Special Story on Shiv Nadar: దానం.. మనిషికి ఉండాల్సిన ఓ మంచి లక్షణం. కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదంటారు. కానీ ఆయన రెండు చేతులా చేస్తుంటారు. రోజుకి 3 కోట్ల రూపాయలు సమాజానికిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. సంపదను పంచిపెట్టడంలో తనకుతానే సాటని నిరూపించుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు నంబర్-1గా నిలిచారు. మరోసారి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇండియన్ మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌కి ఫౌండర్‌గానే కాకుండా హీరో ఆఫ్ ది చారిటీస్‌గా కూడా ఫేమస్ అయిన ఆయనే శివ్ నాడార్. ఈ వారం మన డిఫైనింగ్ పర్సనాలిటీ.
శివ్ నాడార్‌ని ఆయన ఫ్రెండ్స్ ముద్దుగా ‘‘మాగస్’’ అని పిలుస్తుంటారు. విజర్డ్ అనే ఇంగ్లిష్ వర్డ్‌కి ఇది పర్షియన్ పదం. విజర్డ్ అంటే.. అద్భుతమైన శక్తియుక్తులు గల వ్యక్తి అని అర్థం. 77 ఏళ్లు దాటిన శివ్ నాడార్ జీవితం కూడా ఈ నిక్ నేమ్‌కి తగ్గట్లే ఉంటుంది. తమిళనాడులో పుట్టిపెరిగిన ఈయన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివారు. పుణెలోని వాల్‌చంద్ గ్రూప్ కంపెనీ కూపర్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌లో 22 ఏళ్ల చిన్న వయసులోనే ప్రొఫెషనల్ కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ కొన్నాళ్లు పనిచేశాక కొంత మంది స్నేహితులు, సహచరులతో కలిసి సొంత సంస్థకు శ్రీకారం చుట్టారు.
శివ్ నాడార్ లాంఛ్ చేసిన ఫస్ట్ కంపెనీ పేరు మైక్రోకాంప్. ఇది తొలి రోజుల్లో ఇండియన్ మార్కెట్‌లో టెలీ డిజిటల్ క్యాలికులేటర్స్ సేల్స్‌పైన ఫోకస్ పెట్టింది. ప్రొఫెషనల్ కెరీర్‌ను మొదలుపెట్టిన దాదాపు పదేళ్లకు.. అంటే.. 1976లో శివ్ నాడార్ హెచ్‌సీఎల్‌ని స్థాపించారు. లక్షా 87 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పార్ట్నర్స్‌తో కలిసి స్టార్ట్ చేసిన ఈ సంస్థ మన దేశంలో సక్సెస్ అయింది. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. సింగపూర్‌లో ‘‘ఫార్ ఈస్ట్ కంప్యూటర్స్’’ని ఓపెన్ చేసి ఐటీ హార్డ్‌వేర్ ప్రొడక్టులను విక్రయించారు. అక్కడ కూడా అనుకున్నది సాధించటంతో శివ్ నాడార్ మరింత ముందుకు సాగారు.
1989లో అగ్రరాజ్యం అమెరికాలోని కంప్యూటర్ హార్డ్‌వేర్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వటంపై దృష్టిపెట్టారు. కానీ.. ఆ దేశ నియమ నిబంధనల వల్ల తొలుత ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రెండేళ్లు ఆగి 1991లో హ్యూలెట్ ప్యాకర్డ్ అనే సంస్థతో జట్టు కట్టి హెచ్‌సీఎల్-హెచ్‌పీ లిమిటెడ్‌ని ఏర్పాటుచేశారు. ఈ భాగస్వామ్యం యూఎస్ మార్కెట్‌లో మంచి ఆదాయాన్ని ఆర్జించి పెట్టింది. దీంతో శివ్ నాడార్ ఇక వెనుదిరిగి చూడలేదు. ఆ ఉత్సాహంతో హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ ఇవాళ 54 దేశాల్లోకి విజయవంతంగా విస్తరించింది.
2 లక్షల 19 వేల మందికి పైగా సభ్యులు కలిగిన గ్లోబల్ టీమ్, 210కి పైగా డెలివరీ సెంటర్లు, 60కి పైగా ఇన్నోవేషన్ ల్యాబ్‌లు, 10 వేల మంది సాఫ్ట్‌వేర్ అండ్ ప్రొడక్టుల క్లైంట్లు, 2 వేలకు పైగా పేటెంట్ డ్రైవింగ్ ఇన్నోవేషన్లు, 17 దేశాల్లో టాప్ ఎంప్లాయర్ వంటి విశేషాలెన్నింటికో ఈ కంపెనీ.. నిలయంగా మారింది. దీంతో శివ్ నాడార్.. వ్యక్తి స్థాయి నుంచి ఒక వ్యవస్థగా ఎదిగారు. ఈ నేపథ్యంలో తనకెంతో ఇచ్చిన సొసైటీకి ఎంతో కొంత ఇవ్వాలనే సదుద్దేశంతో తన పేరిటే ఒక ఫౌండేషన్‌కు ద్వారాలు తెరిచారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం 3 స్కూళ్లు మారిన శివ్ నాడార్ తనలాగే ఎవరూ ఇబ్బందిపడకూడదనే లక్ష్యంతో తన వంతు కృషి చేస్తున్నారు.
