India Shining: భారత్ వెలిగిపోతోంది.. ఇండియా షైనింగ్.. ఇది 20 ఏళ్ల కిందటి ఎన్నికల స్లోగన్. అప్పుడు వర్కౌట్ కాలేదు గానీ ఇప్పుడు మన దేశం నిజంగానే వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశంలో వెలిగిపోయింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ విశిష్టతను ప్రపంచ దేశాలు గుర్తించి ప్రశంసించాయి. ఇండియాలో భారీఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద సంస్థలు ముందుకొచ్చాయి.
అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్న నేపథ్యంలో కూడా ఇండియా పట్ల ఇంతటి స్థాయిలో ప్రగాఢ విశ్వాసం వ్యక్తం కావటం విశేషం. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో.. భారతదేశ బలమైన స్థూల ఆర్థిక పునాదులు మరియు పెట్టుబడి అనుకూల విధానాల పైన ప్రముఖంగా చర్చ జరగటం చెప్పుకోదగ్గ అంశం.
T+1 Settlement Cycle: ఒక్క రోజులోనే మన ఖాతాలోకి డబ్బులు లేదా సెక్యూరిటీలు
ఒకవైపు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన చైనా ఎకానమీ ప్రస్తుతం జీరో కొవిడ్ విధానాల వల్ల 50 ఏళ్లు వెనక్కి వెళ్లటం, మరోవైపు ఇండియా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో హైలైట్‌గా నిలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలో ఆటంకాలు ఏర్పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఇండియా.. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహక పథకం వంటి ప్రత్యేక కార్యక్రమాలతో ఇంటర్నేషనల్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఆకర్షించడాన్ని గ్లోబల్ లీడర్లు, ఫేమస్ ఎకనమిస్టులు మెచ్చుకున్నారు.
వర్థమాన ఆర్థిక వ్యవస్థల కన్నా భారతదేశం ఉత్తమ పనితీరు కనబరచనుందని.. దీంతో.. వరల్డ్ గ్రోత్ ఇంజన్‌గా చైనా మరిన్నాళ్లు కొనసాగే అవకాశాలు లేవని ప్రముఖ ఆర్థికవేత్త కెన్నెత్ రోగోఫ్ అన్నారు. ఇక.. పెట్టుబడుల విషయానికొస్తే.. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పలువురు ఇన్వెస్టర్లు మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెద్దఎత్తున ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
మహారాష్ట్రలో 1.37 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒక అవగాహన ఒప్పందం కుదిరినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే చెప్పారని పీటీఐ పేర్కొంది. విద్యుత్ వాహనాలు, స్టీల్, మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ రానున్నాయని, తద్వారా భారీగా ఉపాధి కల్పన జరగనుందని తెలిపింది. మహారాష్ట్ర వ్యాప్తంగా బ్యాటరీ స్వాపింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం గొగొరో అండ్ బెల్‌రైజ్ అనే సంస్థలతో అగ్రిమెంట్లు చేసుకుంది.
అలోక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ తెలంగాణలో 210 కోట్ల రూపాయల ప్రాథమిక పెట్టుబడితో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ యాక్టివ్ బ్యాటరీ మెటీరియల్ ప్రొడక్షన్ యూనిట్‌ను ఏర్పాటుచేయనుంది. న్యూ ఏజ్ ఎనర్జీ లీడర్‌గా ఎదిగేందుకు, క్లీన్ ఎనర్జీకి మేజర్ హబ్‌గా నిలిచేందుకు కావాల్సిన కెపాసిటీ ఇండియాకి ఉందని చెప్పటానికి ఈ ఒప్పందాలు చాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మన దేశం పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను గడువు కన్నా తొమ్మిదేళ్లు ముందుగానే సాధించిందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలు ఇప్పటికే కలిగి ఉన్న దేశాల్లో ఇండియా కూడా ఒకటని ఆయన గుర్తు చేశారు. భారతదేశంలోని డిజిటల్ మరియు భౌతిక మౌలిక సదుపాయాల నైపుణ్యాలను IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ ప్రశంసించారు.
ల్యాండ్ మరియు లేబర్ మార్కెట్లకు సంబంధించి సంస్కరణలు అమలు చేయాలని పిలుపునిచ్చారు. మన దేశం మరింత ఆర్థిక వృద్ధి సాధించాలంటే సేవల రంగం ఎగుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ సూచించారు. ఇప్పుడు జీ20 అధ్యక్ష పదవి ఇండియాని వరించింది కాబట్టి దీంతో ఇక ప్రపంచ సేవల వాణిజ్యంలో భారత్ శరవేగంగా దూసుకుపోవాలని ఆకాంక్షించారు.
ఇదిలా ఉండగా.. ఇండియాలోని పెద్ద పెద్ద కంపెనీలు కూడా స్వదేశంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా సమ్మతం తెలిపాయి. రానున్న ఐదేళ్లలో ఇండియాలో 90 బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రకటించారు. సీమెన్స్ సంస్థ కూడా భారత్‌లో పెట్టుబడులు పెట్టడంపై ఆశాభావం వెలిబుచ్చింది.
ఇండియా వెలుపల వ్యాపారం చేయడానికి కూడా ఇండియా ఒక బేస్‌మెంట్‌గా ఎదుగుతోందని హిటాచి ఇండియా ఎండీ భరత్ కౌషల్ కితాబిచ్చారు. క్యాపిటల్ గూడ్స్ రంగంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తోందని, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌ను పరిరక్షిస్తూనే టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌కి సహకరిస్తోందని చెప్పారు. ఫండింగ్ వంటి వాటిని కూడా ఎంకరేజ్ చేస్తోందని తెలిపారు. మొత్తమ్మీద చూస్తే ఈ సంవత్సరం వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశాలు ఇండియాకి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయని చెప్పొచ్చు.