Special Story on Vikram S Kirloskar: ప్రతి ఒక్కరికీ బాల్యం నుంచి ఏదో ఒక అంశం మీద ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. దానికి అనుగుణంగా కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటే గొప్ప స్థాయికి చేరుకుంటారు. ఓ వ్యక్తి దీనికి తగ్గట్లే నడుచుకున్నాడు. చిల్లపిల్లాడిగా ఉన్నప్పుడే చక్కగా బొమ్మలు చెక్కేవాడు. సరికొత్త వస్తువులను తయారుచేసేవాడు. నూతన విమాన నమూనాలను రూపొందించేవాడు. మొత్తమ్మీద నిర్మించటం అనే కాన్సెప్ట్‌కు కనెక్టయ్యాడు. పెద్దయ్యాక ఇంజనీరింగ్ కోర్సును తెగ ఇష్టపడ్డాడు. పరిశ్రమను ప్రేమించాడు. పైకొచ్చేందుకు బాగా కష్టపడ్డాడు. తద్వారా.. మన దేశ ఆటోమొబైల్ రంగానికి మార్గదర్శకుడిగా పేరొందాడు. ఆయనే.. విక్రమ్ ఎస్ కిర్లోస్కర్. టయోటా కిర్లోస్కర్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ చైర్మన్. ఈ వారం మన డిఫైనింగ్ పర్సనాలిటీ.
కర్ణాటకలో 1958లో జన్మించిన విక్రమ్ ఎస్ కిర్లోస్కర్.. తన కుటుంబ సంస్థ అయిన కిర్లోస్కర్ గ్రూప్‌లో నాలుగో తరం పారిశ్రామికవేత్త. ఈ కంపెనీని 18వ శతాబ్దం తొలినాళ్లలోనే స్థాపించారు. మొదట్లో.. ఇనప నాగళ్లను తయారుచేసేవారు. కిర్లోస్కర్ గ్రూపు ఆ రోజుల్లోనే మన దేశ పారిశ్రామిక రంగానికి మూల స్థంభాల్లో ఒకటిగా నిలిచింది. ఇండియాలో అరుదైన సంస్థగా గుర్తింపు పొందింది. పువ్వు పుట్టగానే పరిమళించిందన్నట్లు విక్రమ్ కిర్లోస్కర్‌లో ముక్కుపచ్చలారని పసితనంలోనే ‘‘బిల్డింగ్ థింగ్స్’’ అనే భావన మొగ్గతొడిగింది. వయసుతోపాటు పెరిగి వటవృక్షంలాగ వృద్ధి చెందింది.
read more: World Bank Revised India GDP Growth: మన దేశ జీడీపీ గ్రోత్ రేట్ 6.9 శాతానికి పెంపు
ఈ క్రమంలో.. విక్రమ్ కిర్లోస్కర్.. ఇంజనీరింగ్ కోర్సుకు అమితంగా ఆకర్షితుడయ్యాడు. ఆ ఇంట్రస్టు ఆయన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటైన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరేలా చేసింది. చదువు పూర్తయ్యాక పుణేలోని తమ ఫ్యామిలీ బిజినెస్ అయిన కిర్లోస్కర్ కమిన్స్‌లోకి ప్రొడక్షన్ ఇంజనీర్ ట్రైనర్‌గా అడుగుపెట్టారు. ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచటం అప్పట్లో ఆయన టాస్క్. ఆ విధులను విక్రమ్ కిర్లోస్కర్ విజయవంతంగా నిర్వర్తించారు. తనదైన నైపుణ్యాలతో కొత్త పద్ధతులను శ్రీకారం చుట్టారు. ఆవిష్కరణలకు ఆద్యుడిగా మారారు. అంచనాలకు మించి రాణించారు. అందరి చేత శెభాష్ అనిపించుకున్నారు.
ఒకే సమయంలో ఒకే అంశంపై ఏకాగ్రతను నిలపటం, ఇచ్చిన పనిని ఇచ్చినట్లు మరియు చెప్పినవాటిని చెప్పినట్లు చేసుకుపోవటం, హార్డ్ వర్క్‌ను నమ్ముకోవటం తన విజయ రహస్యాల్లో ముఖ్యమైనవని విక్రమ్ కిర్లోస్కర్ చెప్పేవారు. ఒక ఫ్యాక్టరీ ఏవిధంగా పనిచేస్తుందో సమూలంగా అర్థంచేసుకోవటం, దాన్ని మరింత పెద్ద పరిశ్రమగా విస్తరించటం, పక్కాగా మెయిన్‌టెయిన్ చేయటం వంటివి కూడా తన సామర్థ్యాలని గుర్తుచేసేవారు. 30 ఏళ్లకు పైగా సాగిన సుదీర్ఘ కెరీర్‌లో ఈ పునాదుల పైనే 25కు పైగా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులను నిర్మించారు. సంస్థ వైస్ చైర్మన్‌గా అద్భుతమైన నిర్ణయాలను అమలుచేశారు.
