NTV Telugu Site icon

Special Story on SUVs Sales: ఈ కారు దారి.. ఇప్పటివరకు రహదారి. ఇక ముందు మరి?

Special Story On Suvs Sales

Special Story On Suvs Sales

Special Story on SUVs Sales: వినాయకచవితి.. రక్షాబంధన్.. దసరా.. దీపావళి.. నవరాత్రి.. కార్తీక మాసం.. ఈ పండగ సీజన్‌లో ఎస్‌యూవీ కార్లు హాట్‌కేకుల్లా సేల్‌ అయ్యాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ మరియు మిడ్ సైజ్ వాహనాల విక్రయాలు జోరుగా సాగాయని వార్తలు వస్తున్నాయి. ఎంట్రీ లెవల్‌ కార్ల అమ్మకాలకు సైతం భారీ గిరాకీ నెలకొందని డేటా వెల్లడిస్తోంది.

అన్ని కార్ల కంపెనీలకు కూడా బిజినెస్‌ హ్యాపీగా జరిగినట్లు దీన్నిబట్టి తెలిసిపోతోంది. అయితే.. ఇదంతా ఒక వైపు అనుకుంటే మరో వైపు.. డీలర్ల నుంచి, కస్టమర్ల నుంచి ప్రి-బుకింగ్‌ ఆర్డర్లు పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికీ కంపెనీలు వాహనాలను డెలివరీ చేయలేని పరిస్థితి నెలకొంది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌యూవీల షికారు ఇకపైనా ఇలాగే కొనసాగుతుందా లేక ఎదురుగాలి వీస్తుందా అనేది ఇప్పుడు చూద్దాం..

ప్యాసింజర్‌ వెహికిల్స్‌లో గత కొన్నేళ్ల నుంచి సబ్‌ కాంప్యాక్ట్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్స్‌ సెగ్మెంట్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ.. లేటెస్ట్‌ అండ్‌ మోడ్రన్‌ ఫీచర్లు, పెద్ద ఇంజన్‌ వంటి అప్‌డేట్స్‌, డెవలప్‌మెంట్స్‌ వల్ల ఎంట్రీ లెవల్‌ ఎస్‌యూవీల్లోని టాప్‌ వేరియంట్ల ధరలు పెరుగుతున్నాయి. చివరికి మిడ్‌ లెవల్‌ ఎస్‌యూవీల రేట్లను మించిపోతున్నాయి.

ఆరేళ్ల కిందట మారుతీ సుజుకీ మొట్టమొదటిసారిగా రూపొందించిన ఎస్‌యూవీ.. విటారా బ్రెజా.. ఆటోమొబైల్‌ మార్కెట్‌లో అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. దీంతో ఆ కంపెనీ అప్పటి ఎండీ అండ్‌ సీఈఓ కెనిచి అయుకవ సైతం ఆనందం వ్యక్తం చేశారు. తమ సంస్థకే చెందిన బాలెనో మోడల్‌ కారును.. మేకిన్‌ ఇండియాకి పోస్టర్‌గా పేర్కొంటే.. విటారా బ్రెజాని మాత్రం క్రియేట్‌ ఇన్‌ ఇండియాకి తాము ఇస్తున్న హామీ అన్నారు.

ఆయన అన్నట్లే ఇండియన్‌ మార్కెట్‌లో విటారా బ్రెజా సేల్స్ భారీగా పెరిగాయి. ఆరేళ్ల అనంతరం ఇప్పుడు బ్రెజా కొత్త మోడల్‌.. సన్ రూఫ్ మరియు 360 డిగ్రీ కెమెరాతో మార్కెట్లోకి వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో 6 లక్షల 65 వేల 216 ఎస్‌యూవీలు సేల్ అయ్యాయి. ఈ సంఖ్య.. 2015-16లో విక్రయించిన ఎంట్రీ లెవల్‌ ఎస్‌యూవీల కన్నా 5 రెట్లు ఎక్కువ కావటం విశేషం.

దీంతో ప్యాసింజర్ వెహికిల్ మార్కెట్‌లో ఎస్‌యూవీల సెగ్మెంట్ వాటా 2016 ఆర్థిక సంవత్సరంలోని 4 పాయింట్ 6 శాతం నుంచి 2022 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 21 పాయింట్‌ 7 శాతానికి చేరింది. ఇప్పటివరకు అంతా బాగానే సాగిపోతోంది. కానీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఎంట్రీ లెవల్‌ ఎస్‌యూవీల సేల్స్ ఇదే రేంజ్‌లో కొనసాగుతాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. మార్కెట్‌ వర్గాల అభిప్రాయాలు సైతం ఈ సందేహానికి బలం చేకూరుస్తుండటం గమనించాల్సిన విషయం.

వివిధ కారణాల వల్ల ఎస్‌యూవీల విక్రయాలు భవిష్యత్తులో ఈ రీతిలో ఉండకపోవచ్చని ఆటోమోటివ్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ జాటో డైనమిక్స్ ఇండియా ప్రెసిడెంట్ రవి భాటియా అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో అనూహ్యంగా 80 శాతం గ్రోత్ సాధించిన ఎస్‌యూవీల విక్రయాల్లో ఈసారి 33 శాతం మాత్రమే వృద్ధి నెలకొంటుందని తెలిపారు. కొత్త ప్రొడక్టుల లాంఛింగ్‌లు తక్కువ సంఖ్యలో ఉండటమే దీనికి కారణమని చెప్పారు.

