Liverpool Football Club: ఇండియన్ బిజినెస్ మ్యాగ్నెట్లలో ఒకరైన రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధిపతి ముఖేష్ అంబానీ ఇప్పటికే మన దేశంలోని క్రీడా రంగంలోకి కూడా ప్రవేశించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. క్రికెట్‌లోని ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టును పదేళ్లకు పైగా విజయవంతంగా నడిపిస్తున్నారు. ఫుట్‌బాల్ టోర్నమెంట్ ‘ఇండియన్ సూపర్ లీగ్’కి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఇప్పుడు విదేశాల్లోని క్రీడా రంగంలో సైతం పెట్టుబడులు పెట్టనున్నారా అనే వార్తలు వెలువడుతున్నాయి. ముఖేష్ అంబానీ యూరప్‌లోని లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్‌ను కొనుగోలు చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఇది రియల్ కాదని రిలయెన్స్ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో.. అసలు.. ఈ వార్త నిజమైతే ఎలా ఉంటుంది? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అందుకే ఈ ప్రత్యేక కథనం.
లివర్‌పూల్ ఎఫ్‌సీ అనేది ఐరోపాలో టాప్ ఫుట్‌బాల్ క్లబ్. ఆ క్లబ్‌ని ముఖేష్ అంబానీ కొనుగోలు చేయాలని చూస్తున్నారంటూ బ్రిటన్‌కి చెందిన మిర్రర్ అనే సంస్థ తాజాగా రిపోర్ట్ చేసింది. నిజానికి ఈ మీడియా హౌజ్ గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద న్యూస్‌ను పబ్లిష్ చేయలేదు. ట్యాబ్లాయిడ్ సైజ్‌లో ఉండే ఈ పేపర్ ఎక్కువగా ఊహాజనితమైన వార్తలను ప్రచురించటంతోనే నెట్టుకొచ్చేది. కానీ ఇప్పుడు ఈ సంచలన విషయాన్ని బయటపెట్టి సరికొత్త చర్చకు దారితీసింది. అయితే.. ఈ రూమర్స్‌ని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఖండించటంతో లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్‌ని ముఖేష్ అంబానీ కొనట్లేదనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ.. అసలు ప్రశ్న ఇక్కడే తలెత్తుతోంది. రిలయెన్స్ సంస్థ ఒకవేళ లివర్‌పూల్ ఎఫ్‌సీని కొంటే ఏమవుతుంది? అనేదే ఆ ప్రశ్న.
read more: Bill Gates: ప్రధాని మోడీపై బిల్‌గేట్స్ ప్రశంసలు..
యూరప్ మొత్తమ్మీద మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్లబ్బులు కొన్ని ఉన్నాయి. అవి కాసుల వర్షాన్ని కురిస్తున్నాయి. మ్యాచ్‌లు చూసేందుకు, టికెట్లు కొనేందుకు ఫ్యాన్స్ ఎగబడుతుండటంతో ఆటగాళ్లు మొదలు ప్రసారకర్తల వరకు అందరూ లాభాలు ఆర్జిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫుట్‌బాల్ క్లబ్బులు ఫైనాన్షియల్‌గా సూపర్ హిట్ అవుతున్నాయి. గతేడాది ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు ఏకంగా 2 వందల కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆటల్లోనే పెట్టారంటే అర్థంచేసుకోవచ్చు వాటి మీద జనానికి ఎంత క్రేజ్ ఉందో. ఈ ఇన్వెస్ట్‌మెంట్లలో మెజారిటీ వాటా ఫుట్‌బాల్‌దే కావటం విశేషం. ఈ నేపథ్యంలో వ్యాపారులు ఫుట్‌బాల్ క్లబ్బులను కామధేనువుల్లా భావిస్తున్నారు. వందల కోట్లు పెట్టి కొనుగోళ్లు చేస్తున్నారు. చెల్సియా అనే ఫుట్‌బాల్ క్లబ్‌ని ఆగమేఘాల మీద అమ్మేస్తేనే 2 వందల 50 కోట్ల పౌండ్లకు పైగా డబ్బులు వచ్చాయి. ఇదీ.. ఒక ఫుట్‌బాల్ క్లబ్‌కి ఉన్న డిమాండ్.
ఇక, లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ విషయానికొస్తే.. ఫెన్‌వే స్పోర్ట్స్ గ్రూప్ దీన్ని 2010లోనే 30 కోట్ల పౌండ్లు పెట్టి అక్వైర్ చేసుకుంది. 12 ఏళ్ల అనంతరం.. అంటే.. ఇప్పుడు.. ఏకంగా 13 రెట్లు ఎక్కువకు అమ్మాలని ప్లాన్ వేసింది. తద్వారా 400 కోట్ల పౌండ్లను ఖాతాలో వేసుకోవాలని ఆశిస్తోంది. దీనికి కారణం.. స్పోర్ట్స్.. గ్లోబల్ లెవల్‌కి ఎదిగాయి. ఫలితంగా.. ప్రసార హక్కుల రూపంలోనే టన్నులకొద్ది డబ్బు వస్తోంది. అందువల్ల ఆటలను ఇప్పటివరకూ కేవలం ఎంటర్టైన్‌మెంట్ యాంగిల్లోనే చూశాం గానీ ఇకపై కమర్షియల్ కోణంలో కూడా చూడాల్సిన అవసరముంది. కాబట్టి.. ముఖేష్ అంబానీ లివర్‌పూల్‌ను కొనుగోలు చేయాల్సిందే అంటారా.. అంటే.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటం కొంచెం కష్టమే. దీనికొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. డబ్బున్నోళ్లందరూ.. స్పోర్ట్స్‌లో ఇన్వెస్ట్ చేసినవాళ్లందరూ.. సక్సెస్ కాలేదనటానికి ఓ ఉదాహరణ చెప్పుకోవాలి.
మన దేశానికే చెందిన వెంకీస్ అనే సంస్థ.. బ్లాక్‌బర్న్ రోవర్స్ అనే ఫుట్‌బాల్ క్లబ్‌ను 2010 చివర్లో అక్వైర్ చేసుకుంది. అందరిలాగే తానూ సక్సెస్ అవ్వాలని, డబ్బు సంపాదించాలని కోరుకుంది. అందులో తప్పులేదు. కానీ.. అది జరగలేదు. రోవర్స్‌పై పెంచుకున్న ఆశలు రెండు మూడేళ్లలోనే రివర్స్ అయ్యాయి. దీంతో పదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయింది. చివరికి ఆ క్లబ్బునే రద్దు చేయాల్సి వచ్చింది. ఆటలో నెగ్గి ఆ విజయాన్ని ఇతర వ్యాపారాల్లోకి విస్తరించాలనుకున్న వెంకీస్ కలలు కల్లలయ్యాయి. అంతేకాదు. అప్పటివరకూ బ్రిటన్‌లో ఆ సంస్థ ఫ్రైడ్ చికెన్ బ్రాండ్‌కి ఉన్న ఇమేజ్ సైతం డ్యామేజ్ అయింది. ఈ దెబ్బతో 19 కోట్ల పౌండ్లు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. వెంకీస్‌కి కన్నీరే మిగిలింది. రిలయెన్స్ కూడా ఇలాగే వెనకాముందూ చూసుకోకుండా రంగంలోకి దూకుంటే మరో వెంకీస్ అయ్యేది. ముఖేష్ అంబానీ ముందుచూపుతో ప్రమాదం తప్పింది.