NTV Telugu Site icon

Special Story on Laxman Narasimhan: అంతర్జాతీయ సంస్థ స్టార్‌బక్స్‌కి సీఈఓ అయిన మన భారతీయుడు లక్ష్మణ్‌ నరసింహన్‌పై ప్రత్యేక కథనం

Special Story On Laxman Narasimhan

Special Story On Laxman Narasimhan

Special Story on Laxman Narasimhan: స్టార్‌బక్స్‌ అనేది ప్రపంచంలోని కాఫీ హౌస్‌ చెయిన్‌లో అతిపెద్ద సంస్థ. ఇదొక అమెరికన్‌ కంపెనీ. దీని హెడ్డాఫీసు వాషింగ్టన్‌లో ఉంది. ఇన్నాళ్లూ నంబర్‌ వన్‌గా ఉన్న ఈ సంస్థ ఈ మధ్య కాలంలో కొన్ని ఒడిదుడుకులకు లోనవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని స్టోర్లను మూసేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సంస్థకు అతిపెద్ద ఓవర్సీస్‌ మార్కెట్‌ అయిన చైనాలో కొవిడ్ ఆంక్షల కారణంగా కాఫీ బిజినెస్‌ తగ్గుముఖం పట్టింది. దీంతోపాటు ఇన్‌ఫ్లేషన్‌ వల్ల వేతనాలు పెంచాలని కోరుతూ 200 స్టోర్లలో సిబ్బంది సమ్మెకు దిగారు.

ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సీఈఓగా లక్షణ్‌ నరసింహన్‌ బాధ్యతలు చేపడితే ఈ సంస్థ తిరిగి పుంజుకుంటుందని ప్రస్తుత సీఈఓ howard schultz భావించారు. దీంతో అంతర్జాతీయ సంస్థలకు సీఈఓలు అయిన భారతీయుల జాబితాలోకి తాజాగా లక్ష్మణ్‌ నరసింహన్‌ కూడా చేరారు. ఈయన 1967లో పుణెలో పుట్టారు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ పొందారు. అనంతరం ఉన్నత చదువులను అమెరికాలో పూర్తిచేశారు. లక్ష్మణ్‌ నరసింహన్‌ గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈయన 6 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు.

World’s Top 5 Pharma Companies: ప్రపంచంలోని టాప్ 5 ఫార్మా కంపెనీలు

లక్ష్మణ్‌ నరసింహన్‌ 19 ఏళ్లపాటు MC Kinseyలో పనిచేశారు. ఈ సంస్థ అమెరికా, ఆసియాలోని కన్జ్యూమర్‌, రిటెయిల్‌, టెక్‌ వంటి విభాగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాత ఆయన.. పెప్సికోలో ఎన్నో పదవులు చేపట్టి చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌గా వ్యవహరించారు. ఆ సమయంలోనే స్టార్‌బక్స్‌తో పెప్సికోకు ఒక డీల్‌ కుదిర్చారు. 2019లో Reckitt Benckiser కంపెనీ సీఈఓగా చేశారు. ఈ సంస్థ డెటాల్‌, హార్పిక్‌, డ్యూరెక్స్‌ కండోమ్స్‌ తదితర ఉత్పత్తులకు పేరొందింది. కరోనా సంక్షోభంలో కూడా హెల్త్‌, హైజీన్‌ ప్రొడక్ట్‌ల సేల్స్‌ విషయంలో విజయవంతంగా ముందుకు నడిపించారు.

లక్ష్మణ్‌ నరసింహన్‌ ఈ కంపెనీలోకి వచ్చాక మ్యూసినెక్స్‌ అనే ఒక బేబీ కోల్డ్‌ సిరప్‌ ఫార్ములాను తీసుకొచ్చారు. ఎప్పుడైతే Reckitt Benckiser కంపెనీని వీడనున్నట్లు వార్తలు వచ్చాయో అప్పుడే ఆ సంస్థ స్టాక్స్‌ 5 శాతం పడిపోవటం ఆయన ప్రభావాన్ని తెలియజేస్తోంది. లక్ష్మణ్‌ నరసింహన్‌ స్టార్‌బక్స్‌ సీఈఓ పదవిలోకి వస్తారని వార్తలు రావటంతో ట్విట్టర్‌ ఒక సర్వే చేపట్టింది. అందులో.. ఫిల్టర్‌ కాఫీని స్టార్‌బక్స్‌ గ్లోబల్‌ మెనూలో చేర్చాలని ఇండియన్‌ కమ్యూనిటీ రిక్వెస్ట్‌ చేసింది. ఈయన స్టార్‌బక్స్‌ సీఈఓగా వచ్చే నెల (అక్టోబర్‌) నుంచి వ్యవహరించనున్నారు. ఈ సంస్థ పునర్నిర్మాణం చేపట్టాకే పూర్తి బాధ్యతలను 2023 ఏప్రిల్‌ నుంచి స్వీకరిస్తారు.

స్టార్‌బక్స్‌లో లక్ష్మణ్‌ నరసింహన్‌ వార్షిక వేతనం 1.3 మిలియన్‌ డాలర్లు. దీనికితోడు 1.6 మిలియన్‌ డాలర్ల క్యాష్‌ సైనింగ్‌ బోనస్‌ అందుకుంటారు. 9.25 మిలియన్‌ డాలర్ల వేతనాన్ని ఇన్‌సెంటివ్‌గా 2023 నుంచి తీసుకుంటారు. దీంతో 13.6 మిలియన్‌ డాలర్ల యాన్యువల్‌ ఈక్విటీ అవార్డ్స్‌కు అర్హత పొందుతారు. లక్ష్మణ్‌ నరసింహన్‌ స్టార్‌బక్స్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయనకు పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. వాటిలో ముఖ్యమైనవి.. కొవిడ్‌ పూర్వపు స్థితిలోకి స్టార్‌బక్స్‌ వ్యాపారాన్ని తీసుకురావటం, ఇన్‌ఫ్లేషన్‌తోపాటు పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవటం, సిబ్బంది మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకురావటం, పోటీ సంస్థలకు ధీటుగా కంపెనీ టర్నోవర్‌ని పెంచటం. అంతేకాకుండా.. భవిష్యత్‌లో ఎదురుకానున్న అనూహ్య ఛాలెంజ్‌లను ఎదుర్కొని తననుతాను ఎలా నిరూపించుకుంటారో రానున్న రోజుల్లో తెలియనుంది.