(నేడు ‘తల’ అజిత్ పుట్టిన రోజు)
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అజిత్ ఇవాళ తమిళనాడులో స్టార్ హీరో! రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో ఫాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అజిత్, విజయ్ నువ్వా- నేనా అన్నట్టుగా సాగుతున్నారు. మే 1 అజిత్ పుట్టిన రోజు. తమిళులు ‘తలా’ అని ప్రేమగా పిలుచుకునే అజిత్ కెరీర్ ప్రారంభంలోనే తెలుగు సినిమా ‘ప్రేమపుస్తకం’లో నటించడం విశేషం. అదీ గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్ దర్శకత్వంలో! ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే శ్రీనివాస్ ప్రమాదానికి గురై మరణించడంతో దానిని గొల్లపూడి మారుతీ రావు పూర్తి చేశారు. అజిత్ హీరోగా నటించిన తొలి తమిళ చిత్రం ‘అమరావతి’ 1993 జూన్ లో విడుదలైతే, ‘ప్రేమపుస్తకం’ అదే యేడాది జులైలో విడుదలైంది. గడిచిన ఇరవై ఎనిమిదేళ్ళలో అజిత్ 59 సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం అజిత్ 60వ చిత్రం ‘వాలిమై’ సెట్స్ పై ఉంది. 1996లో విడుదలైన అజిత్’ కాదల్ కొండై’ తెలుగులో ‘ప్రేమలేఖ’ పేరుతో డబ్ అయ్యి, ఇక్కడా విజయ బావుటా ఎగరేసింది. అయితే… ఆ తర్వాత అజిత్ నటించిన తమిళ అనువాద చిత్రాలేవీ ఆ స్థాయిలో ఆడలేదు. కానీ ఇటీవలే తిరిగి అజిత్ సినిమాలు తెలుగులో డబ్ కావడం మొదలైంది. తమిళ చిత్రం ‘వాలి’తో నటుడిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన అజిత్, ‘బిల్లా’తో స్టైలిష్ విలన్ గా కోలీవుడ్ తెరపై అవతరించాడు. రజనీకాంత్ తరహాలో అజిత్ ఎలా ఉంటే… అదే స్టైల్ అనే స్థాయికి చేరిపోయాడు. సాల్ట్ అండ్ పెపర్ స్లైల్… అజిత్ కు సింబాలిక్ గా మారిపోయింది. 2000 సంవత్సరంలో నటి షాలినిని అజిత్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. అజిత్ లేటెస్ట్ మూవీ ‘వాలిమై’ తో టాలీవుడ్ క్రేజీ హీరో కార్తికేయ విలన్ గా కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. మే 1తో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న అజిత్ ను అభిమానులే కాదు సినీ ప్రముఖులు సైతం అభినందనలతో ముంచెత్తుతున్నారు. సోషల్ మీడియా మొత్తం అజిత్ చిత్రాలతో కలర్ ఫుల్ గా మారిపోయింది.
అజిత్ : 50 సంవత్సరాలు… 60 చిత్రాలు!
