NTV Telugu Site icon

Special Story on India’s Natural Gas Needs: ఇండియాలో గ్యాస్‌ కొరత.. ఇప్పట్లో పరిష్కారమయ్యేనా?

India’s Natural Gas Needs

India’s Natural Gas Needs

Special Story on India’s Natural Gas Needs: రోజురోజుకీ పెరుగుతున్న సహజ వాయువు ధరలను మోయలేక యూరప్‌ దేశాల వెన్ను విరుగుతోంది. అలాగే.. ఈమధ్య కాలంలో రష్యా నుంచి దిగుమతులు తగ్గటంతో ఇండియా కూడా లిక్విఫైడ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ను అధిక రేట్లకు కొనాల్సి వచ్చింది. ఈ సమస్యకు మన దగ్గర రెండు పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఒకటి.. తక్కువ రేటుకి గ్యాస్‌ దొరికేలా చూసుకోవటం; రెండు.. దేశీయంగా ఉత్పత్తిని పెంచటం. కానీ.. ఈ రెండూ అనుకున్నంత ఈజీ కాదని చెప్పొచ్చు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన లోతైన చర్చే ఈ ప్రత్యేక కథనం..

లిక్విఫైడ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ని ఎక్కువగా ఎగుమతి చేసే దేశాల్లో ఖతార్‌ అగ్ర స్థానంలో ఉంది. దీంతో ఈ దేశం నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు క్షేత్రం నార్త్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్యాన్షన్‌ ప్రాజెక్టు వైపే ఇప్పుడు అందరూ దృష్టిసారించారు. ఈ క్షేత్రంలో ప్రస్తుతం ఏటా 77 మిలియన్‌ టన్నుల గ్యాస్‌ని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సామర్థ్యాన్ని 2027 నాటికి 126 మిలియన్‌ టన్నులకు పెంచాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. అంటే.. వచ్చే ఐదేళ్లలో ఇక్కడ ఏటా అదనంగా 49 మిలియన్‌ టన్నుల గ్యాస్‌ని ప్రొడ్యూస్‌ చేస్తారు. ఇది ఇప్పుడు ప్రపంచం మొత్తం వాడుతున్న లిక్విఫైడ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ మార్కెట్‌లో దాదాపు 40 శాతానికి సమానం.

అయితే.. ఈ ఫీల్డ్‌ కెపాసిటీ పెరగటానికి ఇంకా ఐదేళ్ల సమయం పడుతుంది. కానీ.. గ్యాస్‌ కోసం ప్రపంచ దేశాలు అప్పటివరకు ఆగే పరిస్థితి ప్రస్తుతానికైతే లేదు. ఫలితంగా సహజ వాయువు సంక్షోభం మరింత ముదిరే ప్రమాదముంది. అంతర్జాతీయంగా న్యాచురల్‌ గ్యాస్‌ కొరత తీవ్రంగా నెలకొనటంతో మన దేశానికి కూడా సరఫరా తగ్గిపోయింది. దీనివల్ల గడచిన రెండేళ్లలో సహజ వాయువు ధరలు అసహజంగా, అనూహ్యంగా 380 శాతం పెరిగాయి. ఈ ప్రభావం సామాన్యుల బడ్జెట్‌పై విపరీతంగా పడింది. నిత్యావసరాలు, రవాణా ఖర్చులు, విద్యుత్‌ బిల్లులు తడిసిమోపెడయ్యాయి.

ఈ ఇబ్బందుల నుంచి ప్రజలను బయటపడేయటానికి ప్రభుత్వం న్యాచురల్‌ గ్యాస్‌ ఉత్పత్తిని రెట్టింపు చేయాలని భావిస్తోంది. మన దేశంలోని మొత్తం ఇంధన మార్కెట్‌లో సహజ వాయువు వాటా ప్రస్తుతం 6 పాయింట్‌ 7 శాతం. ఈ షేర్‌ని 2030 నాటికి 15 శాతానికి పెంచాలని సర్కారు అనుకుంటోంది. కానీ.. ఇప్పటికే ఇండియాలో న్యాచురల్‌ గ్యాస్‌కి డిమాండ్‌ బాగా పెరిగింది. గత ఐదేళ్లలో ఏటా పైప్డ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ కనెక్షన్లు 21 శాతం, కంప్రెస్డ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ ఫ్యూయెల్‌ స్టేషన్ల సంఖ్య 29 శాతం పెరిగినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పేర్కొంది.

