Special Story on Solar Power in India: మన దేశంలో సరికొత్త సౌర చరిత్ర ప్రారంభమైంది. దీంతో.. కరంట్ కోసం భవిష్యత్తులో బొగ్గు పైన మరియు శిలాజ ఇంధనాల పైన ఆధారపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఈ సంవత్సరంలోని మొదటి 6 నెలల్లో ఇండియా.. సోలార్ పవర్ జనరేషన్ ద్వారా 4.2 బిలియన్ డాలర్ల ఇంధన ఖర్చును తగ్గించుకోగలిగింది. 19.4 మిలియన్ టన్నుల బొగ్గును కూడా ఆదా చేసుకుంది. 2022 జనవరి నుంచి జూన్ వరకు భారతదేశంతోపాటు మరిన్ని దేశాలు సౌర విద్యుత్ వల్ల ఏ మేరకు లాభపడ్డాయో వివరిస్తూ కొత్త నివేదిక విడుదలైంది. అందులోని పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా గత దశాబ్ద కాలంలో నమోదైన సోలార్ గ్రోత్‌పై మూడు సంస్థలు విశ్లేషణ జరిపాయి. ఆ మూడు సంస్థల్లో ఒకటి.. ఎంబర్. ఇదో ఎనర్జీ థింక్ ట్యాంక్. రెండోది.. ‘ది సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్’. మూడో సంస్థ.. ‘ది ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనమిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలసిస్’. సోలార్ కెపాసిటీ కలిగిన ప్రపంచంలోని టాప్-10 ఎకానమీల్లో ఐదు ఆసియా ఖండంలోనే ఉన్నట్లు ఈ స్టడీలో తేలింది. ఆ ఐదు ఆర్థిక వ్యవస్థల పేర్లు.. ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా, వియత్నాం.
read more: Indian States Going Bankrupt: మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు.. మినీ శ్రీలంకలు కానున్నాయా?
ఆసియాలో ముఖ్యంగా ఏడు దేశాలు సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. అవి.. ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, థాయ్‌ల్యాండ్. ఈ ఏడు దేశాలు.. సోలార్ పవర్ వల్ల ఈ ఏడాదిలోని మొదటి ఆరు నెలల్లో 34 బిలియన్ డాలర్ల ఇంధన ఖర్చును తప్పించుకోగలిగాయి. ఇది ఈ సమయంలోని మొత్తం శిలాజ ఇంధన వినియోగ ఖర్చులో 9 శాతంతో సమానం. ఈ 34 బిలియన్ డాలర్ల సేవింగ్స్‌లో ఎక్కువ వాటా చైనాదే అని రిపోర్ట్ పేర్కొంది. చైనా కరంట్ డిమాండ్‌లో 5 శాతాన్ని ఈ సౌర విద్యుత్తే తీర్చింది. 21 బిలియన్ డాలర్ల విలువైన బొగ్గు మరియు గ్యాస్ దిగుమతులను కూడా నివారించినట్లు నివేదిక వివరించింది.
సోలార్ పవర్ వల్ల ఎక్కువగా ఇంధన ఖర్చులను తగ్గించుకున్న దేశాల జాబితాలో జపాన్ రెండో స్థానంలో ఉంది. ఆ దేశం 5.6 బిలియన్ డాలర్లను ఆదా చేసుకుంది. వియత్నాం 1.7 బిలియన్ డాలర్లను మిగిలించుకుంది. వియత్నాంలో 2018లో సౌర విద్యుత్ ఉత్పత్తి దాదాపు సున్నా టెరా వాట్ అవర్స్ కాగా ఆ స్థితి నుంచి ఈ సంవత్సరం 14 టెరా వాట్ అవర్స్ స్థాయికి చేరుకుంది. ఇది ఆ దేశంలోని మొత్తం విద్యుత్ డిమాండ్‌లో 11 శాతానికి సమానం.
థాయ్‌ల్యాండ్ మరియు ఫిలిప్పీన్స్ దేశాల్లో సోలార్ గ్రోత్ మందగించినప్పటికీ ఇంధన ఖర్చులు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గటం గమనించాల్సిన విషయం. థాయ్‌ల్యాండ్‌లో సౌర విద్యుత్.. కరంట్ డిమాండ్‌ను 2 శాతం మాత్రమే తగ్గించినప్పటికీ శిలాజ ఇంధన వినియోగాన్ని నివారించటం ద్వారా 209 మిలియన్ డాలర్ల కాస్ట్ కటింగ్ జరగటం విశేషం. ఫిలిప్పీన్స్‌లో కూడా అంతే. మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సోలార్ పవర్ పర్సంటేజీ ఒకటి మాత్రమే. కానీ.. ఇంధన వాడకానికి దూరం చేయటం ద్వారా 78 మిలియన్ డాలర్లను సేవ్ చేయగలిగింది.
సౌత్ కొరియాలో మొత్తం కరంట్ ఉత్పత్తిలో సౌర విద్యుత్ వాటా 5 శాతం కాగా అది 1.5 బిలియన్ డాలర్ల విలువైన శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించగలిగింది. ఈ నేపథ్యంలో ఆసియా దేశాలు సోలార్ పవర్ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవటంపై ఫోకస్ పెట్టాలని CREA’s Southeast Asia Analyst Isabella Suarez అభిప్రాయపడ్డారు. సౌర విద్యుత్‌తోపాటు పవన విద్యుత్ వంటి క్లీన్ ఎనర్జీ సోర్సులపై దృష్టి పెట్టడం ద్వారా ఆసియా ప్రాంతంలో ఇంధన భద్రతను సాధించాలని సూచించారు.
అదే సమయంలో.. బొగ్గు మరియు గ్యాస్ దిగుమతులు మరీ ప్రియంగా మారాయని, విశ్వసించదగ్గ విధంగా కూడా లేవని విభూతి గార్గ్ అనే నిపుణుడు పేర్కొన్నారు. శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధనాల వైపునకు మరలటం ద్వారా అన్ని వ్యవస్థల ఖర్చులతోపాటు వినియోగదారులపై విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుందని అన్నారు. అందువల్ల ఇండియా మరియు ఇతర ఆసియా దేశాలు రెనివబుల్ ఎనర్జీ ఎకోసిస్టమ్ నిర్మాణ దిశగా పెట్టుబడులను మళ్లించాలని తెలిపారు.
ఇటీవల కొన్నేళ్లుగా ఇండియాలో సోలార్ పవర్ ఉత్పత్తి మరియు వాడకంపై ప్రభుత్వాలు, ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని, ఈ పరిణామం ఇంధన భద్రతను మెరుగుపరచటమే కాకుండా సౌర విద్యుత్ విప్లవాన్ని తీసుకు రావటం ద్వారా ఆ సెక్టార్‌ని విద్యుత్ రంగం అనుసరించే పరిస్థితులు నెలకొన్నాయని ఎంబర్ సంస్థ నిపుణుడు ఆదిత్య లొల్లా చెప్పారు. రానున్న పదేళ్లలో ఇండియాలో సోలార్ పవర్ గ్రోత్ శరవేగంగా పరుగులు తీయనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.