NTV Telugu Site icon

Prashant Kishor: ప్రశాంత్‌ కిషోర్‌ బీహార్‌ ప్రయోగం వెనక రాజకీయం..!

గత కొంత కాలంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ పేరు నిత్యం వార్తలలో వినిపిస్తోంది. కాంగ్రెస్‌లో చేరుతున్నారని హడావుడి చేశారు. ఇంతలో అదేం లేదని పీకే తేల్చేశారు. మరోవైపు, ఆయన ఇప్పటికీ టీఎంసీ, వైఎస్‌ఆర్‌సీపీ, డీఎంకే, టీఆర్ఎస్‌ వంటి పార్టీలకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ట్విటర్‌లో ఆయన చేసిన ప్రకటన రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేపుతోంది.

ప్రశాంత్‌ కిశోర్‌ తన తాజా ట్వీట్‌ ద్వారా పార్టీ స్థాపించే సంకేతం ఇచ్చానిపిస్తోంది. ఐతే అది ఎప్పడు అనే క్లారిటీ ఇవ్వలేదు. పార్టీ పెడతారో పెట్టరో తెలియదు కానీ ఆయన ఇప్పుడు జనంలోకి వెళ్లే మార్గం వెతుక్కున్నారు. అందుకు తన సొంత రాష్ట్రం బీహార్‌ను ఎంచుకున్నారు. గుజరాత్ మోడల్, ఢిల్లీ మోడల్ ..ఇలా ఏదో ఒక నమూనా కాకుండా జనం వాస్తవంగా ఎలాంటి పాలనను కోరుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు. దానిబట్టి ఆయన తన భవిష్యత్‌ మార్గాన్ని ఎంచుకుంటారు. అంటే పార్టీ పెట్టవచ్చు..పెట్టకపోవచ్చు. లేదంటే ఇంకేమైనా చేయవచ్చు.

ప్రశాంత్‌ కిషోర్ ప్రస్తుతం బీహార్‌లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ టూర్‌లో ఆయన పలువురు పౌర సమాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలను కలుస్తారు. తన భవిష్యత్‌ కార్యాచరణపై ప్రజలకు క్లారిటీ ఇచ్చేందుకు గురువారం బీహార్‌లో ఓ సమావేశం నిర్వహిస్తారని సమాచారం.

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీపై టీఎంసీ ఘన విజయం తరువాత నిరుడు సరిగ్గా ఈ రోజు (మే 2) తాను ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించబోనని పీకే ప్రకటించారు. దాంతో పాటు ఐ-పాక్‌ (ఇండియన్‌ పొలిటికల్ యాక్షన్‌ కమిటీ) నుంచి కూడా తప్పుకుంటున్నాని చెప్పారు. కొద్ది రోజుల తరువాత తన భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. ఇది జరిగిన ఏడాది తరువాత ఆయన తన ఫ్యూచర్‌ ఏమిటో నిర్ణయించుకునే పనిలో పడ్డారు. అందుకు తన సొంత రాష్ట్రం బీహార్ ని కార్యస్థలిగా ఎంచుకున్నారు. వంద మందికి పైగా ఐ-పాక్‌ ఉద్యోగుల బృందం నెల రోజుల క్రితమే బీహార్ లో ఆయన కోసం పనిలో దిగింది.

ఇక, సోమవారం ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన ట్వీట్‌ని పరిశీలిస్తే ఆయన భవిష్యత్‌ ఆలోచనలపై కొంత వరకు క్లారిటీ దొరుకుతుంది. ప్రజా అనుకూల పాలనా నామూనా రూపొందించేందుకు, అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేసేందుకు 10 ఏళ్లుగా ఒడుదొడుకుల ప్రయాణం చేశానన్నారు. ఇప్పుడు ఈ ప్రయాణంలో మరో పేజీ తిప్పుతున్నాని చెప్పారు. నిజమైన యాజమానులైన ప్రజల సమస్యలను మరింత అర్థం చేసుకునేలా వారి వద్దకు నేరుగా వెళ్లాల్సిన సమయం వచ్చిందని.. ఆ మార్గమే ‘జన్‌ సురాజ్‌ – ప్రజా సుపరిపాలన’ అన్నారాయన. ఈ ప్రయాణాన్ని బిహార్‌ నుంచి ఆరంభిస్తానని పీకే తన ట్వీట్లో పేర్కొన్నారు.

ఇదిలావుంటే, రాబోయే కొన్ని నెలల పాటు ఆయన బీహార్‌కే ఎక్కువ సమయం కేటాయించనున్నారు. ఇప్పటికే చాలా రోజులకు ఆయన షెడ్యూల్ ఫిక్స్‌ అయింది. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న పౌర సమాజ ప్రముఖులను కలిసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. వైద్యులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు ఇలా అనేక రంగాలకు చెందిన వారితో పీకే భేటీ అవుతారు.

వాస్తవానికి ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పటికే ఓసారి ప్రత్యక్ష రాజకీయాలలో తన భవిష్యత్‌ను పరీక్షించుకున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జనతాదళ్ (యునైటెడ్) ఉపాధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అయితే 2019 లో పార్టీ బహిష్కరణకు గురయ్యారు. తర్వాత ఆయన అధికారికంగా ఏ రాజకీయ పార్టీలో భాగం కాలేదు.