ఇదిలాఉండగా.. దేశీయంగా సహజ వాయువు ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోందని పెట్రోలియం అండ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ మినిస్టర్‌ హర్దీప్‌ సింగ్‌ పురి అంటున్నారు. అంతేకాదు. దేశంలో ఎక్కడా ఇంధన సరఫరా కొరత లేదని కూడా ఆయన తెలిపారు. ఈ మాటల సంగతి ఎలా ఉన్నప్పటికీ ఇండియాలో సహజ వాయువు ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు మాత్రం ఎక్కడా జరుగుతున్న దాఖలాల్లేవు. మన దేశంలో అతిపెద్ద చమురు, వాయు అన్వేషణ సంస్థ అయిన ఓఎన్‌జీసీ ప్రొడక్షన్‌ గ్రోత్‌ గత పదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉంది. క్రమంగా తగ్గుముఖం పడుతుండటమూ విచారించాల్సిన విషయమే.

గత దశాబ్ద కాలంగా ఓఎన్‌జీసీ క్రూడ్‌ ఉత్పత్తి దాదాపు 22 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకే పరిమితమవుతోంది. గ్యాస్‌ ఉత్పత్తిని సైతం సుమారు 22 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రైవేట్‌ సంస్థల ప్రమేయం పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఓఎన్‌జీసీని కోరుతోంది. కానీ.. ప్రొడక్షన్‌ విషయంలో ప్రైవేట్‌ సంస్థల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 2009లో తూర్పు తీర ప్రాంతమైన కేజీ బేసిన్‌లోని డీ6 క్షేత్రాల్లో రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ గ్యాస్‌ ప్రొడక్షన్‌ చేపట్టినప్పుడు పరిస్థితి ఆశాజనకంగానే ఉంది.

కానీ.. ఆ క్షేత్రాల్లో గ్యాస్‌ ఉత్పత్తి ఏడాది వ్యవధిలోనే పీక్‌ లెవల్‌కి చేరటంతో ఔట్‌పుట్‌ క్రమంగా తగ్గిపోయింది. 2010లో రోజుకి 60 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల సహజ వాయువు ఉత్పత్తి జరగ్గా ప్రస్తుతం 12 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల ఔట్‌పుట్‌ మాత్రమే నమోదవుతోంది. అయితే.. న్యాచురల్‌ గ్యాస్‌ ప్రొడక్షన్‌ని పెంచే విషయంలో మన ప్రభుత్వాల విధానాలు సరిగా లేవని, ప్రైవేట్‌ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగానే సహజ వాయువు ఉత్పత్తిని తక్కువకే పరిమితం చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా నెలకొన్నాయి.

2014లో ప్రభుత్వం గ్యాస్‌ కేటాయింపు విధానంలో మార్పులు తెచ్చింది. కంప్రెస్డ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ మరియు పైప్డ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ పంపిణీ సంస్థలకే ప్రాధాన్యత ఇచ్చింది. ఆ తర్వాత ఎరువుల పరిశ్రమకు కూడా పెద్ద పీట వేసింది. ఫలితంగా డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ రేటుకి గ్యాస్‌ను కొనాల్సి వచ్చింది. మరో వైపు.. దేశీయంగా గ్యాస్‌ ఉత్పత్తి పడిపోతుండటంతో స్థానికంగా పెరుగుతున్న గిరాకీని తట్టుకునేందుకు పంపిణీ సంస్థలు ఇప్పటికీ దిగుమతుల పైనే ఆధారపడుతున్నాయి. ఎక్కువ రేటు పెట్టి కొంటున్నాయి. దీంతో వాటి మార్జిన్లు పడిపోతున్నాయి.

సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్ల కష్టాలను, నష్టాలను అర్థంచేసుకున్న కేంద్ర ప్రభుత్వం వాళ్లకు ఊరట కలిగించేందుకు కొన్ని చర్యలు చేపడుతోంది. రీసెంట్‌గా ఏపీఎం గ్యాస్‌ కేటాయింపును 85 శాతం నుంచి 94 శాతానికి పెంచింది. ఇతర డీప్‌ వాటర్‌ ఫీల్డ్స్‌లోని సహజ వాయువు వనరులను అన్వేషించి, వెలికి తీయాలని, ఆ గ్యాస్‌ని ప్రీమియం ధరకు విక్రయించాలని GAIL (India) Limitedకి సూచించింది. మన దేశంలో గ్యాస్‌ పరిస్థితులు ఇలా ఉంటే గ్లోబల్‌ మార్కెట్‌ మరోలా ఉంది.

చలికాలం సమీపిస్తున్న నేపథ్యంలో యూరప్‌ దేశాలు న్యాచురల్‌ గ్యాస్‌ని రష్యా నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసేందుకు విఫలయత్నాలు చేస్తున్నాయి. దీంతో ఆసియా దేశాలకు అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్‌ లభించటం కష్టంగా మారుతోంది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో సమీకరణలన్నీ మారిపోయాయి. యూరప్‌ దేశాలు ఇంధన సంక్షోభంలో కూరుకున్నాయి. ఆ ప్రభావం చిన్నగా మన దేశంపైనా పడుతోంది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు రష్యా.. యూరప్‌ దేశాలకు కావాల్సిన గ్యాస్‌లో 40 శాతాన్ని సరఫరా చేసేది. అదిప్పుడు 9 శాతానికి పడిపోయింది.

గ్యాస్‌ సప్లైకి సంబంధించి జర్మనీకి వెన్నెముక లాంటి నార్డ్‌ స్ట్రీమ్‌ వన్‌ పైప్‌లైన్‌ని మెయింటనెన్స్‌ పేరుతో రష్యా క్లోజ్‌ చేయటంతో ఆ దేశం తల్లడిల్లిపోతోంది. ఈ నేపథ్యంలో యూరప్‌ దేశాలు గ్యాస్‌ కోసం ఇతర దేశాల వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరో వైపు.. ఇరాక్‌లోని చమురు బావుల నుంచి సమృద్ధిగానే ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. కానీ దాన్ని ప్రాసెస్‌ చేసేందుకు మౌలిక వసతులు లేకపోవటం అతిపెద్ద లోపం. దీంతో దాదాపు సగం చమురు వృధాగా మండిపోతుంటుంది.

2020వ సంవత్సరంలో ఇరాక్‌లో దాదాపు 18 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల సహజ వాయువు ఇలాగే వేస్ట్‌ అయిపోయింది. ఇది యూరప్‌ దేశాల వార్షిక వినియోగంలో ఐదు శాతంతో సమానం కావటం చెప్పుకోదగ్గ విషయం. ఉత్తర ఆఫ్రికాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రష్యా నుంచి యూరప్‌ దేశాలు దిగుమతి చేసుకునే చమురులో సుమారు 15 శాతానికి సమానమైన గ్యాస్‌ ఉత్తర ఆఫ్రికాలో ఇలా బూడిదలో పోసిన పన్నీరవుతోందని కొలంబియా యూనివర్సిటీ అంచనా వేసింది.

ఈ నేపథ్యంలో ఇంధన కొరతను ఎదుర్కొనేందుకు ఇండియా.. బొగ్గు పరిశ్రమలపై ఆధారపడుతోంది. కోల్‌ ప్లాంట్లను పూర్తి సామర్థ్యంతో నడపాలని కేంద్ర ప్రభుత్వం జూన్‌లో ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనికితోడు.. విద్యుదుత్పత్తి కోసం బొగ్గు వాడకాన్ని గతంలోనే నిలిపేసిన సంస్థలు ఇప్పుడు మళ్లీ అదే బాట పడుతున్నాయి. మరోవైపు.. లిక్విఫైడ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ దిగుమతుల కోసం ఇండియా.. ప్రత్నామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇరాక్‌, సౌదీ అరేబియా, యూఏఈ, అమెరికా వంటి దేశాల నుంచి సరసమైన ధరకు సమకూర్చుకోవటానికి ప్రయత్నిస్తోంది. కానీ.. ఈ కొరత ఎప్పటికి తీరేనో అర్థం కావట్లేదు.