NTV Telugu Site icon

Global Economy’s Ray of Hope: అన్ని దేశాల ఆశాకిరణం చైనా.. గ్లోబల్‌ ఎకానమీని గట్టెక్కించేనా?

Global Economy's Ray of Hope

Global Economy's Ray of Hope

Global Economy’s Ray of Hope: చైనా.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఆ దేశం ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం నుంచి కోలుకుంటోంది. కొవిడ్‌ జీరో పాలసీకి డిసెంబర్‌లో స్వస్తి చెప్పింది. రెండు నెలల కిందట తీసుకున్న ఈ నిర్ణయం చైనాను ఆర్థికపరంగా పూర్తి స్థాయిలో కుదుటపర్చలేదు. రియల్‌ ఎస్టేట్‌, తయారీ, ఎగుమతులు, కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ గూడ్స్‌ వంటి రంగాలు ఇంకా బలహీనంగానే కనిపిస్తున్నాయి. ఈ సెక్టార్లు మరింత కాలం ఇలాగే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.

చైనాలో గతేడాది వివిధ వస్తూత్పత్తులకు గిరాకీ లేకపోవటంతో ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థల్లో పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది. యూరప్‌ మరియు అమెరికాల్లో కూడా డిమాండ్‌ మందగించటంతో ఎగుమతులు నేలచూపులు చూశాయి. కొవిడ్ ఎఫెక్ట్‌ నుంచి చైనా ఎకానమీ క్రమంగా పుంజుకుంటోందని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఆసియా దేశాల్లో మాత్రం ఇంకా అలాంటి ఆశావహ దృక్పథం కనిపించట్లేదని నిపుణులు పేర్కొంటున్నారు.

Tech Layoffs to Continue: మరికొన్నాళ్లపాటు కొనసాగనున్న టెక్‌ లేఆఫ్‌లు

చైనా ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పునఃప్రారంభమైనా.. రాబోయే నెలల్లో ఆసియాలో వృద్ధి మందగించే అవకాశమే ఉందని నొమురా సంస్థ తన నివేదికలో వెల్లడించింది. చైనాలో ఆర్థిక వృద్ధి ముందుగా సేవల రంగంలో నెలకొంటుందని, ఇందులోనూ కొన్ని పరిమితులు ఉన్నాయని వివరించింది. అయితే.. ఆసియాలో ఎగుమతులు లేదా పారిశ్రామిక రంగ పురోగతి ఈ సంవత్సరంలోని రెండో అర్ధ భాగంలో పూర్తి స్థాయిలో పట్టాలెక్కుతుందని నోమురా పేర్కొంది.

ఇండియా, చైనా వాణిజ్యం 2022లో ఆల్‌టైమ్‌ హైలెవల్లో.. అంటే.. దాదాపు 134 బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు చైనా కస్టమ్స్‌ విభాగం ఇటీవల విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. కానీ.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ ఆ దేశంతో ఇండియా వాణిజ్య లోటు తొలిసారిగా 100 బిలియన్‌ డాలర్లను దాటడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

భారతదేశానికి చైనా ఎగుమతులు 118 బిలియన్‌ డాలర్లకు పైగా జరగ్గా ఇండియా నుంచి చైనాకు జరిగిన ఎగుమతులు కేవలం 17 బిలియన్‌ డాలర్లే కావటం వల్ల వాణిజ్య లోటు ఈ స్థాయికి పెరిగిపోయింది. చైనా.. జీరో కొవిడ్‌ పాలసీని సడలించటం వల్ల అభివృద్ది చెందుతున్న మార్కెట్లకు మంచి జరుగుతుందని గ్లోబల్‌ రేటింగ్స్‌ సంస్థ ‘‘ఎస్‌ అండ్‌ పీ’’ అంచనా వేసింది.

చైనాలో రాకపోకలు పెరగటం వల్ల తయారీ రంగంలో ఆటంకాలు ఏర్పడే ప్రమాదం లేదని, ఈ పరిణామం.. ఆ దేశంతో అనుసంధానం కలిగిన ఎమర్జింగ్‌ మార్కెట్లకు అనుకూలంగా మారుతుందని అభిప్రాయపడింది. అడ్వాన్స్‌డ్‌ ఎకానమీల్లో డిమాండ్‌ తగ్గితే చైనాకు ఇలాంటి ప్రయోజనాలు దూరమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొంటుందనే ఆందోళనల నేపథ్యంలో మన దేశ వాణిజ్య వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఊగిసలాటకు గురవుతుందని నిపుణులు తెలిపారు.

గ్లోబల్‌ ఎకానమీలో పరిస్థితులు గనక మెరుగుపడకపోతే ఇండియా వాణిజ్య రంగంలో ఉత్సాహం కొరవడుతుందని ఇటీవల విడుదలైన ఆర్థిక సర్వే సైతం అభిప్రాయపడింది. గతేడాది భారతదేశ ఎగుమతులు ఆల్‌టైమ్‌ హైలెవల్లో నమోదైనా ప్రస్తుతం అలాంటి సానుకూల వాతావరణం లేదని, ప్రపంచ వాణిజ్య రంగంలో ఎదురు గాలులు వీస్తున్నాయని ఎకనమిక్‌ సర్వే తేల్చిచెప్పింది. డిసెంబర్‌లో ఇండియా ఎగుమతులు 12 శాతానికి పైగా పడిపోయాయని సెంట్రల్‌ గవర్నమెంట్‌ డేటా చెబుతోంది.

దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా వస్తూత్పత్తులకు డిమాండ్‌ పడిపోవటమేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎగుమతుల విలువ 34 బిలియన్‌ డాలర్లకు పైగా పతనమైందని, ఫలితంగా ఆ ఒక్క నెలలోనే వాణిజ్య లోటు సుమారు 24 బిలియన్‌ డాలర్లకు చేరిందని తెలిపింది. ఇదిలాఉండగా.. ఈ ఏడాది అంతర్జాతీయ వాణిజ్య వృద్ధి తక్కువలో తక్కువగా ఒక శాతం నమోదవుతుందని వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌.. WTO.. అంచనా వేసింది.