Special Story on JJ Irani: మన దేశం మర్చిపోలేని పారిశ్రామికవేత్తల్లో జమ్‌షెడ్ జె ఇరానీ ఒకరు. జేజే ఇరానీగా, స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందారు. టాటా స్టీల్ కంపెనీ గొప్పతనంతోపాటు భారతదేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటారు. 8 గంటల పని సంస్కృతికి శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయం ఇతర కంపెనీలకు బెంచ్‌మార్క్‌లాగా నిలవటం విశేషం. కేవలం ఇండస్ట్రియలిస్ట్‌గానే కాకుండా స్పోర్ట్స్‌మ్యాన్‌గా, స్టాంపులు-నాణేల సేకరణకర్తగా తన అభిరుచులను చాటుకున్నారు. తుది శ్వాస విడిచే వరకు క్రికెట్‌ను ఆస్వాదించారు. దేశానికి అందించిన అసమాన సేవలకు పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న జెమ్‌షెడ్ జె ఇరానీ.. ఈ వారం మన డిఫైనింగ్ పర్సనాలిటీ.
టాటా స్టీల్ కంపెనీతో జేజే ఇరానీది ఉక్కులాంటి దృఢమైన అనుబంధం. ఆ సంస్థలో 43 ఏళ్ల సుదీర్ఘకాలం వివిధ హోదాల్లో పనిచేశారు. 11 ఏళ్ల కిందట పదవీ విరమణ పొందారు. మొత్తం టాటా గ్రూపులోనే ఇరానీ ఒక మహోన్నత వ్యక్తి అనిపించుకున్నారు. ముందుచూపున్న నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 1990ల్లో ఇండియాలో ఆర్థిక సరళీకరణ ప్రవేశపెట్టిన సమయంలో స్టీల్ పరిశ్రమ ఎదుగుదల మరియు అభివృద్ధికి రోల్ మోడల్‌గా, కార్పొరేట్ మెంటార్‌గా, ఆల్‌టైమ్ గ్రేట్ మ్యాన్‌లా వ్యవహరించారు. గ్లోబల్ మార్కెట్‌తో పోటీపడేలా తీర్చిదిద్దారు.
read more:Bill Gates Financial Support to Africa: కావాలి ఇంకా.. అంటున్న ఆఫ్రికా..
జేజే ఇరానీ.. టాటా స్టీల్ మరియు టాటా సన్స్‌తోపాటు పలు టాటా గ్రూప్ కంపెనీల్లో డైరెక్టర్‌గా సేవలందించారు. ఆ జాబితాలో టాటా మోటార్స్, టాటా టెలీసర్వీసెస్ సైతం ఉన్నాయి. 1992-93లో భారతీయ పరిశ్రమల సమాఖ్యకు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. 1936 జూన్ 2న నాగ్‌పూర్‌లో జన్మించిన జేజే ఇరానీ.. సొంత నగరంలోనే పీజీ వరకు చదువుకున్నారు. అనంతరం బ్రిటన్ వెళ్లి మెటలర్జీలో PhD చేశారు. 1963లో.. అంటే.. 27 ఏళ్లకే ప్రొఫెషనల్ కెరీర్‌ని ప్రారంభించారు. బ్రిటన్‌లోనే ఐదేళ్లపాటు ఉద్యోగం చేసి స్వదేశానికి తిరిగొచ్చారు.
