NTV Telugu Site icon

Special Story on Nykaa’s Business Model: ‘‘నైకా’’ అనగానే.. నై నై అంటున్నారు.. ఎందుకిలా?

Special Story On Nykaa’s Business Model

Special Story On Nykaa’s Business Model

Special Story on Nykaa’s Business Model: నైకా అనే ఇ-కామర్స్‌ కంపెనీకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంస్థ రెండేళ్ల కిందట అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మహిళ సారథ్యం వహిస్తున్న ఫస్ట్‌ ఇండియన్‌ యూనికార్న్‌ స్టార్టప్‌గా గుర్తింపు తెచ్చుకుంది. పదేళ్ల కిందట ప్రారంభమైన ఈ పాపులర్‌ ఆన్‌లైన్‌ బ్యూటీ అండ్‌ పర్సనల్‌ కేర్‌ రిటైలర్‌.. ఏడాది క్రితం ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌కి వచ్చింది. తద్వారా 5 వేల 352 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది. దీంతో నైకా ఫౌండర్‌ ఫల్గుణి నాయర్‌ ఫేమస్‌ అయ్యారు. బిలియనీర్ల జాబితాల్లో చోటు సంపాదించారు. కానీ ఏడాది తిరిగే సరికి పరిస్థితి తిరగబడింది. ఈ సంస్థ అనుసరిస్తున్న బిజినెస్‌ మోడల్‌ పట్ల పెట్టుబడిదారుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. దీనికి దారితీసిన కారణాలేంటనేదే ఈ ప్రత్యేక కథనం ప్రధాన ఉద్దేశం..

నైకా అనే బ్రాండ్‌ నేమ్‌ని నాయక అనే సంస్కృత పదం నుంచి తీసుకున్నారు. సంస్కృతంలో నాయక అంటే నటీమణి లేదా అభినేత్రి అని అర్థం. పేరుకు తగ్గట్లే ఈ సంస్థ లీడర్‌ కూడా ఒక లేడీ కావటం ఆసక్తికరం. 2015 వరకు కేవలం ఆన్‌లైన్‌ సేల్స్‌కే పరిమితమైన నైకా.. ఆ ఏడాది నుంచి ఓమ్ని ఛానల్‌ మోడల్‌కి మారింది. ఓమ్ని ఛానల్‌ మోడల్‌నే మల్టీ ఛానల్‌ అప్రోచ్‌ అని కూడా అంటారు. అంటే.. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో కూడా అమ్మకాలను ఆరంభించారు. ఐదేళ్ల అనంతరం.. 2020లో ‘నైకా మ్యాన్‌’ అనే ఇ-కామర్స్‌ స్టోర్‌ని, ‘నైకా డిజైన్‌’ స్టూడియాని, ‘నైకా పీఆర్‌ఓ’ అనే ప్రీమియం మెంబర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ని లాంఛ్‌ చేశారు.

read more: Indian Economy: మన ఆర్థిక వ్యవస్థ.. నిన్న.. నేడు.. రేపు

నైకా గత సంవత్సరం ఐపీఓకు రావటం, నేషనల్‌ మరియు బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో నమోదుకావటం చకచకా జరిగిపోయాయి. అయితే.. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో వ్యాపారంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త తరం టెక్నాలజీ ఆధారిత బిజినెస్‌లు పెద్ద సంఖ్యలో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో ప్లాట్‌ఫామ్‌ బిజినెస్‌లకు ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఫలితంగా వాటి అభివృద్ధికి విఘాతం కలిగింది. మరీ ముఖ్యంగా నైకా కంపెనీ ప్లాట్‌ఫామ్‌ స్టేటస్‌ ప్రశ్నార్థకంగా మారింది. నైకాది ప్లాట్‌ఫామ్‌ స్టేటస్‌ కాదని, సమర్థవంతమైన ఆన్‌లైన్‌ పైప్‌లైన్‌ స్థాయి అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కుండబద్ధలు కొట్టింది.

