Rice Shortage: ఈ సంవత్సరం.. ప్రపంచవ్యాప్తంగా బియ్యం కొరత నెలకొననుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గడచిన 20 ఏళ్లలో ఎన్నడూలేనంతగా ఈసారి గ్లోబల్ రైస్ మార్కెట్‌లో షార్టేజ్ ఏర్పడనుందని ఫిచ్ సొల్యూషన్స్ సంస్థ పేర్కొంది. 2003-04 సంవత్సరంలో 18 పాయింట్ 6 మిలియన్ టన్నుల బియ్యం కొరత తలెత్తగా 2022-23లో 8 పాయింట్ 7 మిలియన్ టన్నుల లోటు నమోదుకానుందని ఒక ఇంగ్లిష్ మీడియా సంస్థ తెలిపింది.
Birla returns: మళ్లీ వచ్చిన బిర్లా. నష్టాల నుంచి వీఐ గట్టెక్కెనా?
అమెరికా, చైనాతోపాటు ఐరోపా సమాఖ్యలో వరి పంట దిగుబడి పడిపోనుండటమే బియ్యం కొరతకి కారణం కానుందని విశ్లేషకులు చెబుతున్నారు. బియ్యం కొరత వల్ల.. డిమాండ్ పెరిగి.. రేట్లు ఆకాశాన్నంటుతాయి. ఫలితంగా మూడున్నర కోట్ల మందికి పైగా ప్రజల పైన ప్రభావం పడనుంది. మరీ ముఖ్యంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని జనం తీవ్ర ఇబ్బందులకు గురికానున్నారు.
ఎందుకంటే.. ప్రపంచం మొత్తమ్మీద చూస్తే.. 90 శాతం బియ్యాన్ని ఈ రీజియన్ ప్రజలే వినియోగిస్తున్నారు. ప్రపంచంలో అత్యధికంగా పండించే పంటల్లో ఒకటైన వరి దిగుబడి పడిపోతే బియ్యాన్ని దిగుమతి చేసుకునే దేశాలకు కష్టాలు తప్పవు. నిజం చెప్పాలంటే.. అంతర్జాతీయ మార్కెట్‌ని ఇప్పటికే బియ్యం కొరత వేధిస్తోంది.
అందుకే.. ప్రస్తుతం.. పదేళ్లలో ఎన్నడూ లేనంతగా బియ్యం ధరలు మండిపోతున్నాయని ఫిచ్ సొల్యూషన్స్‌కి చెందిన
ఛార్లెస్ హార్డ్ అనే కమోడిటీ ఎక్స్‌పర్ట్ తెలిపారు. ఇవే ధరలు వచ్చే సంవత్సరం కూడా కొనసాగుతాయని ఈ సంస్థ రూపొందించిన కంట్రీ రిస్క్ అండ్ ఇండస్ట్రీ రీసెర్చ్ రిపోర్ట్ హెచ్చరించింది. ఆసియాలోని అన్ని మార్కెట్లలోనూ బియ్యమే ప్రధాన ఆహార వస్తువు.
కాబట్టి.. బియ్యం రేట్లు పెరిగితే.. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. తద్వారా.. ఆహార భద్రతకు భంగం కలుగుతుంది. ఈ పరిణామం.. పేద కుటుంబాల్లో భయాందోళనలకు దారితీస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే.. ఇండియా.. ఇటీవల బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించింది.
ప్రపంచంలో బియ్యాన్ని ఎక్కువగా ఎగుమతి చేసే దేశమైన ఇండియా ఈ నిర్ణయం తీసుకోవటం పలు దేశాలను పునరాలోచనలో పడేసింది. వర్షపాతం సగటు కన్నా తక్కువగా నమోదవుతుందనే హెచ్చరికల నేపథ్యంలో ఇండియా.. బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించటంతోపాటు కొన్ని రకాల బియ్యం ఎగుమతులపై 20 శాతం పన్ను విధించింది.
అయినప్పటికీ ఎగుమతులు మూడున్నర శాతం పెరిగి 22 పాయింట్ రెండు ఆరు మిలియన్ టన్నులకు చేరాయి. ఈ ఎగుమతులు.. థాయ్‌ల్యాండ్, వియత్నాం, పాకిస్థాన్ మరియు అమెరికా ఉమ్మడి ఎగుమతుల కన్నా కూడా ఎక్కువ కావటం విశేషం. దీన్నిబట్టి ప్రపంచవ్యాప్తంగా బియ్యానికి ఎంత గిరాకీ నెలకొందో అర్థంచేసుకోవచ్చు.