Special Story on Anil Agarwal: అనిల్ అగర్వాల్.. వ్యాపార రంగంలో ఐదు దశాబ్దాల సుదీర్ఘ కాలం ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఇవాళ ఇండియన్ మెటల్ అండ్ మైనింగ్ మ్యాగ్నెట్‌గా ఎదిగారు. ఒక్క రోజు కూడా కాలేజీకి గానీ బిజినెస్ స్కూల్‌కి గానీ వెళ్లకుండానే ఆయన ఇదంతా సాధించగలగటం విశేషం. ఇంగ్లిష్‌లో ఎస్ అండ్ నో అనే రెండు పదాలు మాత్రమే తెలిసిన అనిల్ అగర్వాల్.. ఒకానొక దశలో ఆ ఇంగ్లిష్ కంట్రీ బ్రిటన్ నడిబొడ్డున ఇండియా పేరును ఘనంగా చాటారు. ఏకంగా లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోనే తన సంస్థ పేరును నమోదు చేశారు. తద్వారా ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ కంపెనీగా వేదాంత.. వరల్డ్‌వైడ్‌గా ఫేమస్ అయింది. ఆ అనిల్ అగర్వాలే ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి ప్రముఖంగా వార్తల్లో నిలిచారు. ఇండియాలోనే మొట్టమొదటి సెమీకండక్టర్ మ్యానిఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను గుజరాత్‌లో ఏర్పాటుచేస్తున్నారు. తైవాన్‌కి చెందిన ఫాక్స్‌కాన్ కంపెనీతో కలిసి ఇటీవలే ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఈ వారం మన డిఫైనింగ్ పర్సనాలిటీగా అనిల్ అగర్వాల్ సక్సెస్ జర్నీపై స్పెషల్ ఫోకస్.
బీహార్ బోయ్
అనిల్ అగర్వాల్.. బీహార్‌లోని మార్వాడీ ఫ్యామిలీలో పుట్టారు. కుటుంబ వ్యాపారంలో ఓనమాలు నేర్చుకున్నారు. 19వ ఏట అంటే 1970ల్లోనే బాంబేకి వెళ్లిపోయారు. రెండు దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా కష్టపడి పైకొచ్చారు. అనిల్ అగర్వాల్ జీవితమూ పూర్తిగా మారిపోయింది. సొంతగా దాచుకున్నదాంతోపాటు ఫ్రెండ్స్ దగ్గర మరియు కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్న మొత్తం డబ్బు 16 లక్షల రూపాయలతో వ్యాపారం ప్రారంభించారు.
మూతపడే కంపెనీలతో..
అనిల్ అగర్వాల్ 1986లో స్టెర్‌లైట్ ఇండస్ట్రీని స్థాపించారు. చిన్న సంస్థగా మొదలైన ఈ కంపెనీ ఆ తర్వాత కాలంలో ఇండియాలోనే అతిపెద్ద కాపర్ మెటల్ ఉత్పత్తిదారుగా అగ్రస్థానానికి చేరుకుంది. ప్రారంభమైన రెండేళ్లలోనే IPOకి వెళ్లింది. పాలిథీన్ ఇన్సులేటెడ్ జెల్లీ ఫిల్డ్ కాపర్ టెలిఫోన్ కేబుల్స్ ప్లాంట్ కోసం నిధులు సమీకరించారు. ఏడేళ్ల అనంతరం మద్రాస్ అల్యూమినియం కంపెనీలో మెజారిటీ వాటాను అక్వైర్ చేసుకున్నారు. మూతపడే దశలో ఉన్న ఆ సంస్థలో 83 శాతం వాటాను 55 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఆ తర్వాత కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు. సిక్ కంపెనీలను కొనటం, వాటినే పెద్ద ఆదాయ వనరులుగా డెవలప్ చేయటం అనిల్ అగర్వాల్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
విదేశాల్లో సైతం..
అనిల్ అగర్వాల్ టాస్మానియాలో ఒక మెటల్ మైన్‌ని కేవలం రెండున్నర మిలియన్ డాలర్లకు అక్వైర్ చేసుకొని ఏకంగా 100 మిలియన్ డాలర్ల కంపెనీగా అభివృద్ధి చేశారు. 2002లో కేంద్ర ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్ జింక్‌ను అక్వైర్ చేసుకున్నారు. ఆ సమయంలో హిందుస్థాన్ జింక్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం లక్షన్నర టన్నులు మాత్రమే. అంతేకాదు. ఆ సంస్థకు అప్పుడు ఐదేళ్లకు సరిపడా ఆర్థిక నిల్వలు మాత్రమే ఉన్నాయి. అయితే.. అది అనిల్ అగర్వాల్ చేతికి వచ్చాక లక్షన్నర టన్నుల ప్రొడక్షన్ కెపాసిటీ నుంచి అనూహ్యంగా పది లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంది. ఐదేళ్లకు మాత్రమే సరిపోయే ఆర్థిక నిల్వలున్న స్థితి నుంచి 40 ఏళ్లకు చాలినంత డబ్బున్న సంపన్న సంస్థగా అత్యున్నత స్థితికి చేరింది.
