాలమే సమాధానం చెప్పాలేమో అని విశ్లేషకులు అంటున్నారు.

Show comments