NTV Telugu Site icon

TCS New CEO Krithivasan: టీసీఎస్‌ CEOగా సరైనోడే. కృతివాసన్‌పై అందరిదీ ఇదే మాట

TCS New CEO Krithivasan

TCS New CEO Krithivasan

TCS New CEO Krithivasan: ఇండియాలోని అతిపెద్ద ఐటీ కంపెనీ TCSకి కొత్త CEOగా నియమితులైన కృతివాసన్‌పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈ పదవికి రాజీనామా చేసిన రాజేశ్‌ గోపీనాథన్‌ స్థానాన్ని ఈయన విజయవంతంగా భర్తీ చేయగలరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే.. ఈ సందేహాలకు ప్రతిఒక్కరి నుంచీ సానుకూలంగా ఫీడ్‌బ్యాక్‌ వస్తుండటం విశేషం.

కృతివాసన్‌ సామర్థ్యం మరియు నాయకత్వ లక్షణాల పట్ల విశ్లేషకులు పూర్తి భరోసా ప్రకటిస్తున్నారు. ఈయన CEOగా నియమితులు కాకముందు TCSలోని అతిపెద్ద విభాగమైన BFSIని సక్సెస్‌ఫుల్‌గా నడిపారు. BFSI అంటే.. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ అని అర్థం. BFSI సెగ్మెంట్‌.. TCSకి.. డిసెంబర్‌ క్వార్టర్‌లో 38 శాతం ఆదాయాన్ని అందించింది.

read more: Satya Nadella, GMR: సత్య నాదెళ్ల కొత్త ఇన్నింగ్స్‌. జీఎంఆర్‌తోపాటు మరింత మంది

ఇది.. 22 వేల 145 కోట్ల రూపాయలకు సమానం. TCSలో BFSI విభాగం విశేషంగా రాణిస్తుండటం కృతివాసన్‌కి ప్లస్‌ పాయింట్‌గా మారింది. దీనికితోడు ఈయన TCSకి ఏకంగా 34 ఏళ్ల నుంచి సేవలందిస్తున్నారు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ BFSI సెగ్మెంట్‌కి హెడ్‌ అయ్యారు. కాబట్టి.. CEO పోస్టుకి కృతివాసన్‌ కరెక్ట్‌ పర్సన్‌ అని, పర్ఫెక్ట్‌ ఛాయిస్‌ అని నువామా ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ సంస్థ పేర్కొంది.

ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌.. మోతీలాల్‌ ఓస్వాల్‌.. మరియు సెంట్రమ్‌ బ్రోకింగ్‌ తదితర కంపెనీలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. TCS CEO బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు రాజేశ్‌ గోపీనాథన్‌ ప్రకటించటం ఐటీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. ఈయన పదవీ కాలాన్ని ఐదేళ్లు పొడిగిస్తూ TCS యాజమాన్యం గతేడాదే నిర్ణయం తీసుకుంది.

ఇంతలోనే ఈ వార్త రావటాన్ని అనూహ్య పరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే.. ఇది.. TCSలో ఎలాంటి అవాంతరాలకూ దారితీయదని, అధికార పగ్గాల మార్పిడి సునాయాసంగా జరిగిపోతుందని నిపుణులు చెప్పారు. CEOగా రాజీనామా చేసినప్పటికీ రాజేశ్‌ గోపీనాథన్‌ మరో ఆరు నెలల పాటు కంపెనీలోనే ఉంటారు కాబట్టి బాధ్యతల బదలాయింపులో ఎలాంటి ఆటంకాలూ ఎదురుకావని పరిశీలకులు ఆశాభావం వెలిబుచ్చారు.

55 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన TCSకి కృతివాసన్‌ 5వ CEO మాత్రమే కావటం గమనించాల్సిన అంశం. అంటే.. ఒక్కో CEO యావరేజ్‌గా కనీసం పదేళ్లపాటు కొనసాగినట్లు అర్థంచేసుకోవచ్చు. పదేళ్లు అనేది లాంగ్‌టర్మే కాబట్టి ఈ సమయంలో CEOకి సంస్థ కార్యకలాపాలపైన పూర్తి పట్టు వస్తుంది. దీంతోపాటు మరో ముఖ్య విషయం గురించి చెప్పుకోవాలి.

