Mansukh Kaka: సాధారణంగా చాలా మంది 60 ఏళ్లు దాటితే .. అబ్బా కాస్త విశ్రాంతి దొరికితే బాగుణ్ణు అనుకుంటారు. కానీ ముంబైకి చెందిన ఓ 82 ఏళ్ల వృద్ధుడి డైరీలో ‘విశ్రాంతి’ అనే పదమే లేదు. వయసు తెచ్చిన భారం ఒకవైపు.. పొట్టకూటి కోసం చేయాల్సిన పోరాటం మరోవైపు.. అయినా ఎవరి ముందూ చేయి చాచలేదు. ఆత్మగౌరవంతో బతకాలనే ఆయన సంకల్పం ముందు వృద్ధాప్యం కూడా తలవంచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్షలాది మంది హృదయాలను కదిలిస్తున్న ‘మన్సుఖ్ కాకా’ కన్నీటి గాథని ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఒక్క వీడియోతో వెలుగులోకి వచ్చిన జీవితం..
ముంబైకి చెందిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ ఆరాధన ఛటర్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక చిన్న వీడియో ఈ వృద్ధుడి జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఒకరోజు ఆరాధన రోడ్డు పక్కన వెళ్తుండగా, తెల్లటి జుట్టు, ముడతలు పడిన చేతులతో ఒక తాత ఎంతో శ్రద్ధగా స్నాక్స్ ప్యాకెట్లను సర్దుకోవడం గమనించింది. ఆమె దగ్గరికెళ్లి పలకరించి, అతని జీవిత విశేషాలు అడిగి తెలుసుకున్నప్పుడు ఆమె గుండె తరుక్కుపోయింది. మన్సుఖ్ కాకా గతంలో ఒక పెద్ద చీరల దుకాణంలో సేల్స్‌మెన్‌గా దశాబ్దాల పాటు నమ్మకంగా పనిచేశారు. అయితే కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆయన ఆరోగ్యం దారుణంగా క్షీణించింది. అనారోగ్యం కారణంగా ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది. దాంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత మన్సుఖ్ కాకా ఖాళీగా కూర్చోలేదు. తన కుటుంబానికి భారం కాకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. మన్సుఖ్ కాకా సోదరి (అక్క) ఇంట్లోనే గుజరాతీ సాంప్రదాయ చిరుతిళ్లయిన ఖఖ్రా, చక్లీ, ఫర్సాన్ వంటి సుమారు 20 రకాల స్నాక్స్‌ను ఎంతో తాజాగా, రుచిగా తయారు చేస్తుంది. తన అక్క తయారు చేసిన ప్యాకెట్లను తీసుకుని మన్సుఖ్ కాకా రోడ్డు పక్కన ఒక చిన్న టేబుల్ (స్టాల్) ఏర్పాటు చేసుకుని వాటిని అమ్మడం స్టార్ట్ చేశారు.
12 గంటల కష్టం.. చేతిలో పడేది కేవలం రూ. 300
ఉదయం నుంచే మొదలయ్యే ఈ 82 ఏళ్ల వృద్ధుడి పోరాటం రాత్రి వరకు సాగుతుంది. ప్రతిరోజూ దాదాపు 12 గంటల పాటు కస్టమర్ల కోసం రోడ్డు పక్కన నిలబడి ఎదురుచూస్తుంటారని ఆయన చెప్పారు. ఇంత కష్టపడ్డా, రోజు ముగిసేసరికి ఆయన చేతిలో మిగిలే ఆదాయం కేవలం రూ.300 మాత్రమే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వచ్చిన ఆ కొద్దిపాటి ఆదాయాన్ని, ఖర్చులను కూడా ఆయన ఒక చిన్న డైరీలో ఎంతో క్రమశిక్షణతో, చాలా జాగ్రత్తగా నమోదు చేసుకుంటారు. ఆయన నిజాయితీ నెటిజన్లను ఫిదా చేస్తోంది. మన్సుఖ్ కాకా వయసు 82 ఏళ్లయినా ఆయన క్రమశిక్షణ ఎందరికో ఆదర్శం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఆయన శుభ్రమైన దుస్తులు ధరించి, చొక్కా ఇన్-షర్ట్ చేసుకుని చాలా హుందాగా కనిపిస్తున్నారు. కొనుగోలు చేయడానికి వచ్చే కస్టమర్లతో ఆయన మాట్లాడే మర్యాదపూర్వక తీరు చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. “మన్సుఖ్ కాకా లాంటి వారికి సహాయం చేయడమంటే ఉచితంగా డబ్బులు ఇవ్వడం కాదు.. ఆయన ఆత్మగౌరవాన్ని గౌరవిస్తూ, ఆయన అమ్ముతున్న చిరుతిళ్లను కొనుగోలు చేయడమే” అని ఆరాధన ఛటర్జీ ఆ వీడియోలో నెటిజన్లను కోరారు. ఆ రూట్‌లో వెళ్లే ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం ఆగి, తాత దగ్గర స్నాక్స్ కొనాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కష్టపడి పనిచేయడానికి, ఆత్మగౌరవంతో బతకడానికి వయసుతో నిమిత్తం లేదని నిరూపించిన ఈ ‘మన్సుఖ్ కాకా’కు నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.

