NTV Telugu Site icon

Indian Companies Q3 Earnings: విశ్లేషకులు చెప్పినదానికన్నా మంచి ఫలితాలు

Indian companies Q3 earnings

Indian companies Q3 earnings

Indian companies Q3 earnings: ఇండియన్‌ కంపెనీలు డిసెంబర్‌ క్వార్టర్‌లో మంచి ఫలితాలు సాధించాయి. విశ్లేషకుల అంచనాలకు మించి లాభాలు ప్రకటించాయి. ద్రవ్యోల్బణం దిగిరావటం వల్ల రాబడులు పెరిగాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఇన్సూరెన్స్‌, ఆటోమొబైల్‌ రంగాలు ఈ ఆదాయ వృద్ధిలో ముందంజలో నిలిచాయి. అదే సమయంలో ఆయిల్‌, గ్యాస్‌, మెటల్‌ సెక్టార్లు వెనుకంజ వేశాయి. ఈ 3 నెలల్లో వస్తుసేవల వినియోగం తగ్గుముఖం పట్టింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవటంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి.

కార్పొరేట్‌ రంగంలోని సగానికి పైగా సంస్థల ఆదాయాలు అంచనాలకు తగ్గట్లుగా మరియు అంచనాలకు మించి ఉండటం గమనించాల్సిన విషయమని విశ్లేషకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. క్యూ3 ఫలితాల్లో మార్జిన్‌ రికవరీ.. హైలైట్‌గా మారింది. నిఫ్టీ ఆపరేటింగ్‌ మార్జిన్లు 230 బేసిస్‌ పాయింట్లు పెరిగి 17%కి చేరాయి. ప్రాథమికంగా ముడి సరుకుల రేట్లు తగ్గటం వల్ల సేవింగ్స్‌ పెరిగాయని ఐసీఐసీఐ డైరెక్ట్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. నిఫ్టీ ఆదాయం 15%గా నమోదవుతుందని, ఏడాదిలో 21 వేల 500 పాయింట్లకు చేరుతుందని అంచనా వేసింది.

read more: Not only Adani. But also Ambani: హిండెన్‌బర్గ్‌ వల్ల అదానీకి చివరికి మంచే జరగబోతోంది!. ఎలాగంటే..

సెన్సెక్స్‌ 71 వేల 600 పాయింట్లను చేరుకుంటుందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ ఆశాభావం వెలిబుచ్చింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను పెంచటం, ఎంఎస్‌ఎంఈల నుంచి క్రెడిట్‌కి డిమాండ్‌ పెరగటం, రిటైల్‌ సెగ్మెంట్లు రాణించటంతో బ్యాంకుల ప్రాఫిట్స్‌ పెరిగాయి. ఆస్తుల నాణ్యత మెరుగుపడటం వల్ల కూడా బ్యాంకులు మంచి పనితీరు కనబరిచాయి. మరీ ముఖ్యంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గత 67 ఏళ్లతో పోల్చితే 2022 డిసెంబర్‌ క్వార్టర్‌లో అత్యధిక త్రైమాసిక లాభాలను నమోదు చేయటం విశేషం.

మరో వైపు.. ఇండియన్‌ ఆటోమొబైల్‌ రంగం డిసెంబర్‌ త్రైమాసికంలో పుంజుకుంది. ఇన్‌పుట్‌ ఖర్చులు, సరఫరా వ్యవస్థలో ఆటంకాలు తగ్గటం కలిసొచ్చింది. మారుతీ సుజుకీ.. నికర లాభంలో ఏకంగా 133 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయటం చెప్పుకోదగ్గ విషయం. టాటా మోటార్స్‌.. 7 త్రైమాసికాల తర్వాత తొలిసారిగా లాభాల బాట పట్టడం కూడా గమనించాల్సిన అంశమే. అయితే.. టూవీలర్‌ సెగ్మెంట్‌లో.. అది కూడా ఎంట్రీ లెవల్‌ కేటగిరీలో డిమాండ్ పెరగకపోవటం ఆందోళన కలిగించింది.

ఇదిలాఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని చివరి త్రైమాసికంలో వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని, తద్వారా కంపెనీల లాభాలు పెరుగుతాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ అనలిస్టులు అభిప్రాయపడ్డారు. 2023లో ఐటీ సెక్టార్‌ రాణిస్తుందని అంటున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఐటీ అనుబంధ సేవలపై సంస్థలు ఖర్చు పెంచనున్నాయని చెబుతున్నారు. అందువల్ల టెక్నాలజీ సర్వీసెస్‌ సెక్టార్‌ పనితీరు సానుకూలంగా కొనసాగుతుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ తన నివేదికలో వివరించింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ గతేడాది 26% దిద్దుబాటు కావటం, నిఫ్టీ50 ఇండెక్స్‌ 4.3% లాభపడటాన్ని ప్రస్తావించింది.

ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ సెగ్మెంట్‌లో అగ్రగామిగా ఉన్న హిందుస్థాన్‌ యూనిలీవర్‌ సంస్థ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాలెక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. ద్రవ్యోల్బణం తగ్గటం, శీతా కాలంలో పంటల సాగు పెరగటం, వ్యవసాయ ఆదాయం వృద్ధి చెందే సూచనలు కనిపిస్తుండటం గ్రామీణ ఆర్థిక మందగమనం తగ్గుముఖం పడుతోందనటానికి సంకేతాలని హిందుస్థాన్‌ యూనిలీవర్‌ సీఈఓ అండ్‌ ఎండీ సంజీవ్‌ మెహతా పేర్కొన్నారు.