మన దేశంలో తొలిసారిగా బ్యూటీ ప్రొడక్టులను ఆన్‌లైన్‌లో రిటైల్‌గా విక్రయించిన సంస్థల్లో నైకా ఒకటి కావటం చెప్పుకోదగ్గ విషయం. అందువల్ల ఈ కంపెనీకి ఇతర సంస్థల మాదిరిగా ఉత్పత్తులను ఫిజికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ చేయటం సవాల్‌గా మారింది. ప్లాట్‌ఫామ్‌ బిజినెస్‌లు ఇలాంటి అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు.. అజియో, టాటా క్లిక్‌ పాలెట్‌, మింత్రా వంటి పెద్ద కంపెనీలతో పోటీపడి వాణిజ్య ప్రకటనల రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సి వచ్చింది. నైకా సంస్థ సైతం తన కస్టమర్లను నిలబెట్టుకోవటం కోసం ఆ పెద్ద సంస్థలను ఢీకొనక తప్పలేదు. మార్కెట్‌లో తన ఉనికిని చాటుకోవాల్సిన గత్యంతరం ఏర్పడింది.

ఈ పరిస్థితుల్లో నైకా పేరెంట్‌ కంపెనీ FSN E-commerce Ventures షేర్ల విలువ లిస్టింగ్‌ డే నాటితో పోల్చితే ఏడాది కాలంలోనే 50 శాతానికి పైగా డౌన్‌ అవటం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. ఈ నేపథ్యంలో నైకా ‘‘ఐదు ఈస్ట్‌ ఒకటి’’ నిష్పత్తిలో బోనస్‌ షేర్లను ప్రకటించి ఇన్వెస్టర్లను ప్రలోభపెట్టాలని చూసింది. దీంతో మార్కెట్‌ ఎక్స్‌పర్ట్‌లు అలర్ట్‌ అయ్యారు. బోనస్‌ ఇష్యూ రికార్డు డేట్‌ కన్నా ముందు షేర్లు కొనటానికి తొందరపడొద్దని నిలువరించారు. అయితే.. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి.. నికర లాభంలో 3.6 శాతం గ్రోత్‌ నెలకొనటం నైకా కంపెనీకి కాస్త ఊరట కలిగించింది.

కానీ.. బ్యూటీ అండ్‌ పర్సనల్‌ కేర్‌ విభాగంలో నైకా సంస్థ.. అమేజాన్‌ మరియు మింత్రా వంటి రిచ్‌ కంపెనీల నుంచి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి రావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఆ సంస్థలు బ్యూటీ అండ్‌ పర్సనల్‌ కేర్‌ ప్రొడక్టుల ప్రమోషన్‌ కోసం, మార్కెటింగ్‌ కమ్యూనికేషన్ల కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నాయని జేఎం ఫైనాన్షియల్‌ సంస్థ పేర్కొంది. ఫలితంగా నైకా ఫ్యాషన్‌ వర్టికల్‌ లాభాలు తిరోగమనం పట్టే సూచనలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్లాట్‌ఫామ్‌ బిజినెస్‌ల మాదిరిగా పైప్‌లైన్‌ల బిజినెస్‌లకు క్యాష్‌ ఫ్లో మరియు రెవెన్యూ స్ట్రీమ్‌లు ఉండకపోవటమే దీనికి కారణమని హెచ్‌డీఎఫ్‌సీ రిపోర్ట్‌ స్పష్టం చేస్తోంది.

