Site icon NTV Telugu

Special Story on ONDC: ఓఎన్‌జీసీ కాదిది. ఓఎన్‌డీసీ. అమేజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల పరిస్థితి ఏమవుతుందో వెయిట్‌ అండ్‌ సీ.

Ondc Final

Ondc Final

Special Story on ONDC: ఓఎన్‌డీసీ అంటే.. ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌. ఇది ఇ-కామర్స్‌ కోసం ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఓపెన్‌ సోర్స్‌ ప్లాట్‌ఫాం. ఇ-కామర్స్‌కి సంబంధించి యూపీఐ లాంటిది. ఆన్‌లైన్‌ పేమెంట్స్‌లో యూపీఐ ఒక విప్లవం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇలాగే డిజిటల్‌ కామర్స్‌లో కూడా ఓఎన్‌డీసీ ఒక రెవల్యూషన్‌ తీసుకొస్తుందనే అంచనాతో మొదలైంది. వినియోగదారుల వైపు నుంచి ఆలోచిస్తే ఇదొక ఈజీ యాక్సెస్‌ ట్రేడింగ్‌ యాప్‌ సిస్టమ్‌. 2022 మే 8న కేంద్ర ప్రభుత్వం 5 నగరాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించింది. డిజిటల్‌ మోనోపలీని బ్రేక్‌ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్‌ దీన్ని ముందుకు తీసుకొచ్చింది. స్మాల్‌ బిజినెస్‌లను ప్రోత్సహించడం, అమేజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల వంటి పెద్ద సంస్థలకు చెక్‌ పెట్టడం కూడా దీని ముఖ్య ఉద్దేశాలే. ఓఎన్‌డీసీ ఏర్పాటుకు నందన్ నిలేకని చొరవ తీసుకున్నారు.

ఇ-కామర్స్‌ సాధారణంగా రెండు మోడళ్ల ఆధారంగా జరుగుతుంది. మొదటిది ఇన్వెంటరీ మోడల్‌. ఇందులో.. ఉత్పత్తిదారుల నుంచి అతితక్కువ ధరకు వస్తువులను సేకరించి వాటిని డైరెక్టుగా కొనుగోలుదారులకు అధిక ధరకు విక్రయిస్తారు. రెండోది.. మార్కెట్‌ ప్లేస్‌ మోడల్‌. ఇందులో ఇండిపెండెంట్‌ బయ్యర్లు మరియు సెల్లర్లు ఉంటారు. వీళ్లను వెబ్‌సైట్‌ మరియు మొబైల్‌ యాప్‌ ద్వారా కనెక్ట్‌ చేసే ప్లాట్‌ఫామ్స్‌గా ఇ-కామర్స్‌ కంపెనీలు పనిచేస్తాయి. కంపెనీలు మార్కెట్‌ ప్లేస్‌ మోడల్‌తో పోల్చితే ఇన్వెంటరీ మోడల్‌తోనే ఎక్కువ లాభాలను ఆర్జిస్తాయి. అమేజాన్‌ ఇండియాకి ప్రధానంగా అపారియో రిటైల్‌ మరియు క్లౌడ్‌ టెయిల్‌ అనే రెండు అతిపెద్ద సెల్లర్స్‌ ఉన్నాయి. అమేజాన్‌ ఇండియా మొత్తం విక్రయాల్లో 35 శాతం ప్రొడక్టులు ఈ కంపెనీలవే కావటం విశేషం.