రాజేశ్‌ గోపీనాథన్‌ ఎలాగూ సెప్టెంబర్‌ వరకు సంస్థలోనే కొనసాగనుండటం వల్ల ఆయన వెళ్లిపోతున్నారనే సంగతిని ఉద్యోగులు క్రమంగా జీర్ణించుకుంటారు. మరో వైపు.. కొత్తగా నియమితులైన కృతివాసన్‌కి అలవాటు పడతారు. దీంతో.. ఇతరత్రా వ్యవహారాలు సైతం సాఫీగా సాగిపోతాయి. TCSలోని లీడర్‌షిప్‌ పొజిషన్లలో చాలా మంది ఆ సంస్థవాళ్లే ఉన్నారు.

వాళ్లందరూ ప్రమోషన్ల ద్వారానే వచ్చారు. అందువల్ల వాళ్లకు కింది స్థాయి ఉద్యోగుల గురించి పూర్తి అవగాహన ఉంటుంది. ఫలితంగా.. నాయకత్వ మార్పు ప్రభావం ఉద్యోగుల మీద పడదు అనటానికి దీన్నొక చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. TCSలో అంతర్గతంగా చోటుచేసుకునే అధికార మార్పిడులన్నీ అడ్వాన్స్‌డ్‌గా, పక్కా ప్లానింగ్‌ ప్రకారం చోటుచేసుకుంటాయనటానికి కూడా ఇదొక ఎగ్జాంపుల్‌గా నిలుస్తుందని అనలిస్టులు అంటున్నారు.

కృతివాసన్‌కి TCSలో దాదాపు మూడున్నర దశాబ్దాల అనుభవం ఉండటం వల్ల క్లైంట్‌ రిలేషన్‌షిప్స్‌ విషయంలో కూడా ఎలాంటి ప్రశ్నలూ ఎదురయ్యే ఛాన్సే లేదని మోతీలాల్‌ ఓస్వాల్‌ సంస్థ తెలిపింది. 2017లో రాజేశ్‌ గోపీనాథన్‌ TCS CEO అయినప్పుడు ఇలాంటి వాతావరణం లేదని గుర్తుచేసింది. ఆయన పలు సవాళ్లను ఎదుర్కొన్నారని మోతీలాల్‌ ఓస్వాల్‌ రిపోర్ట్‌ పేర్కొంది.

TCS CEO మార్పు నేపథ్యంలో తెర మీదికి వచ్చిన మరో ప్రధానాంశం.. కంపెనీ స్టాక్స్‌ విలువ పడిపోవటం. రాజేశ్‌ గోపీనాథన్‌ సీఈఓగా తప్పుకోనున్నట్లు ప్రకటన వెలువడటంతో TCS షేర్ల విలువ 2 శాతానికి పైగా తగ్గి 3 వేల 100 రూపాయలకు చేరింది. అయితే.. ఈ ప్రతికూల ప్రభావం తాత్కాలికమేనని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ కంపెనీ స్పష్టం చేసింది. TCS షేర్లు ఎదుర్కొంటున్న ఈ కరెక్షన్‌ని ఇన్వెస్టర్లు సదవకాశంగా భావించాలని సూచించింది.

స్టాక్స్‌ వ్యాల్యూ తగ్గింది కాబట్టి మరిన్ని షేర్లు కొనుగోలు చేసుకోవటం ద్వారా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ లాభాలు ఆర్జించొచ్చని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ కంపెనీ పేర్కొంది. TCS షేర్లు గడచిన నెల రోజుల్లో 10 పాయింట్‌ 8 శాతం కరెక్షన్‌కి గురయ్యాయి. అయితే.. ఈ సంస్థకు డీల్స్‌ కంటిన్యూగా వస్తుండటం, వాటి వల్ల మార్జిన్లు వృద్ధి చెందుతుండటం పట్ల విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రానున్న రోజుల్లో TCS స్టాక్స్‌ విలువ ప్రస్తుత మార్కెట్‌ ధరలతో పోల్చితే 16 శాతం నుంచి 32 శాతం వరకు పెరగనున్నాయని నువామా రిపోర్ట్‌ తెలిపింది. కాబట్టి.. ఇప్పటివరకు చెప్పుకున్న ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. TCSకి కొత్త CEO కృతివాసన్‌ వల్ల అంతా మంచే జరగబోతోందనిపిస్తోంది.

Show comments