వ్యూహకర్తగా నరేంద్ర మోడీ, కేజ్రీవాల్‌. వైఎస్‌ జనగ్‌, ఎంకే స్టాలిన్‌, మమతా బెనర్జీతోపాటు కాంగ్రెస్, శివసేనతో కలిసి పనిచేసి వారి విజయంలో కీలక పాత్ర పోషించిన అనుభవం ఆయనకు ఉంది. అయితే ఆయన పనిచేసింది ప్రజల కోసం కాదన్నది ఇక్కడ మనం గుర్తించాలి. అన్ని లెక్కలు చూసుకుని తనకు ఆసక్తి ఉన్న పార్టని ఎంచుకుని భావజాలం, సైద్ధాంతిక విలువలతో సంబంధం లేకుండా కేవలం ఆయా పార్టీల గెలుపుకోసం వ్యూహ రచన చేసిన వ్యక్తి ప్రశాంత్‌ కిశోర్‌. అలాంటి ఆయన ఇప్పుడు విలువలు, ప్రజల గురించి మాట్లాడం విచిత్రమే.

ప్రశాంత్‌ కిశోర్‌లో ఇప్పటికీ ఓ ఎన్నికల వ్యాపారి కనిపిస్తాడు. అందుకే ఆయన తొందరపడి పార్టీ పెడుతున్నట్టు ప్రకటించలేదు. ఒక వైపు తన రాజకీయ ఆకాంక్షలు, మరోవైపు కన్సల్టెన్సీ బిజినెస్‌.. రెండింటిని జాగ్రత్తగా బ్యాలెన్స్‌ చేసుకోవాలి. అందుకే జన్‌ సురాజ్‌ ను ముందుకు తెచ్చారనుకోవచ్చు. తొందరపడి పార్టీ స్థాపించి విఫలమైతే మొదటికే మోసం రావచ్చు. ఎన్నో పార్టీలను గెలిపించిన ఆయన తన సొంతపార్టీని గెలిపించుకోలేకపోయారనే అపప్రదను ఎదుర్కోవాలి. అది తన కన్సల్టెన్సీ వ్యాపారంపై వ్యతిరేకం ప్రభావం చూపుతుందనే ఆయన భయం కావచ్చు. ఇదంతా ఆలోచించే ఆయన ముందు ప్రజలలోకి వెళతా అంటున్నారు. ప్రజా స్పందన బట్టి తరువాత దేశమంతా పర్యటించే అవకాశం ఉంది.

నిజానికి ప్రశాంత్‌ కిశోర్‌కు రాజకీయంగా పెద్ద పెద్ద కోరికలు ఉన్నట్టు కనిపిస్తోంది. ఎంపీ వంటి పదవులతో ఆయన సరిపెట్టుకోవాలనుకోవటం లేదు. ఎన్నో పార్టీలను గెలిపించిన ఆయన కోరుకుంటే ఎప్పుడంటే అప్పుడు పార్లమెంట్‌ సభ్యుడు కాగలడు. కానీ ఆయన రాజకీయాలలో ఏదో పెద్ద స్థానాన్ని ఆశిస్తున్నారని అనిపిస్తోంది. అందుకోసమే ఈ కసరత్తు కావచ్చు.

పీకే గతంలో నితీష్‌ కుమార్‌ వారసుడుగా ఎదగాలనుకున్నారు. నితీష్‌ని జాతీయ రాజకీయాలలోకి పంపి తాను రాష్ట్రంలో చక్రం తిప్పాలనుకున్నాడు. అయితే జనతాదళ్‌ (యూ)లోని పాత కాపులు అడ్డంతిరిగారు. చివరకు ఆయననే పార్టీ నుంచి పంపించారు. దాంతో పీకే కి ఇప్పటి వరకు సరైన రాజకీయ వేదిక లేదు. బీజేపీ, ఆర్జేడీలోకి వెళ్లే అవకాశం లేదు. ఇక మిగిలింది కాంగ్రెస్…అందుకే సోనియా, రాహుల్ చుట్టూ తిరిగారాయన.

పీకే బీహార్ కాంగ్రెస్‌ పగ్గాలు ఆశించారు. అదీ కాదంటే 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతిపాదించిన ఎంపవర్డ్‌ యాక్షన్‌ గ్రూప్‌ని అప్పచెప్పి పూర్తి స్వేచ్ఛ ఇస్తారనుకున్నారు. కాని ఆయన కోరుకున్నది ఏదీ జరగలేదు. వేరే మార్గం లేక సొంత పార్టీ వైపు చూస్తున్నట్టు అనిపిస్తోంది. అది కూడా ఇప్పుడే తాను పార్టీ ఏర్పాటు చేస్తానని చెప్పలేదు. ప్రజలలోకి వెళ్లి పరిస్థితిని అంచనావేసిన తరువాత నిర్ణయం తీసుకుంటానని అన్నారు.

మరోవైపు, కాంగ్రెస్‌తో పీకే పూర్తిగా తెగతెంపులు చేసుకోలేదు. పార్టీలో చేరటం లేదు అని మాత్రమే ప్రకటించారు. కనుక, ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు కాంగ్రెస్‌ కండువా కప్పుకునే అవకాశం ఉంది. భేషరతుగా చేరతానంటే వెల్‌కం చెబుతుంది. ఎందుకంటే, హస్తం పార్టీలోకి ఎప్పుడైనా ..ఎవరైనా ..రావచ్చు, పోవచ్చు. కనుక, బీహార్‌ ప్రయోగం తరువాత పీకే ఆలోచనలు ఎలా ఉంటాయో చూడాలి.