Site icon NTV Telugu

Plane Crashes: విమాన ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడిన నాయకులు వీరే!

Plane Crashes

Plane Crashes

Plane Crashes: విమాన ప్రయాణం అనేది రాజకీయ నాయకులకు సౌలభ్యాన్ని, సమయాన్ని ఆదా చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా తీస్తుందని ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపించింది. ఇప్పటి వరకు ఈ విమాన ప్రమాదాలలో చనిపోయిన చాలా మంది ప్రముఖులు గురించి మనకు తెలుసు. కానీ కొంత మంది ప్రముఖ నాయకులు ఈ ఘోర విమాన ప్రమాదం నుంచి బయటపడినట్లు చరిత్ర చెబుతుంది. నిజానికి విమాన ప్రమాదాల నుంచి బయటపడిన ఆ నాయకుల ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Ajit Pawar : అజిత్ పవార్ విమానాన్ని నడిపిన పైలట్లు వీరే.. కెప్టెన్ సుమిత్ , శాంభవి పాఠక్..!

తృటిలో తప్పించుకున్న మాజీ ప్రధాని ..
ఈ సంఘటన 1977లో మాజీ ప్రధానమంత్రి పర్యటనలో వెలుగు చూసింది. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రయాణిస్తున్న విమానం అస్సాంలో కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. కానీ అప్పటి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పి.కె. తుంగోన్ ఈ ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ఎడమ కాలుకు ఫ్రాక్చర్, ఇతర గాయాలయ్యాయి.

* 2001లో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా, చురు జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు.

* 2004లో గుజరాత్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్, కేంద్ర మాజీ మంత్రులు పృథ్వీరాజ్ చవాన్, కుమారి సెల్జా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు.

* 2007లో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆయన మంత్రివర్గ సహచరుడు పి.ఎస్.బజ్వా ప్రయాణిస్తున్న ఒక హెలికాప్టర్ గురుదాస్‌పూర్‌లో విద్యుత్ తీగలలో చిక్కుకుంది. ఈ ప్రమాదం నుంచి వారు తృటిలో తప్పించుకున్నారు.

* 2009 ఆగస్టు 30న పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ హెలికాప్టర్.. ఫిరోజ్‌పూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు.

* 2010లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, ఉపాధ్యక్షుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాంపూర్ (ఉత్తరప్రదేశ్) కు వెళ్తుండగా, వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎండిన గడ్డి కుప్ప దగ్గర దిగడంతో మంటలు చెలరేగాయి. కానీ వెంటనే పైలట్ టేకాఫ్ చేసి మరొక చోట సురక్షితంగా ల్యాండ్ చేశారు.

* మే 9, 2012న జార్ఖండ్ ముఖ్యమంత్రి అర్జున్ ముండా హెలికాప్టర్‌ రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో కూలిపోయినప్పుడు ఆయన ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన భార్య మీరా ముండాతో సహా మరో ఐదుగురు ఈ ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.

* మే 25, 2017న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హెలికాప్టర్ ప్రమాదం నుంచి అద్భుతంగా బయటపడ్డారు. ఆ టైంలో ఆయన ప్రయాణిస్తున్న సికోర్స్కీ హెలికాప్టర్ లాతూర్ జిల్లాలోని నీలాంగా హెలిప్యాడ్ వద్ద దాదాపు 80 అడుగుల ఎత్తు నుంచి కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఆయన, ముగ్గురు అధికారులు, పైలట్, కో-పైలట్ ఎటువంటి తీవ్రమైన గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.

READ ALSO: Ajit Pawar: అజిత్ తర్వాత ‘పవర్’ ఎవరికి? పార్టీ పగ్గాల కోసం తెర వెనుక పావులు

Exit mobile version