Site icon NTV Telugu

Koti: అలరించిన ‘కోటి’ స్వరాలు…

Koti

Koti

(మే 28న సంగీత దర్శకుడు కోటి బర్త్ డే)
సాలూరి వారి బాణీలు ‘రసాలూరిస్తూ’ ఉంటాయని ప్రతీతి. ఆ ఖ్యాతికి కారణం సాలూరి రాజేశ్వరరావు స్వరకల్పన. ఆయన సోదరుడు హనుమంతరావు సైతం అలాగే తన సంగీతంతో అలరించారు. వీరిద్దరి బాణీని పునికి పుచ్చుకొని కోటి తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో తనదైన నాదం వినిపించి, జనానికి మోదం కలిగించారు. తండ్రి రాజేశ్వరరావు స్థాయిలో కాకపోయినా, కోటి స్వర విన్యాసాలు తరువాతి తరాలను విశేషంగా అలరించాయి.

సాలూరి రాజేశ్వరరావు తనయుల్లో ఆయనలాగా సంగీత దర్శకునిగా విజయవిహారం చేసింది సాలూరు కోటేశ్వరరావు ఒక్కరే. తండ్రి వద్ద, పెదనాన్న వద్ద సప్తస్వరసాధనలో మెలకువలు నేర్చుకున్న కోటి, తరువాత చక్రవర్తి వద్ద అసోసియేట్ గా పనిచేశారు. అక్కడే మరో ప్రఖ్యాత సంగీత దర్శకుడు టి.వి.రాజు తనయుడు రాజుతో దోస్తీ కుదిరింది. ఇద్దరూ మంచి మిత్రులు. రాజ్-కోటి పేరుతో ఈ సంగీతద్వయం టాలీవుడ్ లో జైత్రయాత్ర సాగించింది. వీరికి కీ బోర్డ్ ప్లేయర్ గా పనిచేసిన ఎ.ఆర్.రహమాన్, తరువాత ఏ స్థాయిలో అలరించారో అందరికీ తెలిసిందే. రాజ్-కోటి కొన్ని కారణాల వల్ల విడిపోయారు. సోలోగా కోటి విజయపథంలో పయనించారు. ఇద్దరూ కలసి దాదాపు 150కి పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చారు. తరువాత కోటి సోలోగా 300 పైచిలుకు చిత్రాలకు బాణీలు కట్టారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ కోటి మ్యూజికల్ హిట్స్ అందించారు. యంగ్ హీరోస్ కు సైతం కోటి బాణీలు భలేగా పనిచేసి, వారు స్టార్ డమ్ చూసేలా చేశాయి. తరువాతి రోజుల్లో పలు చిత్రాలకు కోటి నేపథ్య సంగీతం కూడా సమకూర్చారు. సంగీత దర్శకునిగా తనదైన మార్కు చూపించిన కోటి ప్రస్తుతం పలు మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కు న్యాయనిర్ణేతగానూ వ్యవహరిస్తున్నారు. వాటిలో ఎందరో భావి గాయనీగాయకులకు సూచనలిస్తూ సాగుతున్నారు కోటి.

Exit mobile version