జపాన్‌కి చెందిన మేజర్ ఆటోమొబైల్ కంపెనీ టయోటాని 1990ల్లో ఇండియాకి రప్పించటంలో విక్రమ్ కిర్లోస్కర్ కీలక పాత్ర పోషించారు. ఈ విషయంలో వరల్డ్ క్లాస్ విజన్ ప్రదర్శించారు. ఆ కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటుచేయటం ద్వారా ఇండియన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు. వాహన రంగంలో పాపులర్ మోడళ్లను ప్రవేశపెట్టారు. ఇన్నోవా, క్వాలిస్, కామ్రీ వంటి వాటిని ఎన్నింటినో మన దేశ రోడ్లపై దశాబ్ద కాలానికి పైగా శరవేగంతో పరుగులు పెట్టించారు. తద్వారా ఇండియాలో టయోటా మోటార్స్‌కి ముఖచిత్రంగా వెలుగొందారు.
విక్రమ్ కిర్లోస్కర్.. ‘‘గవర్నమెంట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఫర్ మెషీన్ టూల్స్’’లో పనిచేశారు. క్యాపిటల్ ఎక్విప్‌మెంట్ కోసం దిగుమతి లైసెన్సింగ్‌ను ప్రవేశపెట్టడంలో పాలుపంచుకున్నారు. బెంగళూరు సెంట్రల్ మ్యానిఫ్యాక్షరింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. 2013-15 మధ్య కాలంలో సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానిఫ్యాక్షరర్స్‌కి అధ్యక్షుడిగా ఉన్నారు. వాహనాల తయారీ పరిశ్రమను కర్ణాటకలో సుస్థిరంగా స్థాపించటం ద్వారా విక్రమ్ కిర్లోస్కర్ అందించిన సేవలకు గాను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ‘‘సువర్ణ కర్ణాటక’’ అనే అవార్డును బహూకరించింది.
2019-20లో విక్రమ్ కిర్లోస్కర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్‌గా పరిశ్రమను ముందుండి నడిపించారు. కరోనా విజృంభించటంతో ఆ సంవత్సరం భారతదేశ వాహన రంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. ఆ ఛాలెంజ్‌లను విక్రమ్ కిర్లోస్కర్ తన నాయకత్వ పటిమతో అధిగమించారు. ప్రభుత్వానికి, పరిశ్రమకు మధ్య బలమైన వారధిగా నిలిచారు. ఇండస్ట్రీ ప్రయోజనాల కోసం నిర్భయంగా గొంతెత్తారు. విక్రమ్ కిర్లోస్కర్ జపాన్ కంపెనీ టయోటాని ఇండియాకి రప్పించిన టైంలో మిగతా వ్యాపారవేత్తలు చాలా మంది చాలా విదేశీ ఆటో బ్రాండ్లను మన దేశానికి తేగలిగారు కానీ అవేవీ టయోటా రేంజ్‌లో నిలబడకపోవటం గమనించాల్సి అంశం.
మెటలర్జికల్ ఇండస్ట్రీస్‌లో విక్రమ్ కిర్లోస్కర్ చూపిన కార్పొరేట్ లీడర్‌షిప్‌కి గుర్తింపు లభించింది. 2020లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ నుంచి జేఆర్‌డీ టాటా అవార్డు పొందారు. విక్రమ్ కిర్లోస్కర్ వ్యాపార రంగంతోపాటు క్రీడలు, కళల పట్ల సైతం అభిరుచి కనబరిచేవారు. గోల్ఫ్ ఇష్టంగా ఆడేవారు. టెన్నిస్‌నూ ఎంజాయ్ చేసేవారు. కుంచె పట్టి బొమ్మలు గీసేవారు. వస్తువులను అందంగా చెక్కేవారు. వంట బాగా చేసేవారు. సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మ్యాన్‌గా, మానవతావాదిగా తననుతాను నిరూపించుకున్నారు. ప్యాషనేట్ ఇంజనీర్‌గా ఇండస్ట్రీలో పలుకుబడిని సొంతం చేసుకున్న విక్రమ్ కిర్లోస్కర్‌కి భార్య గీతాంజలి, కూతురు మాన్సి ఉన్నారు.