Site icon NTV Telugu

NTV 18th Anniversary: 18 ఏళ్ల ఎన్టీవీ ప్రస్థానం.. ప్రతి క్షణం ప్రజాహితం

Ntv

Ntv

NTV 18th Anniversary: సమాజానికి ఫోర్త్‌ ఎస్టేట్‌గా పిలిచే జర్నలిజం విలువలను కాపాడడాన్ని సవాలుగా స్వీకరిస్తూ, ఆ సమాజ స్రేయస్సుకు కంకణం కట్టుకుని, ప్రజాపక్షాన వెన్నుదన్నుగా నిలిచి, ఆ ప్రస్తానాన్ని 18 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుని ఎన్టీవీ ఎలా ముందుకు సాగుతోందన్నది.. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే… ఈ సందర్భంగా ఎన్నో విషయాలు ప్రేక్షకులతో పంచుకోవాలి. ఒక న్యూస్ చానల్‌ స్థాపించడం అనేది సాధారణ విషయం కాదు. ఒకవేళ పెట్టినా దాన్ని నడపడం అనేది ఉరకలెత్తే నదికి ఎదురీదినట్టే. ఇలాంటి సమయంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. మననును తొలుస్తాయి.

ఎలా నడవాలి? ఏం ప్రసారం చేయాలి? జనాలకు ఏది అవసరం? అసలు ప్రేక్షకులు ఏంచూస్తారు? ఇవన్నీ స్పష్టంగా సమాధానం తెలిసిన ప్రశ్నలు. ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించాల్సింది ఏంటంటే… NTV కి పునాదిరాయి వేసే సమయంలో వీటిపై ఎంతో కసరత్తు జరిగింది. అన్ని విధాలా ఆలోచించగా, అంతిమంగా మస్తిష్కంలోంచి వచ్చిన మెరుపు ఆలోచనే ప్రతి క్షణం ప్రజాహితం అనే మాట. ఈ 18 ఏళ్ల ప్రయాణమంతా ఇదే మాటగా, ఇదే శ్వాసగా సాగిందని సాగించామని సగర్వంగా చెబుతోంది ఎన్టీవీ. ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన వాటిని ఎన్నో చూశాం. చూస్తున్నాం. కాని ఓ సంస్థ 18 ఏళ్ల పాటు ఒకే కమిట్మెంట్‌తో ప్రజాక్షేత్రంలో ముందుకు సాగడం చాలా అరుదైన విషయం. దానికి నిలువెత్తు నిదర్శనమే జనం గుండెచప్పుడుగా మారిన NTV.

ఇక్కడ గట్టిగా మరొక విషయం చెప్పాలి. అది ఏంటంటే NTV రాకముందు న్యూస్ చానల్స్‌కు సంచలనమే పనిగా ఉండేది. గట్టిగా దగ్గినా, తుమ్మినా స్క్రీన్ మీద మసిపూసి మారేడు కాయిచేసి, నాలుగు బ్రేకింగ్స్ వేస్తే జనం టీవీలకే అతుక్కుపోతారు అనుకునేవారు. కానీ జనాలకు కావాల్సినది అది కాదని, సిరీయస్ సమస్యలతో పాటు రాజకీయ, ఆర్థిక సమస్యలు కళ్లకు కట్టేలా… పరిష్కారం తెలిపేలా… తెరపై కనిపిస్తే కచ్చితంగా చూస్తారని, NTV నూటికి నూరుపాళ్లు రుజువు చేసింది. రాజకీయ వార్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ కూడా ఒక ఛానెల్‌ను విజయవంతంగా నడపవచ్చునన్నది NTV విషయంలో రుజువైంది. జనాల వ్యూస్‌ పాట్రన్‌ను సమూలంగా మార్చేసింది. తెలుగు సమాజాన్ని రాజకీయ వార్తా తరంగిణి వైపు మళ్లించింది. ప్రతి రోజు ప్రైం టైమ్‌లో ఇచ్చే స్టోరీ బోర్డులో రాజకీయ అంశాల విశ్లేషణలు. ఛైర్మన్ డెస్క్‌, స్పెషల్ ఫోకస్‌లతో ప్రేక్షకుల్లో విశ్లేషణాత్మక భావానికి పదును పెట్టడంలో NTV సఫలమైంది.

