NTV Telugu Site icon

Upcoming Electric Cars in 2023: ఈ సంవత్సరం మార్కెట్‌లోకి వస్తున్న ఎలక్ట్రిక్‌ కార్లు

Upcoming Electric Cars In 2023

Upcoming Electric Cars In 2023

Upcoming Electric Cars in 2023: కొత్త సంవత్సరంలో.. కొత్త విద్యుత్‌ కార్ల లాంఛింగ్‌లతో.. ఆటోమొబైల్‌ రంగం అద్దిరిపోనుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. టాటా మోటార్స్‌, మహింద్రా, ఎంజీ తదితర సంస్థలు 2023లో నూతన మోడళ్లను ప్రవేశపెట్టనున్నాయి. ఇండియాలో ఇంధన ధరలు పెరగటం మరియు ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌కి ప్రోత్సాహం కోసం ప్రభుత్వం సబ్సిడీలను ఆఫర్‌ చేస్తుండటంతో ఈవీ సెక్టార్‌కి బూస్ట్‌ లాంటి సానుకూల వాతావరణం నెలకొందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఫలితంగా మన దేశంలో విద్యుత్‌ కార్లు బాగా ప్రజాదరణ పొందాయని తెలిపారు. 2022లో భారతదేశంలో టాటా టియాగో వంటి సరసమైన ధరలకు లభించే కార్లు మొదలుకొని BYD Atto 3 వంటి ప్రీమియం ఎలక్ట్రిక్‌ కార్ల వరకు వివిధ రకాల మోడళ్లు లాంఛ్‌ అయ్యాయి. ఇదే ట్రెండ్‌ 2023లో కూడా కొనసాగనుందని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో.. వచ్చే ఏడాది విడుదల కానున్న 6 అత్యుత్తమ విద్యుత్‌ వాహనాల గురించి తెలుసుకుందాం.

read more: OnePlus-11(5G) to launch in India: లాంఛింగ్‌ డేట్‌, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలు..

ముందుగా.. Mahindra XUV400 EVకి సంబంధించిన వివరాలు చూద్దాం. ఇది 2023లో ఎంట్రీ ఇవ్వనున్న ఫస్ట్‌ ఎలక్ట్రిక్‌ కార్‌. మహింద్రా సంస్థ రూపొందించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌ కూడా ఇదే. ఈ వాహనం.. వచ్చే నెలలోనే.. అంటే.. జనవరిలోనే.. ఒకే సారి 3 వేరియంట్లలో అందుబాటులోకి రావొచ్చంటున్నారు. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 456 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు.

50 నిమిషాల్లో 80 శాతం దాక ఛార్జింగ్‌ ఎక్కుతుంది. ఈ కారు ధర 17 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మన దేశ ఎలక్ట్రిక్‌ కార్ల సెగ్మెంట్‌లోని లీడింగ్‌ కంపెనీల్లో ఒకటైన టాటా మోటార్స్‌ తనదైన శైలిలో ఓ వేరియెంట్‌ని లాంఛ్‌ చేయబోతోంది. పాపులర్‌ ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్‌ హ్యాచ్‌బ్యాక్‌ ఆల్ట్రజ్‌ మోడల్‌కి ఇది ఎలక్ట్రిక్‌ వెర్షన్‌. ఈ ఆల్ట్రజ్‌ మోడల్‌ విద్యుత్‌ కారులో జిప్‌ట్రాన్‌ హైఓల్టేజ్‌ టెక్నాలజీని అమర్చనున్నారు.

దీనివల్ల సింగిల్‌ ఛార్జింగ్‌తో 250 నుంచి 300 కిలోమీటర్ల వరకు జర్నీ చేయొచ్చు. ఈ కారు.. టాటా ఐసీఈ వేరియెంట్‌ డిజైన్‌లోనే ఉంటుంది. కాకపోతే చిన్న మార్పులతో ఈవీ మోడల్‌ని రూపొందించారు. గంట సేపట్లో 80 శాతం వరకు ఛార్జింగ్‌ అవుతుంది. మోరిస్ గ్యారేజెస్ మోటార్ సంస్థ ఒక కాంప్యాక్ట్‌ ఎలక్ట్రిక్‌ కార్‌ని మన దేశంలో 2023 ప్రథమార్ధంలోపు ఆవిష్కరించే ఛాన్స్‌ ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌ని ఇండోనేషియాలో జరిగిన జీ20 సదస్సులో ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వ ప్రతినిధులు వాడిన అధికారిక వాహనం కూడా ఇదే కావటం విశేషం. ఈ కారు ప్రారంభ ధర ఇండియాలో దగ్గరదగ్గరగా 10 లక్షల రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు. ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే 200 నుంచి 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. ఇందులోని సింగిల్‌ ఫ్రంట్‌ యాక్సిల్‌ ఫిట్టెడ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ పవర్‌ ఔట్‌పుట్‌ దాదాపు 68 హార్స్‌ పవర్‌ అని చెబుతున్నారు.

హ్యుందాయ్‌ సంస్థ తన రెండో మోడల్‌ విద్యుత్‌ కారు IONIQ5ని కొద్దివారాల్లో ఆవిష్కరించనుంది. ఇ-జీఎంపీ ప్లాట్‌ఫామ్‌ బేస్డ్‌గా డిజైన్‌ చేసిన ఈ వాహనం ఇప్పటికే గ్లోబల్‌ మార్కెట్‌లో లాంఛ్‌ అయింది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 480 కిలోమీటర్ల వరకు జర్నీ చేయొచ్చు. కేవలం 18 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్‌ ఎక్కుతుంది. ఇంటీరియర్స్‌ని కస్టమర్లు తమకు నచ్చినవిధంగా డిజైన్‌ చేయించుకోవచ్చు.

సిట్రొయెన్‌ సంస్థ ఇండియాలో తన తొలి విద్యుత్‌ కారు eC3ని వచ్చే ఏడాది మార్చి లోపు లాంఛ్‌ చేయనుంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ ధర దాదాపు 12 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అంటున్నారు. అయితే.. ఆ కంపెనీ మాత్రం ఎలాంటి వివరాలనూ వెల్లడించలేదు. ఈ వాహనంలో 30 పాయింట్‌ 2 కిలో వాట్‌ అవర్‌ కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్‌ను అమర్చనున్నారు. 86 హార్స్‌ పవర్‌ సామర్థ్యం గల ఈ ఎలక్ట్రిక్‌ కారులో సింగిల్‌ ఛార్జింగ్‌తో 350 కిలోమీటర్ల వరకు జర్నీ చేయొచ్చు.

ప్రీమియం ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కావాలనుకున్నవాళ్లు BMW iX1 కోసం ఎదురుచూడాల్సిందే. ఎందుకంటే.. ఈ విద్యుత్‌ వాహనం వచ్చే ఏడాది జులై తర్వాతే మార్కెట్‌లోకి రానుంది. ఈ కారు రేటు సుమారు 60 లక్షల రూపాయలు. ఇందులో 2 ఎలక్ట్రిక్‌ మోటర్లు ఉంటాయని చెబుతున్నారు. ఇది 313 హార్స్‌ పవర్‌ను మరియు 494 Nm పీక్‌ టార్క్‌ను జనరేట్‌ చేయగలదు. ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే 438 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. పబ్లిక్‌ హైస్పీడ్‌ స్టేషన్లలో జస్ట్‌ 29 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జింగ్‌ అవుతుంది.