తండ్రి శివసుబ్రమణియ నాడార్ పేరిట చెన్నైలో ఎస్‌ఎస్‌ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌ను 1996 నుంచి నడుపుతున్నారు. అక్కడ జరిగే దాదాపు అన్ని కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. తన సంస్థ హెచ్‌సీఎల్ టెక్‌లోని 10 లక్షల రూపాయల విలువైన షేర్లను ఈ కాలేజీకి ఫండ్స్ రూపంలో ఇచ్చారు. 1998లో శివ్ నాడార్ తన వ్యాపారాన్ని 5 కేటగిరీలుగా విభజించారు. 1. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 2. హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్ 3. హెచ్‌సీఎల్ కామ్‌నెట్ 4. హెచ్‌సీఎల్ పెరోట్ 5. ఎన్‌ఐఐటీ.
ఇందులో.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్.. గ్లోబల్ ఐటీ సర్వీసెస్ కంపెనీగా, హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్.. ఇండియన్ ఐటీ హార్డ్‌వేర్ లీడర్‌గా, హెచ్‌సీఎల్ కామ్‌నెట్.. నెట్‌వర్క్ సర్వీస్ కంపెనీగా, హెచ్‌సీఎల్ పెరోట్.. ఐటీ అప్లికేషన్ల సంస్థగా, ఎన్‌ఐఐటీ.. ఎడ్యుకేషన్ సర్వీసెస్ కంపెనీగా సేవలందిస్తున్నాయి. ఇలా మన దేశంలోని ఐటీ రంగానికి మార్గదర్శకులుగా నిలిచిన అతికొద్ది మందిలో శివ్ నాడార్ కూడా ఒకరు కావటం చెప్పుకోదగ్గ విషయం. ఈ క్రమంలో ఆయన ఇండియాకి అందించిన అసమాన సేవలకు గాను ఎన్నో అత్యున్నత పదవులు, పద్మభూషణ్ లాంటి అత్యుత్తమ పురస్కారాలు, ప్రపంచ స్థాయి ప్రశంసలు లభించాయి.
అదే సమయంలో.. శివ్ నాడార్.. మన దేశంలో దాతృత్వానికి మారుపేరుగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 2011లో ఫోర్బ్స్ సంస్థ ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 48 మందితో రూపొందించిన ‘‘హీరోస్ ఆఫ్ ఫిలాంథ్రపీ’’ అనే జాబితాలో ఒకరిగా వార్తల్లో నిలిచారు. 2013లో ‘‘బీఎన్‌పీ పరిబాస్ గ్రాండ్ ప్రైజ్ ఫర్ ఇండివిడ్యువల్ ఫిలాంథ్రపీ’’ వరించింది. 2015లో ఫోర్బ్స్ ఇంటర్నేషనల్‌వారి ‘‘ది ఔట్‌స్టాండింగ్ ఫిలాంథ్రపిస్ట్ ఆఫ్ ది ఇయర్’’ లిస్టులో కూడా శివ్ నాడార్ పేరుండటం ఆయనలోని విశాలమైన వితరణ గుణానికి విలువైన నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
హురున్ ఇండియా రూపొందించిన ఫిలాంథ్రపీ లిస్ట్‌లో శివ్ నాడార్ 2016 మరియు 2019 సంవత్సరాల్లో మూడేళ్ల వ్యవధిలో రెండు సార్లు టాప్‌లో నిలవటం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. మరోసారి మూడేళ్ల అనంతరం.. అంటే.. ఈ ఏడాది కూడా ఆయన ఫస్ట్ ప్లేస్‌ను దక్కించుకోవటం గొప్ప విషయం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో శివ్ నాడార్ మొత్తం 11 వందల 61 కోట్ల రూపాయలను ప్రజల కోసం డొనేట్ చేశారు. ఈ సంపద రోజుకి సగటున 3 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది.
వివిధ సంస్థలు తయారుచేసే సంపన్నుల జాబితాల్లో పలుమార్లు టాప్-5లో నిలిచిన శివ్ నాడార్ ఒక దశలో సుమారు 29 బిలియన్ డాలర్లకు అధిపతి అయ్యారు. 2020లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్ పదవి నుంచి తప్పుకొని తన కూతురు రోష్ణి నాడార్‌కి బాధ్యతలు అప్పగించారు. శేష జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఫౌండేషన్‌ను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు బిలియన్ డాలర్లకు పైగానే నిధులను పబ్లిక్ కోసం ఖర్చుపెట్టారు. శివ్ నాడార్ అద్భుతమైన శక్తియుక్తులు గల వ్యక్తని ఇప్పుడు ఆయన మిత్రులే కాదు. జనాలూ అనుకుంటున్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.