NTV Telugu Site icon

T+1 Settlement Cycle: ఒక్క రోజులోనే మన ఖాతాలోకి డబ్బులు లేదా సెక్యూరిటీలు

T+1 Settlement Cycle

T+1 Settlement Cycle

T+1 Settlement Cycle: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. T+1 సెటిల్మెంట్ సైకిల్ అందుబాటులోకి వచ్చింది. దీంతో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో ట్రేడింగ్ చేసిన సెక్యూరిటీస్ ఒక్క రోజు వ్యవధిలోనే మన డీమ్యాట్ అకౌంట్లలో జమవుతాయి. స్టాక్స్‌ విక్రయించగా వచ్చే డబ్బు లేదా ప్రాఫిట్స్‌ కూడా ఒక్క వర్కింగ్‌ డేలోనే మన చేతికొస్తాయి. దీనికి గతంలో 2 రోజులు పట్టేది.

మధ్యలో సెలవులొస్తే మరింత ఆలస్యమయ్యేది. కొత్త విధానం ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దీనివల్ల ఇన్వెస్టర్ల వద్ద ఎప్పుడూ డబ్బు మెదులుతుంది. ఫలితంగా BTST ప్రక్రియ.. అంటే.. బై టుడే సెల్ టుమాటో అనే ట్రేడింగ్ విధానం మరింత సులువవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లలో చైనా తర్వాత ఈ T+1 సెటిల్మెంట్ సైకిల్‌ని అమలుచేస్తున్న 2వ దేశం ఇండియానే కావటం విశేషం.

read more: Budget and Startups: కేంద్ర బడ్జెట్‌.. స్టార్టప్‌లకు ఏమిస్తుంది?

ఇండియన్ స్టాక్ మార్కెట్‌లోని స్టాక్స్, ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌, డెట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌ వంటి లిస్టెడ్ సెక్యూరిటీలన్నీ ఇక ఈ వన్ డే ట్రేడ్ సెటిల్మెంట్ సైకిల్ పరిధిలోకి వస్తాయి. శుక్రవారం కొనుగోలు చేసిన స్టాక్స్ కొత్త విధానం ప్రకారం ఒక్క రోజులోనే.. అంటే.. శనివారమే మన అకౌంట్‌లోకి క్రెడిట్ కావాలి.

కానీ.. శనివారం, ఆదివారం స్టాక్ మార్కెట్లకు సెలవు కావటంతో సోమవారం మన ఖాతాలోకి వస్తాయి. అప్పుడు వాటిని అమ్ముకోవటానికి వీలు కలుగుతుంది. వాస్తవానికి స్టాక్స్‌ను ఈ షార్ట్‌ ట్రేడ్ సైకిల్‌లోకి బదిలీ చేసే ప్రక్రియ 2022 ఫిబ్రవరిలోనే ప్రారంభమైంది. ప్రతి నెలా కొన్ని స్టాక్స్ చొప్పున యాడ్ చేస్తున్నారు. తక్కువ క్యాపిటలైజేషన్ విలువ కలిగిన స్టాక్స్‌ను ముందుగా మూవ్ చేశారు.

ప్రస్తుతం చివరి బ్యాచ్‌లోని 250కి పైగా స్టాక్స్‌ను కొత్త విధానంలోకి మార్చే ప్రక్రియ పూర్తికావొస్తోంది. T+1 సెటిల్మెంట్ సైకిల్ వల్ల మార్కెట్‌లో ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా, యూరప్, జపాన్, కెనడా వంటి దేశాలు ఇంకా T+2 సెటిల్మెంట్ సైకిల్‌నే ఫాలో అవుతున్నాయి. వాటి కన్నా వేగంగా మన దేశం T+1 సెటిల్మెంట్ సైకిల్‌ని అమల్లోకి తీసుకురావటం గొప్ప విషయమని అనలిస్టులు ప్రస్తావిస్తున్నారు.

ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్లలో చోటుచేసుకున్న ఈ చారిత్రక పరిణామం వల్ల BTST ట్రేడ్‌కు సంబంధించిన బ్యాడ్‌ డెలివరీ, ఆక్షన్స్‌ వంటి సమస్యలన్నీ చాలా వరకు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. స్టాక్ మార్కెట్‌లో సెటిల్‌మెంట్‌ వ్యవధి తక్కువగా ఉండటం వల్ల పెట్టుబడిదారులకు ఫండ్స్‌ శీఘ్రమే అందుతాయని, దీంతో ట్రేడింగ్‌ సాఫీగా జరుగుతుందని పరిశీలకులు పేర్కొన్నారు.

ఇండియన్‌ ఎకానమీ డిజిటల్‌ జర్నీ ఎంత వేగంగా జరుగుతోందో చెప్పేందుకు ఇదొక చక్కని ఉదాహరణ అని అన్నారు. ఈ దిశగా మనం ఎంతో అభివృద్ధి సాధించాం కాబట్టే ఈక్విటీ మార్కెట్‌ సెటిల్‌మెంట్లను 24 గంటల్లోనే పూర్తిచేసుకోగలుగుతున్నామని గుర్తుచేశారు. షేర్లు అమ్మిన ఒక్క రోజులోనే డబ్బు మన ఖాతాలో పడనుందని, దీనివల్ల స్టాక్స్‌ నిర్వహణ సామర్థ్యాలు పెరుగుతాయని చెప్పారు.

T+1 సెటిల్మెంట్ సైకిల్‌ని చైనా పాక్షికంగా అమలుచేస్తుండగా ఇండియా పూర్తి స్థాయిలో అమలుచేస్తూ గొప్ప ముందడుగు వేసిందని చెప్పటంలో ఎలాంటి సందేహంలేదని విశ్లేషకులు తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకున్నా కూడా ఇండియా.. స్టాక్‌ మార్కెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సేఫ్టీ వంటి అంశాల్లో ఎంతో ముందుందని చెప్పటానికి సంతోషం కలుగుతోందని అనలిస్టులు అన్నారు.

స్టాక్స్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో పెద్ద మొత్తంలో ట్రేడింగ్‌ ఎక్కువ శాతం ఇంట్రాడేలోనే జరుగుతుంది. కానీ.. ఆ ఇన్వెస్టర్లకు స్టాక్స్‌ డెలివరీ అనేది ఇన్‌స్టంట్‌గా జరగట్లేదు. డబ్బులకు సంబంధించిన ఆన్‌లైన్‌ పేమెంట్లు క్షణాల్లో జరుగుతుంటే స్టాక్స్‌కు సంబంధించిన సెటిల్‌మెంట్లు ఎందుకు తక్షణం పూర్తికావట్లేదు అనేది ఇన్నాళ్లూ ఆశ్చర్యకరంగా అనిపించేదని పరిశీలకులు పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి నిరీక్షణలకు అవకాశంలేదని తెలిపారు.