Chanakya Niti: సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని ‘చంచల’ అని పిలుస్తారు. అంటే ఆమె ఒకే చోట స్థిరంగా ఉండదు. అయితే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న ఇళ్లలో మాత్రం లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసం ఉంటుందని కౌటిల్యుడు తన చాణక్య నీతిలో పేర్కొన్నాడు. ఆచార్య చాణక్యుడు తన ‘చాణక్య నీతి’లో మనిషి విజయానికి, సంపద వృద్ధికి అవసరమైన అనేక సూత్రాలను వివరించారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది, మీ ఇంట్లో సిరిసంపదలు తాండవించాలంటే ఏయే అలవాట్లు ఉండాలో చాణక్యుడు తన గ్రంథంలో స్పష్టంగా చెప్పారు. సామాన్యుడి ఇంటిని కూడా స్వర్గధామంగా మార్చి, ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసే ఆ రహస్యాలు ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Pakistan: ‘‘డీలిమిటేషన్ బిల్లు’’పై పాకిస్తాన్ అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన భారత్..
చాణక్యుడి ప్రకారం.. ఎప్పుడూ గొడవలు, కఠినమైన మాటలతో నిండి ఉండే ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. శాంతి ఎక్కడ ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. కుటుంబ సభ్యులు ఒకరినొకరు గౌరవించుకుంటూ, ప్రేమగా మాట్లాడుకునే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఐక్యత ఉన్న కుటుంబం ఎంతటి ఆర్థిక కష్టాలనైనా సులభంగా ఎదుర్కోగలదు. సోమరితనం, అపరిశుభ్రత ఉన్న చోట పేదరికం తాండవిస్తుంది. సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోయే వారిపై, ఇంటిని అస్తవ్యస్తంగా ఉంచుకునే వారిపై లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి, ఇంటిని శుభ్రంగా ఉంచుకుని, క్రమశిక్షణతో ఉండేవారికి ఎన్నడూ డబ్బు కొరత రాదు. సమయపాలన పాటించే వారి చెంతనే అదృష్టం ఉంటుంది.
అన్నాన్ని దైవంగా భావించాలి. ఆహారాన్ని వృధా చేసే ఇంట్లో ఐశ్వర్యం హరించుకుపోతుంది. అలాగే తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు, దానధర్మాలకు ఉపయోగించే వారి సంపద రెట్టింపు అవుతుందని చాణక్యుడు చెప్పాడు. దానం చేయడం వల్ల డబ్బు తగ్గడం కాకుండా పెరుగుతూనే ఉంటుందని వివరించారు. స్త్రీని ‘గృహలక్ష్మి’ అని అంటారు. ఏ ఇంట్లో స్త్రీలు గౌరవించబడతారో, సంతోషంగా ఉంటారో ఆ ఇంటి అభివృద్ధిని ఎవరూ ఆపలేరని చెప్పారు. స్త్రీలను కించపరిచే ఇంట్లో దేవతలు కూడా నివసించరు. అలాగే పండితుల సలహాలు పాటిస్తూ, ధర్మబద్ధంగా సంపాదించే వారి ఇల్లు ఎప్పుడూ సుఖసంతోషాలతో కళకళలాడుతుందన్నారు.