హ్యుందాయ్ వెన్యూ మరియు న్యూ బ్రెజా మోడళ్ల ఆవిష్కరణలు మాత్రమే జరుగుతున్నాయని గుర్తుచేశారు. మిడ్ లెవల్‌ ఎస్‌యూవీలతో పోల్చితే సబ్ కాంప్యాక్ట్ ఎస్‌యూవీల సేల్స్‌ పెరుగుతున్నప్పటికీ ఆ వాహన తయారీదారులు కాస్త ఆందోళనగానే ఉన్నారు. అయితే.. టాటా మోటార్స్ మాత్రం సబ్ కాంప్యాక్ట్ ఎస్‌యూవీల కొనుగోళ్ల పట్ల పాజిటివ్‌గానే ఉంది.

2023 ఆర్థిక సంవత్సరంలో తమ ఓవరాల్ పోర్ట్‌ఫోలియోలో ఎస్‌యూవీల వాటా 66 శాతానికి పైగానే నమోదవుతుందని ఆ సంస్థ ప్యాసింజర్ వెహికిల్‌ సేల్స్, మార్కెటింగ్ అండ్ కస్టమర్ కేర్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ అంబా పేర్కొన్నారు. మారుతీ సుజుకీలో ఎంట్రీ లెవల్‌ ఎస్‌యూవీల ప్రొడక్షన్ కొన్నాళ్లుగా నిలిచిపోయింది. ఆ సంస్థ.. పాత విటారా బ్రెజా మోడల్‌ నుంచి కొత్త బ్రెజా మోడల్‌కి మారుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.

దీనివల్ల మారుతీ సుజుకీ సప్లై చెయిన్ దెబ్బతింది. చిప్ కొరత కూడా దీనికి తోడైంది. ఆగస్టులో బ్రెజాల ఉత్పత్తిని 15 వేలకు పెంచారు. ఆ తర్వాత నెల నెలా 13 వేల నుంచి 15 వేల వరకు తయారుచేయాలని నిర్ణయించుకున్నారు. అందువల్ల ఇప్పుడున్న ప్రి-బుకింగ్స్‌ని క్లియర్ చేయాలంటే కనీసం 6 నెలల వరకు సమయం పడుతుంది. కాబట్టి.. బ్రెజాకి ప్రస్తుతం అర్జెంట్ వెయిటింగ్ పీరియడ్ 5 నుంచి 6 నెలలు అని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

మరో వైపు.. మహింద్రా అండ్ మహింద్రా.. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో 2 లక్షల 40 వేల యూనిట్లు విక్రయించేందుకు బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఇందులో మొత్తం ఐదు మోడళ్ల ఎస్‌యూవీలు ఉండటం విశేషం. ప్రస్తుతం బ్రెజా మోడల్‌ కార్లకి 1 పాయింట్ 5 లీటర్ల పెట్రోల్ ఇంజన్ అమర్చుతున్నారు. మరింత పవర్‌ఫుల్ ఇంజన్‌ను ఇన్‌స్టాల్ చేయాలంటే దానికి 45 శాతం జీఎస్టీ స్లాబ్ అమలవుతుంది.

కానీ.. ఒక సబ్ 4 మీటర్ కార్‌కి మాత్రం 28 శాతం జీఎస్టీనే వర్తిస్తుంది. దీనికి పెద్ద ఇంజన్‌ను ఫిట్‌ చేస్తే అది పెద్ద కారు కేటగిరీలోకి రావటం వల్ల ఎక్కువ ట్యాక్స్ పడుతుంది. బీఎస్ 6 ఎమిషన్ నిబంధనలను అమలుచేయకముందు మారుతి సుజుకీ.. 1 పాయింట్ 3 లీటర్ల డీజిల్ ఇంజన్ నుంచి 1 పాయింట్ 5 లీటర్ల పెట్రోల్ పవర్ మిల్‌కి మారింది. వినియోగదారుల ప్రాధాన్యతల మేరకు అదనపు ఫీచర్లను చేర్చుకుంటూపోతే ఎంట్రీ లెవల్‌ ఎస్‌యూవీల రేట్లు మిడ్ లెవల్ ఎస్‌యూవీల ధరలను దాటేస్తున్నాయి.

దీంతో కస్టమర్లు క్రమంగా మిడ్ లెవల్ ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. కస్టమర్ల అభిరుచులు మారిపోతుండటంతోపాటు కంపెనీలు కొత్త మోడళ్లను లాంఛ్ చేస్తుండటంతో ప్యాసింజర్ వెహికిల్ మార్కెట్‌లో ఎస్‌యూవీల సెగ్మెంట్ వాటా త్వరలోనే పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో మరింత సేల్స్‌ గ్రోత్ నమోదు కావాలంటే.. అది.. డిమాండ్‌కు తగ్గట్లు వాహనాల ఉత్పత్తిని పెంచటంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు.