NTV Telugu Site icon

Special Story on Zepto: పదే పది నిమిషాల్లో డోర్‌ డెలివరీ. చందమామ కథలాంటి Zepto సక్సెస్‌ స్టోరీ..

Zepto

Zepto

Special (Success) Story of Zepto: ముందు.. క్యాబ్‌ బుక్‌ చేయండి. తర్వాత.. జెప్టోలో ఆర్డర్‌ పెట్టండి. ఏది త్వరగా వస్తుందో చూడండి. క్యాబ్‌ కన్నా ఫాస్ట్‌గా జెప్టో డెలివరీ బోయే ఫస్ట్‌ మీ ఇంటి ముందుంటాడు. ఈ వేగం జెప్టోకే సొంతం. ఇన్‌స్టంట్‌గా మీకేదైనా అవసరమైతే ఈ యాప్‌ 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తుంది. డెలివరీలో ఎంత వాయువేగంతో స్పందిస్తుందో బిజినెస్‌పరంగానూ అంతే శరవేగంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో జెప్టో ప్రస్థానంపై ప్రత్యేక కథనం..
YouTube video player

24 గంటల నుంచి 10 నిమిషాలకి

అమేజాన్‌, ఫ్లిప్‌కార్టుల్లో ఆర్డర్‌ పెడితే డెలివరీకి 24 గంటలు పడుతుందనే అభిప్రాయాన్ని బ్రేక్‌ చేస్తూ జెప్టో తెర మీదికి వచ్చింది. తక్కువ కాలంలోనే ‘న్యూ కామర్స్‌’ విభాగంలో తన ముద్ర వేసింది. మల్టిపుల్‌ కేటగిరీల్లో మెజారిటీ షేర్‌ని సొంతం చేసుకునే దిశగా పయనిస్తోంది. ఈ విజయం వెనక ఇద్దరు మిత్రులున్నారు. వాళ్ల పేర్లు.. ఆదిత్‌ పాలిచా మరియు కైవల్య వోహ్రా. వీళ్లు ఈ యాప్‌ని 2020లో రూపొందించి ఆన్‌లైన్‌ గ్రాసరీ డెలివరీ మార్కెట్‌లోకి అడుగుపెట్టారు. 900 మిలియన్‌ డాలర్ల కంపెనీగా డెవలప్‌ చేసి డెలివరీ టైమ్‌, డెలివరీ ఫార్మాట్ల విషయంలో పెద్ద టెక్‌ ప్లేయర్‌లకే ఛాలెంజ్‌ విసురుతున్నారు.

20 ఏళ్ల లోపే..

ఆదిత్‌ పాలిచా మరియు కైవల్య వోహ్రా ఇద్దరూ 20 ఏళ్ల లోపు వయసువారే కావటం విశేషం. కరోనా టైంలో లాక్‌డౌన్‌తో అందరూ సరుకులకు ఇబ్బండి పడిన సంగతి తెలిసిందే. ఈ సమస్యకు పరిష్కారంగా జెప్టోకి రూపకల్పన చేశారు. 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామనే క్రేజీ ఐడియాతో ముందుకొచ్చారు. ఆ ఆలోచనను పర్ఫెక్ట్‌గా ఆచరణలో పెట్టడంతో ఇన్వెస్టర్లు, వెంచర్‌ క్యాపిటలిస్టులు జెప్టోలో ఏకంగా 360 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టారు.

ఆకాశమే హద్దు

ఆదిత్‌ పాలిచా మరియు కైవల్య వోహ్రా లేటెస్ట్‌ బిజినెస్‌ మాడ్యూల్‌ ఆన్‌-డిమాండ్‌ కామర్స్‌పై ఫోకస్‌ పెట్టారు. అదే టైంలో అమేజాన్‌కి ఇండియా బిగ్గెస్ట్‌ అండ్‌ ఫాస్టెస్ట్‌ గ్రోయింగ్‌ ఓవర్సీస్‌ మార్కెట్‌ అయినప్పటికీ ఫాస్ట్‌ గ్రోయింగ్‌ కేటగిరీల్లో, న్యూ కామర్స్‌లో, టయర్‌-2, టయర్‌-3 సిటీల్లో తీవ్ర పోటీ ఉన్నట్లు గ్లోబల్‌ ఇన్వెస్ట్మెంట్‌ బ్యాంక్‌ బెర్న్‌స్టీన్‌ పేర్కొంది. విదేశీ సంస్థలకు ప్రతికూల నియంత్రణ వాతావరణం కూడా నెలకొందని తెలిపింది. ఈ నేపథ్యంలో జెప్టో ఎదుగుదలకు ఆకాశమే హద్దనే సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.

నెక్‌స్ట్‌ అమేజాన్‌

లాభాలపై దృష్టిపెట్టిన జెప్టో.. ఫుడ్‌, పర్సనల్‌ కేర్‌ ఐటమ్స్‌కి ప్రైవేట్‌ లేబుల్స్‌ వేయటంతోపాటు హాట్‌ స్నాక్స్‌, బేవరేజెస్‌ వంటి హై-మార్జిన్‌ కేటగిరీ ఐటమ్స్‌ని 24 బై 7 డెలివరీ చేపడుతోంది. వచ్చే ఏడాది రోజుకి 10 లక్షల డెలివరీలు చేసే స్థాయికి చేరుకుంటామని ఆదిత్‌ పాలిచా అన్నారు. మరిన్ని కేటగిరీలను యాడ్‌ చేయటం, మరింత మంది కస్టమర్లకు చేరువ కావటం ద్వారా ‘నెక్‌స్ట్‌ అమేజాన్‌’గా పేరొందనుందని నెక్సస్‌ వెంచర్‌ పార్ట్నర్స్‌ హెడ్‌ సువిర్‌ సుజన్‌ తెలిపారు. జెప్టో ఇప్పుడు హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబై, నోయిడా, పుణె, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ఘజియాబాద్‌, గుర్గావ్‌ నగరాల్లో నిత్యవసర సరుకులను డెలివరీ చేస్తోంది.

జెప్టో వచ్చిన కొత్తలో..

జెప్టో జర్నీ ముంబై శివారులో ప్రారంభమైంది. స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీ డ్రాపౌట్స్‌ అయిన ఆదిత్‌ పాలిచా మరియు కైవల్య వోహ్రా ఎంట్రప్రెన్యూర్లుగా మారాలనే తమ స్వప్నాన్ని జెప్టోతో సాకారం చేసుకున్నారు. ముందుగా కిరాణా స్టోర్ల నుంచి సరుకులు తీసుకొని కస్టమర్లకు డెలివరీ చేయటం మొదలుపెట్టారు. దీంతో రూట్‌ మ్యాపింగ్‌పై అవగాహన వచ్చింది. డెలివరీకి టైం పడుతున్నట్లు గుర్తించారు. ఆర్డర్లను సక్రమంగా పేర్చుకోవటం కూడా కుదిరేది కాదు. ఇలాగైతే కష్టమని, మార్జిన్లు సంపాదించటం అసాధ్యమని భావించి డెలివరీలో సమూల మార్పులు తేవాలనుకున్నారు.

కిరాణా కార్ట్‌తో మొదలు

అప్పట్లో వీళ్లకి కిరాణా కార్ట్‌ అనే యాప్‌తోపాటు వాట్సాప్‌ గ్రూపుల ద్వారా రోజుకి 2 వేల ఆర్డర్లు వచ్చేవి. దీంతో క్విక్‌ కామర్స్‌ మోడల్‌ ఫాలో అయ్యారు. 2 కిలోమీటర్ల లోపు ఇళ్లకు నిమిషాల్లో చేరుకోవటం ప్రారంభించారు. దీంతో కస్టమర్ల సంఖ్య పెరిగింది. ఆర్డర్లు అధికంగా రావటంతో వాటిలో కొన్ని ఐటమ్స్‌ మిస్‌ కావటంపై కంప్లైంట్లు వచ్చేవి. ఈ లోపాన్ని అధిగమించేందుకు వైకాంబినేటర్ అనే సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌ను లక్షా పాతిక వేల డాలర్లకు కొని దాని ద్వారా డెలివరీ వ్యవస్థను మానిటర్‌ చేశారు. దీనివల్ల డెలివరీ 20 నిమిషాల్లోపే జరుగుతున్నట్లు గుర్తించారు.

స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ను తలపించే డార్క్‌ స్టోర్‌

జెప్టో టీమ్‌ డెవలప్‌మెంట్‌ కోసం సీనియర్‌ ప్రొఫెషనల్స్‌ నియమకాన్ని ప్రారంభించారు. అయితే చాలా మంది ఈ సంస్థలో పనిచేసేందుకు ముందుకురాలేదు. 20 ఏళ్లు కూడా లేని కుర్రాళ్ల దగ్గర చేయటమేంటన్నారు. కానీ.. సరుకుల చేరవేతలోని సమస్యల పరిష్కారానికి సాంకేతికతను వాడటం ద్వారా 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్న జెప్టో మోడల్‌ క్లిక్‌ కావటంతో సీనియర్లు క్రమంగా చేశారు. ముంబైలోని అంధేరి ఈస్ట్‌లో జెప్టో డార్క్‌ స్టోర్‌ను స్టాక్ ఎక్స్ఛేంజ్‌ని తలపించేలా తీర్చిదిద్దారు. పెద్ద స్క్రీన్‌లపై ఆర్డర్ల నంబర్లు, పికప్‌ టైం ప్రదర్శించేవారు. ఆర్డర్‌ ప్యాకింగ్‌ 76 సెకన్లలోనే పూర్తయ్యేది.

30 అండర్‌ 30

బ్రెడ్‌, ఎగ్స్‌, పౌల్ట్రీ ప్రొడక్ట్స్‌ వంటి హైడిమాండ్‌ ఆర్డర్లను క్లియర్‌ చేసే ఏర్పాట్లు డార్క్‌ రూమ్‌ ఎంట్రన్స్‌లోనే ఉండేవి. డెలివరీ టైమ్‌ని 10 నిమిషాలకు తగ్గించటానికి భారీగా డేటా అనాలసిస్‌ చేశారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీని కూడా అప్లై చేశారు. డెలివరీ సిస్టమ్స్‌ను సింప్లిఫై చేశారు. ట్యాలెంటెడ్‌ పీపుల్‌ని, బెస్ట్‌ మైండ్స్‌ని హైర్‌ చేసుకొని టీమ్‌ని బలోపేతం చేశారు. సరుకుల డెలివరీతోనే లాభాల బాట పట్టలేమని గుర్తించి సప్లై చైయిన్‌ ఎక్స్‌పర్ట్స్‌ని రంగంలోకి దింపారు. రైతుల నుంచి ఫ్రెష్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ని, కంపెనీల నుంచి కన్జ్యూమర్‌ ప్రొడక్టులను సేకరించి డెలివరీ చేస్తున్నారు. జెప్టో సక్సెస్‌తో ఆదిత్‌ పాలిచా మరియు కైవల్య వోహ్రా.. ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన ప్రభావవంతమైన 30 అండర్‌ 30 ఆసియా జాబితాలో కనీసం వెయ్యి కోట్ల ఆదాయం గలవారి సరసన చేరి ఔరా అనిపించారు.