ప్లాట్‌ఫామ్‌ బిజినెస్‌లకు బహుళ ఆదాయ వనరులు ఉంటాయి. కానీ.. పైప్‌లైన్‌ల మాదిరి ఓల్డ్‌ స్టైల్‌ బిజినెస్‌లకు ఆ అవకాశం లేదు. ప్లాట్‌ఫామ్‌ బిజినెస్‌లకు బెస్ట్‌ ఎగ్జాంపుల్‌ యూట్యూబ్‌. దీనికి.. ఒక వైపు విక్రేతల నుంచి, మరో వైపు కొనుగోలుదారుల నుంచి ఇన్‌కం వచ్చే అవకాశం ఉంది. నైకా విషయానికొస్తే.. దీన్నొక సమర్థవంతమైన హైబ్రిడ్‌ బిజినెస్‌ మోడల్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఇందులోని నెట్‌ సేల్స్‌ వ్యాల్యూలో 85 శాతం ఇన్వెంటరీ లీడింగ్‌ ద్వారానే సమకూరుతోంది. కాబట్టి నైకాను ఒక ప్లాట్‌ఫామ్‌ అనటం కన్నా లీనియర్‌ ఆన్‌లైన్‌ పైప్‌లైన్‌ అనటం కరెక్ట్‌ అని హెచ్‌డీఎఫ్‌సీ నివేదిక పేర్కొంది.

నైకా కంపెనీ గ్రోత్‌, మార్జిన్లు, అసెట్‌ ప్రొఫైల్‌ పరిశీలిస్తే ఆ సంస్థను ప్లా్‌ట్‌ఫామ్‌గా చెప్పదగ్గ సూచనలేమీ కనపడట్లేదని, పైప్‌లైన్‌ బిజినెస్‌గా పేర్కొనొచ్చని విశ్లేషకులు అంటున్నారు. పైప్‌లైన్స్‌ అనేవి సహజంగా తక్కువ మార్జిన్‌ ఉండే ఇన్వెంటరీ బిజినెస్‌లు. నైకా సంస్థకు ప్రధానంగా బ్యూటీ అండ్‌ పర్సనల్‌ కేర్‌ సెగ్మెంట్‌ నుంచే ఆదాయం సమకూరుతోంది. కానీ.. విక్రేతల వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే రెవెన్యూని బట్టే లాభనష్టాలు ఆధారపడుతున్నాయి. యాడ్‌ ఇన్‌కం తగ్గితే అది నైకా ఫలితాలపై నెగెటివ్‌ ఎఫెక్ట్‌ చూపుతోంది.

దీనికితోడు.. మార్కెట్‌లోకి రిలయెన్స్‌, టాటా వంటి పెద్ద సంస్థలు ప్రవేశిస్తుండటంతో.. నైకా.. మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక వైపు వ్యాపారం తగ్గటం.. మరో వైపు యాడ్‌ రెవెన్యూ ఇతర సంస్థల వల్ల చీలిపోవటం నైకా లాభాలను దెబ్బతీస్తున్నాయి. పూర్తి స్థాయి ప్లాట్‌ఫామ్‌గా మారటానికి అడ్డంకిగా నిలుస్తున్నాయి. అయితే.. నైకా ఫ్యూచర్‌ జర్నీపై హెచ్‌ఎస్‌బీసీ ఆశాజనకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనించాల్సిన అంశం. రానున్న దశాబ్దంలో నైకా రెవెన్యూ ప్రతి రెండు, మూడేళ్లకు రెట్టింపు అవుతుందని హెచ్‌ఎస్‌బీసీ అంచనా వేసింది.

నైకా ఫ్యాషన్‌ బ్రాండ్లు 39 మల్టీ బ్రాండ్‌ ఔట్‌లెట్లలో మరియు 503 జనరల్‌ ట్రేడ్‌ ఔట్‌లెట్లలో అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా నైకా సొంత స్టోర్లు మూడు ఉన్నాయి. అందువల్ల ఈ సంస్థ మార్కెట్‌ విలువ లాంగ్‌-టర్మ్‌లో పెరగాలంటే సొంత బ్రాండ్లను మార్కెట్‌లో మరింతగా ప్రమోట్‌ చేసుకోవటం పైన, మల్టీ స్ట్రీమ్‌ రెవెన్యూ మరియు ఫ్యాషన్‌ బిజినెస్‌ల పైన ఫోకస్‌ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.