NTV Telugu Site icon

మంద్రస్వర గీతాలలో ఆయనే ‘రాజా’!

Remembering Legendary Singer and Music Director AM Raja Birth Anniversary

ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఎ. ఎం. రాజా 1929 జూలై 1వ తేదీ చిత్తూరు జిల్లాలోని రామచంద్రపురంలో మన్మథరాజు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. పచ్చయప్ప కళాశాల నుండి 1951లో బి. ఏ. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. మాస్టర్ నటరాజన్ వద్ద సంగీతాభ్యాసం పొందిన ఎ. ఎం రాజా కళాశాలలో చదివేటప్పుడే ఎన్నో పాటల పోటీలలో పాల్గొని బహుమతులను పొందారు. తమిళంలో సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వంలో ‘సంసారం, సంసారం’ రాజా పాడిన మొట్ట మొదటి సినిమా పాట. తెలుగులో ఆయన పాడిన మొదటి పాటలు ‘ఆకలి’, ‘ఆదర్శం’, ‘సంక్రాంతి’ (1952) చిత్రాలలోవి. కానీ గాయకుడిగా గుర్తింపు పొందింది ‘పక్కింటి అమ్మాయి’ (1953) సినిమాలో పాడిన పాటలతోనే! తెలుగు తమిళ సినిమాలలోనే రాజా ఎక్కువగా పాటలు పాడారు. ఎంజీఆర్ నటించిన ‘జెనోవా’ చిత్ర నిర్మాణ సమయంలో పి.జి. కృష్ణవేణిని (జిక్కీ) చూడడం తటస్థించింది. ఇద్దరూ కలిసి సినిమాలలో యుగళ గీతాలు పాడేవారు. అలా ఆ పరిచయం ప్రేమగా మారింది. అది పెరిగి, పాటలలోనే కాకుండా జీవితంలో కూడా భాగస్వాములయ్యారు. వారికి నలుగురు ఆడ పిల్లలు, ఇద్దరు కొడుకులు.

గాయకుడి ఎ. ఎం. రాజా కెరీర్ ప్రారంభించిన కొత్తలో ‘ప్రేమలేఖలు’, ‘అమరసందేశం’, ‘విప్రనారాయణ’ చిత్రాలు ఆయనకు చక్కని గుర్తింపును తెచ్చిపెట్టాయి. సుశీలతో పాడిన ‘మిస్సమ్మ’ చిత్రంలోని ‘బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే’ వంటి మరపురాని పాటలు అనేకం పాడారాయన. ‘బంగారు పాప, భాగ్యరేఖ’ చిత్రాలలో రాజా పాడిన పాటలు కూడా తీపి గుర్తులే! 1953-57 మధ్య కాలంలో రాజా నక్షత్రంలా ఒక వెలుగు వెలిగారు. ముఖ్యంగా 1953 – 55 సంవత్సరాలలో ఘంటసాల కంటే రాజా గాత్రానికే నిర్మాతలు, సంగీత దర్శకులు ప్రాధాన్యతనిచ్చారు. అయితే తొలినుండి రాజాకు సంగీతాన్ని సమకూర్చాలనే కోరిక బలంగా ఉండేది. అది 1958లో ‘శోభ’ మూవీతో తీరింది. అలానే ఆయనకు సంగీత దర్శకుడిగా గొప్ప పేరు తెచ్చిపెట్టిన సినిమా ‘కళ్యాణ పరిశు’. విశేషం ఏమంటే… భార్య జిక్కీ కంటే రాజా చిత్రాలలో ఎక్కువగా పాటలు సుశీల పాడారు. మలయాళ సినీ రంగంలో హీరో సత్యన్‌కు గాత్రదానం ఎక్కువగా చేసింది రాజాయే. మలయాళంలో రాజా సంగీత దర్శకత్వం కూడా చేశారు.

ఘంటసాల, రాజా ఇద్దరు ఒకే చిత్రంలో పాడినా, ఘంటసాల సంగీత దర్శకత్వంలో రాజా ఎప్పుడూ పాడలేదు, కాని రాజా దర్శకత్వంలో ఘంటసాల పాడారు. తమిళంలోనూ రాజా కంటే ఆ టైమ్ లో పీబీ శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వడం మొదలు పెట్టారు. సంగీత దర్శకుడైన తరువాత మిగిలిన సంగీత దర్శకులు ఆయనతో పాటలు పాడించడం బాగా తగ్గిపోయింది. రాజా లో గాయకుడు, సంగీత దర్శకుడితో పాటు ఓ చక్కని నటుడూ ఉన్నాడు. ‘పక్కింటి అమ్మాయి’ (1953) చిత్రంలో రాజా నటనను అందరూ మెచ్చుకొన్నారు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత రాజా, జిక్కీ దేశవిదేశాలలో తమ పాటల కచేరీలు చేశారు. వాటికి మంచి ఆదరణ లభించింది. దురదృష్టం ఏమంటే… 1989 ఏప్రిల్ 7న ఒక కచేరికి వెళ్ళుతున్నప్పుడు పరిగెత్తే రైలు ఎక్కుతూ కాలు జారి పట్టాల కింద పడి రాజా మరణించారు. అదే రైలులో ఆయన భార్య జిక్కీ కూడా ఉన్నారు. వివిధ భాషలలో దాదాపు వెయ్యి పాటలు పాడిన రాజా, సుమారు 30 చిత్రాలకు స్వర రచన చేశారు. నిజానికి తెలుగులో కంటే తమిళంలో రాజాకు ఎనలేని కీర్తి దక్కింది. మంద్ర స్వరంలో శ్రుతి తప్పకుండా పాటలు పాడటంలో రాజా మిన్న అన్నది సంగీత విమర్శకులు చెప్పే మాట.

(ఎ. ఎం. రాజా జయంతి సందర్భంగా)