ఒకే గదిలో ఏడుగురిలో ఒకరిగా
అనిల్ అగర్వాల్ ముంబైకి వచ్చిన మొదట్లో ఆయన దగ్గర ఒక్క టిఫిన్ బాక్స్ తప్ప మరేదీ లేదంటే నమ్మశక్యం కాదు. 21 రూపాయలు అద్దె చెల్లిస్తూ ఒకే గదిలో ఏడుగురిలో ఒకరిగా సర్దుకుపోయారు. స్క్రాప్ మెటల్ క్రయవిక్రయాల కోసం చిన్న రూమ్‌ని రెంట్‌కి తీసుకున్నారు. దశాబ్దాల పాటు శ్రమించటం, సరైన సమయంలో పదునైన వ్యాపార చతురతను కనబరచటం, ఆస్తులను తక్కువ విలువ ఉన్నప్పుడే సంపాదించి వాటిని డెవలప్ చేయటం ద్వారా ఇవాళ వేదాంత సంస్థను ఒక గ్లోబల్ కంపెనీ లెవల్‌కి తీసుకెళ్లగలిగారు.
హర్షద్ మెహతా తోడుగా..
ఇండియన్ స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా తోడవటంతో అనిల్ అగర్వాల్ బిజినెస్ నెక్‌స్ట్ లెవల్‌కి వెళ్లింది. స్టాక్ మార్కెట్ల వ్యాపారంలోకి రీఎంట్రీ ఘనంగా ఇవ్వాలనే ప్రయత్నంలో హర్షద్ మెహతా.. అనిల్ అగర్వాల్‌కి చెందిన స్టెర్‌లైట్‌తోపాటు వీడియోకాన్, బీపీఎల్ కంపెనీల షేర్ల విలువను ఒక్కసారిగా పెంచేశారు. దీంతో వేదాంత సంస్థ లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నమోదైంది.
2003లో వేదాంత రిసోర్సెస్ సంస్థ లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నమోదై ఈ ఫీట్ సొంతం చేసుకున్న ఫస్ట్ ఇండియన్ కంపెనీగా నిలిచింది. అనంతరం ఆఫ్రికా, ఆస్ట్రేలియాతోపాటు ఇతర దేశాల్లోనూ మెటల్ మైన్స్‌ని అక్వైర్ చేసుకుంది. ఆ తర్వాత కాలంలో అనిల్ అగర్వాల్.. ఆయిల్, న్యాచురల్ గ్యాస్ రంగాల్లోకి కూడా ప్రవేశించారు. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆయిల్ ప్రొడ్యూసర్ అయిన కెయిర్న్ ఇండియాను 9 బిలియన్ డాలర్లకు అక్వైర్ చేసుకోనున్నట్లు ప్రకటించారు.
2012లో 20 బిలియన్ డాలర్ల మెగా మెర్జర్
2012లో వేదాంత రిసోర్సెస్ సంస్థ మెగా మెర్జర్‌ని ప్రకటించింది. తన గ్రూపులోని సెసా గోవా, స్టెర్‌లైట్, వేదాంత అల్యూమినియం, మద్రాస్ అల్యూమినియం కంపెనీలను సెసా స్టెర్‌లైట్ పేరుతో సింగిల్ ఎంటిటీగా మారుస్తున్నట్లు తెలిపింది. దీంతో సెసా స్టెర్‌లైట్ 20 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ వ్యాల్యూతో ప్రపంచంలోనే 7వ అతిపెద్ద డైవర్సిఫైడ్ న్యాచురల్ రిసోర్సెస్ మేజర్‌గా నిలవటం చెప్పుకోదగ్గ విషయం. సెసా స్టెర్‌లైట్.. సింగిల్ ఎంటిటీగా మారటం ద్వారా ఏటా వెయ్యి కోట్లు ఆదా అవుతాయని అనిల్ అగర్వాల్ చెప్పారు.
15 ఏళ్ల తర్వాత ప్రైవేట్‌గా
వేదాంతను లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నమోదు చేయించటం అనే అనిల్ అగర్వాల్ కల నెరవేరిన 15 ఏళ్ల అనంతరం దీనికి విరుద్ధమైన పరిణామం చోటుచేసుకుంది. 2018లో వేదాంతను లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచి డీలిస్ట్ చేసి ప్రైవేట్ బాట పట్టించారు. కమోడిటీ మాంద్యం వల్ల వేదాంత మార్కెట్ విలువ తగ్గింది. దీంతో అప్పటికే సంస్థ మూలధనం చాలా వరకు ఖర్చయిపోయింది. ఈ పరిస్థితుల్లో వేదాంతను తక్కువ ధరకు ప్రైవేట్‌గా తీసుకునే సదవకాశాన్ని అనిల్ అగర్వాల్ గ్రహించారు. తదనంతర కాలంలో కమోడిటీ మార్కెట్ ఊపందుకోవటంతో తన నిర్ణయానికి సరైన ప్రతిఫలాలను పొందగలిగారు.
ముందుచూపు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ మరియు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చిప్‌ల కొరత తీవ్రంగా నెలకొంది. ఇదే సమయంలో వివిధ దేశాలు దీనికోసం చైనా పైన ఆధారపడటాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నాయి. దీంతో అనిల్ అగర్వాల్ తన దృష్టిని ఇటువైపు పెట్టారు. దేశంలోనే మొట్టమొదటి సెమీకండక్టర్ యూనిట్‌ని గుజరాత్‌లో నెలకొల్పేందుకు లక్షన్నర కోట్ల రూపాయలకుపైగా నిధులను పెట్టుబడి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా మొత్తం ఇప్పుడు అనిల్ అగర్వాల్ గురించే చర్చించుకుంటోంది.