జేజే ఇరానీ 1968లో ‘ది టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ’లో ‘ఆర్ అండ్ డీ’ డైరెక్టర్‌కి అసిస్టెంట్‌గా ప్రవేశించారు. అక్కడి నుంచి మొదలుపెట్టి వరుసగా దాదాపు అన్ని పదవులనూ అధిరోహించారు. సంవత్సరం తిరిగేసరికి జనరల్ సూపరింటెండెంట్, మరో ఏడాదికి జనరల్ మేనేజర్ అయ్యారు. ఆరేళ్ల అనంతరం టాటా స్టీల్ ప్రెసిడెంట్‌గా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత.. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా చేశారు. 2001లో రిటైర్ కావటానికి ముందు సుమారు పదేళ్లు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 1981లో టాటా స్టీల్ బోర్డు మెంబర్‌గా ఎంటరై 2001 నుంచి దశాబ్దంపాటు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
జేజే ఇరానీ 1990ల్లో టాటా స్టీల్‌ని తనదైన శైలిలో ముందుండి నడిపారు. బలమైన పునాదులను నిర్మించారు. మన దేశంలోని టోటల్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ మూమెంట్ మార్గదర్శకుల్లో ఒకరిగా మారారు. ప్రపంచంలో అతి తక్కువ ధర కలిగిన ఉక్కు ఉత్పత్తిదారుల్లో ఒకటిగా టాటా స్టీల్‌ని నిలిపారు. మెటలర్జీలో పీహెచ్‌డీ హోల్డర్ అయిన జేజే ఇరానీ.. లోహాల, ఖనిజాల సేకరణ, పరిశోధన, అభివృద్ధిలో అమితాసక్తిని ప్రదర్శించేవారు. దీంతో ఇరానీ ఈ రంగానికి అందించిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 2008వ సంవత్సరంలో లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డ్‌తో బహూకరించింది.
జేజే ఇరానీ.. ఇండియా-బ్రిటన్‌ల మధ్య వాణిజ్య, సహకార రంగాల్లో సత్సంబంధాల కొనసాగింపునకు పాటుపడ్డారు. దీంతో.. రాణీ ఎలిజబెత్-2 నుంచి నైట్‌హుడ్ అనే అరుదైన గౌరవాన్ని పొందారు. వృత్తి జీవితంలో ఎక్కువ సమయాన్ని జార్ఖండ్‌లో ముఖ్యంగా జెమ్‌షెడ్‌పూర్‌లో గడిపారు. అంతకుమించి.. స్థానిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పెద్ద సంఖ్యలో వర్క్ ఆర్డర్లను ఇవ్వటం ద్వారా వాళ్ల సొంత అనుబంధ యూనిట్లు నిలదొక్కుకునేలా సహాయ సహకారాలు అందించారు.
ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో కొత్త పెట్టుబడులు కరువవటంతో పారిశ్రామిక సంఘాలు జెమ్‌షెడ్‌పూర్‌ని ‘డెడ్ సిటీ’ అని వెటకారంగా పిలిచేవారు. కానీ.. జేజే ఇరానీ అందించిన ప్రోత్సాహంతో ఆ నగరానికి డెడ్ సిటీ అనే బ్యాడ్ ఇమేజ్ తొలిగిపోయింది. ఇదిలా ఉండగా.. క్రికెట్‌ను బాగా ఇష్టపడే జేజే ఇరానీ.. స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ ప్రమోటర్‌గా గొప్ప పేరు తెచ్చుకున్నారు. పారిశ్రామికవేత్తగానే కాకుండా నిబద్ధత కలిగిన పర్యావరణవేత్తగా, స్టాంప్స్ మరియు కాయిన్ల కలెక్టర్‌గా తన ఆసక్తులను ప్రదర్శించేవారు.
జేజే ఇరానీ టాటా స్టీల్ ఎండీగా ఉన్నప్పుడు ఆర్చరీ అకాడమీని 1996 అక్టోబర్‌లో ప్రారంభించారు. ఇది.. జార్ఖండ్ యువతను ఎంతగానో ఎంకరేజ్ చేసింది. ఇప్పటికీ ఆ రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఈ ఈవెంట్‌లోనే ఎక్కువ సంఖ్యలో మెడల్స్ వస్తుండటం చెప్పుకోదగ్గ విషయం. దీన్నిబట్టి విలువిద్యకు ఆయన ఇచ్చిన సహకారం ఎంత విలువైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పారిశ్రామికం, వాణిజ్యం, క్రీడలు తదితర రంగాలకు అందించిన సేవలకు జేజే ఇరానీని కేంద్ర ప్రభుత్వం మన దేశంలోని 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌తో సత్కరించటం ఎంతైనా సముచితం.