అయితే.. ఇన్వెంటరీ మోడల్‌ను ఇకపై అమేజాన్‌ మరియు ఇతర విదేశీ ఇ-కామర్స్‌ కంపెనీలు ఉపయోగించకుండా కేంద్ర ప్రభుత్వం 2016లో ఒక నిబంధన తీసుకొచ్చింది. ఏదైనా ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అధిక లాభాలను కూడగట్టాలంటే మొదట వస్తువులను తక్కువ ధరకు కొనుగోలు చేసి మార్జిన్లను పెంచి అమ్ముతుంది. ఓఎన్‌డీసీని మొదలుపెట్టడానికి దారితీసిన కారణాల్లో మొదటిది.. మైక్రో బిజినెస్‌లను మరియు చిన్న సెల్లర్లను ప్రోత్సహించటం. రెండో కారణం ఏంటంటే.. ఇ-కామర్స్‌ కంపెనీలు అధిక డిస్కౌంట్లు ఇవ్వటం వల్ల చిన్న పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇది కొనుగోలుదారులకు ఉపయోగకరమే అయినప్పటికీ ఎకానమీని దెబ్బతీస్తుందని ప్రభుత్వం భావించింది.

మూడోది మరియు ముఖ్యమైంది.. ఇ-కామర్స్‌ కంపెనీల ద్వారా కొనుగోలు చేసే వస్తువుల ప్రైస్‌ రేంజ్‌, ఫీచర్స్‌, అత్యధికంగా సేలయ్యే కలర్లు.. ఇవన్నీ కొనుగోలు చేసే ప్లాట్‌ఫాం కంపెనీలకు తెలుస్తాయి. దీనివల్ల కొనుగోళ్లు ఎక్కువగా ఏయే నగరాల్లో జరుగుతున్నాయో తెలుసుకొని ఆ సిటీల్లో చిన్న తయారీ యూనిట్లను మరియు గోదాములను ఏర్పాటుచేస్తున్నారు. అధికంగా కొనుగోలయ్యే వస్తువు స్పెసిఫికేషన్లు అన్నీ ఉండేలా వాటి మాదిరి ప్రొడక్టులను ఆయా యూనిట్లలో తయారుచేసి తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఈ ప్రొడక్టులకు బెస్ట్‌ సెల్లర్‌ లేబుళ్లను కూడా ఇవ్వటం మరియు టాప్‌ లిస్ట్‌లో పెట్టడం వల్ల ఆయా రంగాల్లోని మిగతా పోటీ సంస్థలు నష్టపోతున్నాయి. వీళ్ల వేర్‌హౌజ్‌లు మరియు యూనిట్లు ఒకే ఏరియాలో ఉండటం వల్ల డెలివరీ ఫీజులు వాటి పోటీ సంస్థల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

ఇండియాలోని ప్రైస్‌ సెన్సిటివ్‌ మార్కెట్ దృష్ట్యా వినియోగదారులు అధికంగా ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో దొరికే వస్తువులనే కొంటున్నారు. లూయిస్‌ ఫిలిప్‌, ఎసెన్షియా, జాన్‌ మిల్లర్‌ తదితర ఏడు బెస్ట్‌ సెల్లింగ్‌ బ్రాండ్స్‌ మీద అమేజాన్‌ స్టడీ చేసి సింబల్‌ అనే బ్రాండ్‌ను జనాల్లోకి తీసుకొచ్చింది. అది 25 బెస్ట్‌ సెల్లింగ్‌ మెన్స్‌ ఫార్మల్ షర్ట్స్‌లో ఒకటిగా నిలవటం దీనికి నిదర్శనం. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఓఎన్‌డీసీ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశాల్లో మొదటిది డిస్కవరబిలిటీ. మనం ఏదైనా వస్తువును కొనాలంటే ముందుగా అమేజాన్‌ లేదా ఫ్లిప్‌కార్ట్‌ వంటి యాప్‌లే గుర్తొస్తాయి. ఎందుకంటే అవి అప్పటికే ఫోన్‌లో డౌన్‌లోడ్‌ అయి ఉండటం మరియు కార్డు, అడ్రస్‌ వివరాలు సేవ్‌ అయి ఉండటం వల్ల మనకి బయట షాపింగ్‌ చేయాలనే ఆలోచన రాదు. దీనివల్ల టైమ్‌ కూడా కలిసొస్తుంది.

