NTV Telugu Site icon

Keshub Mahindra: 99 ఏళ్ల వయసులో కన్నుమూత.. వందేళ్ల స్ఫూర్తిదాత..

Keshub Mahindra

Keshub Mahindra

Keshub Mahindra: మన దేశంలో మంచి పేరు సంపాదించిన మల్టీ నేషనల్ కంపెనీల్లో మహింద్రా అండ్ మహింద్రా గ్రూప్ కూడా ఒకటి. వివిధ రంగాలపై ఆ సంస్థ చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదంటే అతిశయోక్తి కాదు. అయితే.. ఆ కంపెనీ సాగించిన అనితర సాధ్యమైన ఈ అద్భుత ప్రయాణంలో ఒక వ్యక్తి పోషించిన పాత్ర సైతం అసమానమైంది. ఆయనే.. భారతదేశంలోని సుప్రసిద్ధ వ్యాపారవేత్త, మహింద్రా గ్రూప్ మాజీ చైర్మన్.. కేశబ్ మహింద్రా. ఈ వారం మన డిఫైనింగ్ పర్సనాలిటీ.

read more: Minister KTR Investment: హైదరాబాద్ విద్యార్థినిల స్టార్టప్‌కి రూ.8 లక్షల సొంత డబ్బు

ఇండియా కోసం మహింద్రా.. మహింద్రాతో ఇండియా.. ఈ ఒక్క మాట చాలు. కేశబ్ మహింద్రా గొప్పతనం గురించి చెప్పటానికి. ఎందుకంటే.. మహింద్రా గ్రూప్ కొనసాగిస్తున్న ఈ మహాప్రస్థానం ఆయన ప్రస్తావన లేకపోతే అసంపూర్ణంగా మిగిలిపోతుంది. అంటే.. ఆ సంస్థతో ఆయనకు అంత అనుబంధం ఉందని అర్థం. మహింద్రా గ్రూప్‌లో కేశబ్ మహింద్రా ఏకంగా 48 ఏళ్లపాటు పనిచేశారు. మేనేజ్మెంట్ ట్రైనీగా కెరీర్ ప్రారంభించి చైర్మన్ హోదాలో రిటైర్ అయ్యారు.

అసలు.. కేశబ్ మహింద్రా అంటే ఎవరో కాదు. మహింద్రా అండ్ మహింద్రా గ్రూప్ కోఫౌండర్ కేసీ మహింద్రా కుమారుడే కేశబ్ మహింద్రా. 1923 అక్టోబర్ 9వ తేదీన బ్రిటిష్ ఇండియాలోని షిమ్లాలో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. చదువు పూర్తయ్యాక.. 1947లో మహింద్రా గ్రూప్‌లో చేరారు. 15 ఏళ్ల అనంతరం.. అంటే.. 1963లో మహింద్రా గ్రూప్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టి 2012 వరకు కొనసాగారు.

కేశబ్ మహింద్రా హయాంలో మహింద్రా గ్రూపు కొత్త కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశించింది. ఏరోస్పేస్, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ వంటి బిజినెస్‌లలోకి అడుగుపెట్టింది. విల్లిస్ కార్పొరేషన్, మిత్సుబిషి, ఇంటర్నేషనల్ హార్వెస్టర్, యునైటెడ్ టెక్నాలజీస్, బ్రిటిష్ టెలికం వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయటంలో కూడా కేశబ్ మహింద్రా కీలకంగా వ్యవహరించారు. 2004-2012 మధ్య కాలంలో ప్రైమ్ మినిస్టర్స్ కౌన్సిల్ ఆన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో సభ్యుడిగా ఉన్నారు.

దీంతోపాటు వివిధ ప్రైవేట్ మరియు పబ్లిక్ సంస్థల్లో బోర్డ్ మెంబర్‌గా, కౌన్సిల్ సభ్యుడిగా సేవలందించారు. ఈ కంపెనీల లిస్టులో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, టాటా స్టీల్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, ఐఎఫ్‌సీ మరియు ఐసీఐసీఐ ఉన్నాయి. భారత పారిశ్రామిక రంగానికి చేసిన సేవలకు గాను కేశబ్ మహింద్రా 2005లో పద్మ భూషణ్ పురస్కారాన్ని పొందారు. 2007లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు, 2011లో బిజినెస్ ఇండియా లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు స్వీకరించారు.

11 ఏళ్ల కిందట.. కేశబ్ మహింద్రా.. మహింద్రా గ్రూప్ చైర్మన్ పదవిని తన మేనల్లుడు ఆనంద్ మహింద్రాకి అప్పగించారు. ప్రస్తుతం ఈ సంస్థ ఆనంద్ మహింద్రా సారథ్యంలోనే విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా.. ఫోర్బ్స్ సంస్థ లేటెస్టుగా రూపొందించిన ప్రపంచ కుబేరుల జాబితాలో కేశబ్ మహింద్రాకు సైతం చోటు లభించింది. మన దేశానికి సంబంధించి.. అత్యంత పెద్ద వయసులో ఈ లిస్టులో స్థానం పొందిన వ్యక్తిగా కేశబ్ మహింద్రా ఘనత వహించారు.

ఒకటీ పాయింట్ రెండు బిలియన్ డాలర్ల నికర సంపదతో ఇండియాస్ ఓల్డెస్ట్ బిలియనీర్‌గా ఖ్యాతిని సంపాదించుకున్న కేశబ్ మహింద్రా.. ఈ నెల 12వ తేదీన తుది శ్వాస విడిచారు. 99 ఏళ్ల పెద్ద వయసులో కన్నుమూసిన ఆయన.. మరో వందేళ్లపాటు స్ఫూర్తిదాతగా నిలుస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు. కష్టపడి పనిచేసే తత్వం, అంకితభావం, ముందుచూపుతో తనకంటూ ఒక గుర్తింపు దక్కించుకున్న కేశబ్ మహింద్రా.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు.. భావి తరాల బిజినెస్ లీడర్లకు ఆదర్శప్రాయుడిగా సజీవంగా ఉండిపోతారు.

Show comments