NTV Telugu Site icon

PhonePe Wonderful Decision: ఫోన్‌పే అద్భుత నిర్ణయం.. ఇక, అందరికీ యాక్టివేషన్..

Phonepe Wonderful Decision

Phonepe Wonderful Decision

PhonePe Wonderful Decision: ఈ రోజుల్లో ఫోన్‌ గురించి తెలియనివారు ఉన్నారా? అస్సలు లేరు కదా!. అలాగే.. ఫోన్‌పే గురించి తెలియనివారు కూడా లేరంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే అది అంతగా ప్రజల్లోకి వెళ్లింది. మనం రోజూ పలికే ఫోన్‌ అనే రెండక్షరాల పక్కన ‘పే’ అనే ఒక్క అక్షరం చేర్చటంతో ఆ పేరు పలకటం ప్రజలకు ఈజీ అయింది. అలా.. అది జనం నోళ్లల్లో నానింది. మౌత్ పబ్లిసిటీతోనే ప్రతి సిటీ నుంచి గల్లీగల్లీకీ చేరింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. ఆ సంస్థ ఇటీవలే ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. దీంతో.. ఇక అందరికీ ఈ యాప్‌ అందుబాటులోకి రానుంది. ఆ విశేషాలే ఈ ప్రత్యేక కథనం..

‘ఫోన్‌పే’ రాకముందే.. వివిధ బ్యాంకులు మొబైల్‌ బ్యాంకింగ్‌ మరియు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయాలను, సంబంధిత యాప్‌లను అందుబాటులోకి తెచ్చాయి. కానీ ఆ సర్వీసులు కేవలం ఆ బ్యాంకుకు మాత్రమే పరిమితమయ్యేవి. అలాంటప్పుడు.. ఒక వ్యక్తికి రెండు మూడు బ్యాంకుల్లో ఖాతాలుంటే వాటిని ఒకే యాప్‌ ద్వారా ఆపరేట్‌ చేయటం అసంభవంగా ఉండేది. కానీ.. ఆ అసాధ్యాన్ని ‘ఫోన్‌పే’ సుసాధ్యం చేసింది. ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నప్పటికీ.. వాటికి ఒకే ఫోన్‌ నంబర్‌ లింకై ఉంటే.. ఆ ఖాతాలన్నింటినీ ఒకే వేదిక మీదికి తీసుకొచ్చిన గొప్పతనం మాత్రం మొట్టమొదటగా ‘ఫోన్‌పే’కే దక్కుతుందని చెప్పాలి.

read more: L & T Company: ముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌.. అంటే.. యూపీఐ. ఈ సౌకర్యం వల్లే ‘ఫోన్‌పే’ ఇంతలా సక్సెస్‌ అయింది. మొబైల్‌ పేమెంట్లలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి మరో సరికొత్త సువర్ణధ్యాయాన్నే లిఖించబోతోంది. గతంలో ఫోన్‌పే సర్వీసులు పొందాలంటే ముందుగా మన ప్రాథమిక వివరాలను మరియు ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డు డిటెయిల్స్‌ను ఆ యాప్‌లో ఎంటర్‌ చేసి పేరు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాంక్‌ అకౌంట్లను యాడ్‌ చేసుకోవాలి.

ఫోన్‌పే ద్వారా అకౌంట్లలోని బ్యాలెన్స్‌ను చెక్‌ చేసుకోవాలన్నా, అమౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయాలన్నా, పేమెంట్లు నిర్వహించాలన్నా ముందుగా పిన్‌ నంబర్‌ క్రియేట్‌ చేసుకోవాలి. దీనికోసం సంబంధిత బ్యాంక్‌ అకౌంట్‌ డెబిట్‌ కార్డ్‌ నంబర్‌లోని చివరి 6 డిజిట్లను ఎంటర్‌ చేయాల్సి వచ్చేది. కానీ.. ఇప్పుడు ఆ పద్ధతిని తీశారు. ఏటీఎం కార్డు ప్లేసులో ఆధార్‌ కార్డ్‌ డిటెయిల్స్‌ ఎంటర్‌ చేస్తే యూపీఐ సర్వీస్‌ యాక్టివేట్‌ అయ్యేలా ఇటీవల సరికొత్త ఏర్పాటు చేశారు. దీంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి సంస్థగా ఫోన్‌పే నిలిచింది.

యూపీఐ ఎకోసిస్టమ్‌లోకి మరికొన్ని కోట్ల మందిని తీసుకొచ్చేందుకు మరియు వాళ్లకు సులభంగా, సురక్షితంగా సేవలందించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఫోన్‌పే తెలిపింది. గతంలో డెబిట్‌ కార్డులు లేనివాళ్లు యూపీఐ పిన్‌ నంబర్‌ను క్రియేట్‌ చేసుకోవటానికి అవకాశం ఉండేది కాదు. దీంతో పెద్ద సంఖ్యలో ఖాతాదారులు ఈ సర్వీసును పొందలేకపోయేవారు. ఏటీఎం కార్డుకు బదులు ఆధార్‌ కార్డును ప్రవేశపెట్టడంతో యూపీఐ సేవల ప్రయోజనాలు దాదాపు అందరికీ అందనున్నాయి.

ఆధార్‌ బేస్డ్‌ ఓటీపీ ఆథంటికేషన్‌ను ప్రవేశపెట్టిన ఫస్ట్‌ ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫాం అని చెప్పుకోవటానికి సంతోషిస్తున్నామని ఫోన్‌పే పేమెంట్స్‌ హెడ్‌ దీప్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. RBI, NPCI మరియు UIDAI చేపట్టిన ఈ చర్య అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతోందని, డిజిటల్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌కు ఇదొక గ్రేట్‌ ఎగ్జాంపుల్‌ అని కితాబిచ్చారు. ఈ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకున్నవాళ్లు ఆధార్‌ నంబర్‌లోని చివరి 6 డిజిట్లను ఎంటర్‌ చేస్తే ఆధార్‌ సంస్థతోపాటు ఖాతా ఉన్న బ్యాంకు నుంచి ఓటీపీలు వస్తాయి. వాటిని ఎంటర్‌ చేస్తే ఫోన్‌పేలోని అన్ని యూపీఐ ఫీచర్లనూ వాడుకోవచ్చు.

యూపీఐ పేమెంట్‌ సిస్టమ్‌కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. అన్ని దేశాలూ ఈ డిజిటల్‌ చెల్లింపు విధానాన్ని అమలుచేయాలని చూస్తున్నాయి. తామూ ఆ దిశగానే పయనిస్తున్నామని, NPCIతో కలిసి యూపీఐని ఇంటర్నేషనల్‌ లెవల్‌కి తీసుకెళ్లటానికి కృషి చేస్తున్నామని దీప్‌ అగర్వాల్‌ తెలిపారు. ఫోన్‌పేకి భారత్‌లో ప్రస్తుతం 41 పాయింట్‌ 5 కోట్ల మంది రిజిస్టర్డ్‌ యూజర్లు ఉన్నారు. దీనికితోడు 3 పాయింట్‌ 3 కోట్ల మంది ఆఫ్‌లైన్‌ మర్చెంట్లను డిజిటల్‌ బాట పట్టించింది. దేశంలోని 99 శాతం పిన్‌కోడ్‌లను కవర్‌ చేస్తోంది. అంటే దాదాపు ఇండియా మొత్తం అందుబాటులోకి వచ్చింది. ఇక అంతర్జాతీయంగా రాణించటమే తరువాయి.