ఒక వైపు బ్రేకింగ్ న్యూస్‌తో, ఇంపార్టెంట్‌ న్యూస్‌తో లైవ్‌లతో ప్రతిక్షణం పరుగు పెడుతూ వేగంగా వార్తలు ఇవ్వడమే కాదు… వాటిని లోతుగా విశ్లేషిస్తూ జనం ముందుకు తీసుకుని రావడంలో NTV సఫలమైంది. ఏవేవో సంచలనాలతో బులెటిన్‌ నింపితే చాలనుకునే టైమ్‌ నడిచేది. సీరియస్‌ వార్తలు ఇస్తూ న్యూస్ బులిటెన్‌ నడిపితే ఎవరు చూస్తారు? ఎవరు వింటారు అన్నట్టుండేది. కానీ సరైన పరిశోధనతో లోతైన విశ్లేషణలతో కార్యక్రమాలు ప్రసారం చేస్తే జనం తప్పకుండా చూస్తారనే దృక్పథాన్ని అనుసరించి చూపించింది NTV. అందులో భాగంగానే పొలికల్ న్యూస్ కి ఇంపార్టెన్స్‌ పెంచుతూ వచ్చింది. తెలుగునాట రాజకీయ వార్తలంటే NTV అనంతలా ఎదిగింది. అలాగని బ్రేకింగ్ న్యూస్‌ల వాడి వేగంలో ఏనాడు వెనకపడ్డాం అన్న మాటేలేదు. ఒక తెలుగు చానల్‌లోనే కాదు… చాలా జాతీయ ఛానెళ్లకంటే వేగంగా NTV వార్తలు ఇవ్వగలదని రుజువు చేసుకుంది. ఇదొక్కటే కాదు… వార్తకు విశ్వసనీయత, పారదర్శకత కల్పించడం కూడా NTV తొలిరోజు నుంచే చేస్తూ వచ్చింది. NTV 18 ఏళ్ల ప్రయాణమంతా ఆ ప్రయత్నమే. ట్యాగ్‌లైన్‌లో చెప్పింది ప్రసారాలలో కనిపించాలి. ప్రతి వార్తకి ప్రజలే కేంద్ర బిందువు కావాలి. ప్రతి కార్యక్రమానికి ప్రజాహితమే లక్ష్యం కావాలి. జనం అభిలాషా ఆకాంక్షలకు ప్రతిక్షణం NTV వేదిక కావాలి. జనాభిప్రాయానికి NTV నిలువుటద్దం అవ్వాలి. అడుగడుగునా ఇదే ఆశయం. చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ఇదే ప్రామాణికం. NTV 18 ఏళ్ల ప్రయాణం అంతా.. ఆషామాషీగా సాగలేదు. దాని వెనక నిరంతర మేధోమదరం ఉంది.

మీడియా అనగానే జనం చాలా తేలిగ్గా కామెంట్లు చేస్తారు. వీరిపక్షం వారిపక్షం అని జడ్జిమెంట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. కోట్లాది మంది చూస్తారు. ఎవరి అభిప్రాయాలు వారివి. ఆ అభిప్రాయాలు అన్నింటిని గౌరవించాల్సిందే. ఒక న్యూస్ చానెల్ గా ఎవరి పక్షం ఉండడం సాధ్యంకాని పని. దీనిపై మేనేజ్మెంట్‌, ఎడిటోరియల్‌ టీమ్‌ నిరంతరం కసరత్తు చేస్తూనే ఉంటుంది. అభిప్రాయాలు, వాదోపవాదాలు, చర్చోపచర్చలు సాగుతూనే ఉంటాయి. అయితే చానెల్‌కి ఏది ముఖ్యం? ఏది జనపక్షం అనేదే ఫైనల్‌. ఎవరో ఒకరి వైపుంటే ఇంత ప్రజాదరణ NTVకి దొరుకుతుందా? ప్రజలు ఇంతగా ఆదరించి సముచిత స్థానంలో నిలబెట్టారు అంటేనే ఎన్టీవీ ప్రజల పక్షాన ఉందని… జనానికి నచ్చేలా, జనం మెచ్చేలా ముందుకు వెళ్తోందని అర్ధం.