ఇదే వస్తువును ఓఎన్‌డీసీలో సెర్చ్‌ చేస్తే వందల కంపెనీలు ‘ఇ-సముదాయ్‌’లా కనిపిస్తాయి. ఇది లోకల్‌ షాపులన్నింటినీ ఒక చోటకు చేర్చి యాప్‌లో అందుబాటులోకి తీసుకురావటంతో బ్రాండెడ్‌వే కాకుండా అతి తక్కువ ధరలో ఉన్నవాటిని కూడా కొనుగోలు చేయొచ్చు. దగ్గరలోనే ఉండటం వల్ల తక్కువ సమయంలోనే డెలివరీ అవుతుంది. ఓఎన్‌డీసీ రావటం వల్ల అన్ని ఇ-కామర్స్‌ సైట్లను విడివిడిగా డౌన్‌లోడ్‌ చేయకుండానే ఒక చోట కనబడటంతోపాటు లోకల్‌ ప్లేయర్స్‌ కూడా ఇందులో ఉంటారు. ఓఎన్‌డీసీ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశాల్లో రెండోది డెలివరీ ఛాయిస్‌.. ఉదాహరణకు మనం ఆర్డర్‌ చేయాలనుకున్న సమయంలో డెలివరీ బాయ్‌లు అందుబాటులో లేకపోవటం లేదా తక్కువ మంది ఉండటం వల్ల మనకు డెలివరీ లేట్‌ అవటమే కాకుండా ఛార్జ్‌ కూడా పెరుగుతుంది.

కానీ.. ఓఎన్‌డీసీలో డెలివరీ కంపెనీల లిస్టు, అగ్రిగేటర్స్‌, కస్టమర్స్‌, రెస్టారెంట్స్‌ అన్నీ ఒక చోట ఉండటం వినియోగదారులకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. ఏదైనా ఒక కంపెనీ డెలివరీ బాయ్‌లు అందుబాటులో లేకపోతే ఇది దగ్గరలో ఉన్న వేరే ఏజెంట్లను చూపిస్తుంది. తద్వారా వాళ్లను డెలివరీ పార్ట్నర్‌లుగా వాడుకొని మనకు కావాల్సిన ఆర్డర్‌ ప్లేస్‌ చేసుకోవచ్చు. ఓఎన్‌డీసీ ముఖ్య ఉద్దేశాల్లో మూడోది ప్రైస్‌ కంపారిజన్‌. ఇందులో రేట్లను కంపేర్‌ చేసుకునే సౌలభ్యం ఉంది. ఉదాహరణకు పైన చెప్పుకున్నట్లు అమేజాన్‌ వంటి ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఇతర బ్రాండ్లను డూప్లికేషన్‌ చేసి బెస్ట్‌ ఛాయిస్‌గా తక్కువ ధరకు అమ్ముతున్నప్పుడు ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫామ్‌లో మాత్రం ఇతర అన్ని ఇ-కామర్స్‌ కంపెనీల్లోని తక్కువ ధరలో ఉన్న వస్తువులను కంపేర్‌ చేసుకొని కొనుగోలు చేయొచ్చు.

ఇ-కామర్స్‌లో ఎదురవుతున్న ఈ లోపాలన్నింటినీ అధిగమించటానికి ప్రభుత్వం వ్యాపారులను మరియు కన్జ్యూమర్లను సింగిల్‌ నెట్‌వర్క్‌లోకి తీసుకొచ్చి ఎంపవర్‌ చేయటానికి ముందడుగు వేసింది. ప్రభుత్వం ఇలాంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం కనుగొనటం ఇదే మొదటిసారి. పెద్ద పెద్ద కంపెనీల మోనోపలీని బ్రేక్‌ చేస్తూ దీన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి. అయితే.. నందన్‌ నీలేకని వంటి మేధావులు ఈ దిశగా చొరవ చూపటం మరింత ఆసక్తి కలిగిస్తోంది. ఓఎన్‌డీసీ ప్రాజెక్టులో 5.5 శాతం స్టేక్‌ను 10 కోట్ల రూపాయలకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రీసెంట్‌గా అక్వైర్‌ చేసుకోవటం విశేషం.

Exit mobile version