ఒక సారి ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు వస్తే చేతులు కలిపేశారంటారు. అదే ప్రతిపక్షానికి అనుకూల వార్తలు రాగానే సర్కార్‌తో చెడిందంటారు. ఇలాంటి వాళ్లు ఒక్కసారి ఆలోచించాలి. నిర్ణయాలు అంత తేలిగ్గా ఉంటాయా? NTV ఎడిటోరియల్ పాలసీ ఎప్పుడూ బ్లాక్‌ అండ్‌ వైట్‌ పాలసీ నిర్ణయాలు తీసుకోలేదు. సాధారణంగా ప్రభుత్వంలో ఉన్నవాళ్లకు ఎక్కువ కవరేజీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, స్కీముల ప్రకటనలు, సియం, మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలు.. ఇలా అనేక సందర్భాల్లో కవర్ చేయాల్సి ఉంటుంది. మీడియాగా వీటికి ప్రయారిటీ ఇవ్వడం తప్పనిసరి. ప్రభుత్వం అంటేనే మెజారిటీ ప్రజానీకం ఎంచుకున్న పక్షం. దానికి మీడియా సంస్థగా సముచిత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగని ప్రభుత్వాన్ని వ్యతిరేకించి విమర్శించే స్వరాలను విస్మరిస్తే ఎలా? ప్రతిపక్షానికి మద్దతుగా నిలిచేవాళ్లు కూడా జనంలో భాగమే. ఆ వార్తలు కూడా రావాల్సిందే. వాటికి అదే స్టైల్‌లో కవరేజ్‌ దక్కాల్సిందే. అందుకే ప్రతిపక్షాలు చేసే పోరాటాలను ఉద్యమాలను విస్మరించకుండా ముందుకు వెళ్తోంది ఎన్టీవీ.

అలాగని కొత్తగా ప్రభుత్వాలు రాగానే దుమ్మెత్తి పోసే అవసరం చానల్స్‌కు ఉండదనేది కూడా వాస్తవం. అందుకే ఏ చానల్లో ప్రసారం అయ్యే కార్యక్రమాలైనా కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చొచ్చు. ఎవరికీ నచ్చినా నచ్చకున్నా ఓ పాలసీ ప్రకారం ఎన్టీవీ నడుస్తోంది. ఆ పాలసీకే కట్టుబడి నిలుస్తోంది. అలా చేసిన చానల్స్‌ మాత్రమే నిలబడతాయి. జనం వాటినే ఆదరిస్తారు. ఈ విషయంలో ఎన్టీవీకి మొదట్నించి ఓ స్పస్టత ఉంది. లైవ్ వెహికల్స్‌ కేవలం ఓ సాథనాలు మాత్రమే. ప్రత్యక్ష ప్రసారాలు ఓ మాధ్యమం మాత్రమే. అసలు ప్రయోజనం సమాజ శ్రేయమే..! అసలు లక్ష్యం ప్రతిక్షణం ప్రజాహితమే. అందుకే అదే ఎన్టీవీ నినాదంగా మారింది.

జర్నలిజం అంటే ఓ నిరంతర బాధ్యత. జర్నలిజం అంటే ఓ కట్టుబాటు. జర్నలిజం అంటే ప్రతిక్షణం కత్తిమీద సాము. జర్నలిజం అంటే ఓ సామాజిక స్ఫూర్తి. ఎన్టీవీ 18 ఏళ్లుగా నడుస్తోంది. ప్రజా స్రేయస్సు, ప్రజా ప్రయోజనాలే లక్ష్యాలుగా ఎన్టీవీ ప్రస్తానం కొనసాగుతోంది. దశాబ్దాలే కాదు, కొన్ని శతాబ్దాల క్రితం జరిగిన యదార్ధ సంఘటనలు ఇప్పటి తరానికి తెలుసంటే కారణం మీడియా. అందుకే వార్తలందు జగము వద్ధిల్లు అంటారు. ప్రపంచంలో జరిగే వివిధ సంఘటనలను ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తూ, వాటి వెనక సారాంశాన్ని అందిస్తూ అనునిత్యం ప్రజల ముందు నిజాయితీగా నిలబడడం నిజంగా సవాలే. ప్రతి క్షణం ప్రజాహిత నినాదంతో ముడిపడిన ప్రయాణం ఎన్టీవీది. ఎన్నో ప్రయోగాలతో వడివడిగా సాగిన పయనం ఇది. ఈ ప్రయాణంలో వీక్షక దేవుడే నిజమైన భాగస్వాములని మేము సగర్వంగా చెప్పుకుంటాం.

Exit mobile version