NTV Telugu Site icon

DHFL Loan Fraud Case: హెలీకాప్టర్‌ చెప్పిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దా‘రుణ’ మోసం కథ!

Dhfl Loan Fraud Case

Dhfl Loan Fraud Case

DHFL Loan Fraud Case: అప్పు చేసి పప్పు కూడు అనే మాట మనం విని ఉంటాం. కానీ.. కొంత మంది ఆ తప్పు కూడు తిని ఉన్నారు. DHFL లోన్‌ ఫ్రాడ్‌ కేసును దీనికి లేటెస్టు ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. DHFL.. అంటే.. దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ సంస్థ యజమానులు లోన్‌ ఫ్రాడ్‌ కేసులో ఇరుక్కున్నారు. మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని 17 బ్యాంకులతో కూడిన కన్సార్షియం నుంచి 42 వేల 871 కోట్ల రూపాయలు తీసుకొని ఇష్టం వచ్చినట్లు దారి మళ్లించారని కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐ.. తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.

మనీ లాండరింగ్‌ కోసం నిందితులు ఏకంగా 87 షెల్‌ కంపెనీలను మరియు రెండున్నర లక్షల మందికి పైగా నకిలీ రుణగ్రహీతలను సృష్టించినట్లు సీబీఐ వెలుగులోకి తెచ్చింది. ఈ మోసంలో ప్రమేయం ఉన్న ప్రైవేట్‌ కంపెనీలు సహా 75 మందిపై రూపొందించిన అభియోగపత్రాన్ని అక్టోబర్‌ 15వ తేదీన ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో దాఖలు చేసింది. ఛార్జ్‌షీట్‌ ప్రకారం.. DHFL పెద్దలిద్దరు.. కపిల్‌ వాద్వాన్‌ మరియు ధీరజ్‌ వాద్వాన్‌.. దారి మళ్లించిన డబ్బులతో విలాసాలకు అలవాటు పడ్డారు. విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు.

read more: IT Stocks Fallen: 2008 ఆర్థిక మాంద్యం తర్వాత ఈ రేంజ్‌లో పడిపోవటం ఇదే తొలిసారి

63 కోట్ల రూపాయలతో 24 పెయింటింగ్‌లను కొనుగోలు చేశారు. అంతేకాదు.. క్రెడిట్‌ కార్డులకు బిల్లులు కట్టడానికి, ఫారన్‌ ట్రిప్పులకి, చార్టర్డ్ విమానాలను అద్దెకు తీసుకొని జల్సాగా తిరగటానికి ఈ మనీ వాడుకున్నారు. ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. ప్రధాన నిందితులైన వాద్వాన్‌లు DHFLకి సంబంధించిన డమ్మీ డేటాను జనరేట్‌ చేయటానికి ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను డిజైన్‌ చేయించారంటేనే వాళ్లు ఎంత పక్కాగా స్కెచ్‌ వేశారో అర్థంచేసుకోవచ్చు. ఈ స్పెషల్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో హోమ్‌ లోన్‌ టేకర్స్‌ పేరుతో పెద్ద సంఖ్యలో ఫేక్‌ ఎంట్రీలు చేశారు.

బాంద్రా పేరుతో వర్చువల్‌ బ్రాంచ్‌ను క్రియేట్‌ చేశారు. దానికి కోడ్‌ నంబర్‌ 001 అని కూడా పెట్టారు. ఈ శాఖ ద్వారా షెల్‌ కంపెనీలకు లోన్లు ఇచ్చారు. ముంబైలోని నారిమన్‌ పాయింట్‌ ప్రాంతంలో ఉన్న యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌ హెడ్‌ విపిన్‌ కుమార్‌ షుక్లా ఇచ్చిన ఫిర్యాదుతో ఈ భారీ మోసంపై జూన్‌ 20న కేసు బుక్‌ అయింది. రెండు రోజుల వ్యవధిలోనే ఈ లోన్‌ ఫ్రాడ్‌ కేసును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌.. సీబీఐ.. టేకప్‌ చేసి ముంబైలోని 12 ప్రాంతాల్లో దర్యాప్తు చేపట్టగా కళ్లు చెదిరే వాస్తవాలు బయటపడ్డాయి.

వాద్వాన్‌లతోపాటు మరికొందరు.. బ్యాంకుల కన్సార్షియాన్ని ప్రభావితం చేసి 42 వేల 871 కోట్ల రూపాయల లోన్‌ తీసుకున్నారు. తప్పుడు వివరాలు సమర్పించి పొందిన ఈ డబ్బును తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశారు. తద్వారా బ్యాంకులకు 34 వేల 615 కోట్ల రూపాయల నష్టం చేకూర్చారని సీబీఐ గుర్తించింది. DHFL డైరెక్టర్లు కపిల్‌ వాద్వాన్‌ మరియు ధీరజ్‌ వాద్వాన్‌లను అరెస్ట్‌ చేసి లక్నో నుంచి ఢిల్లీకి తరలించారు. 40 కోట్ల రూపాయల విలువ చేసే పెయింటింగ్‌లను మరియు శిల్పాలను జులై 8వ తేదీన సీబీఐ స్వాధీనం చేసుకుంది.

అంతకుముందు.. 5 కోట్ల రూపాయల విలువ చేసే రెండు వాచీలను మరియు 2 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను కూడా సీబీఐ సీజ్‌ చేసింది. దీంతోపాటు.. పుణేలోని అవినాష్‌ భోసాలే అనే నిందితుడి ఇంటి ఆవరణలో పార్కింగ్‌ చేసి ఉన్న హెలీకాప్టర్‌ను సైతం స్వాధీనం చేసుకోవటంతో కేసు మూలాలన్నీ వెల్లడయ్యాయి. వాద్వాన్‌ ఫ్యామిలీకి ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఒక కంపెనీ ఉంది. దానికి వార్వా ఏవియేషన్‌ అనే సంస్థలో వాటాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ వార్వాన్‌ ఏవియేషన్‌ను.. ‘‘యాన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పర్సన్స్‌’’గా కూడా పేర్కొంటారు. ఈ కంపెనీ.. అగస్టావెస్ట్‌ల్యాండ్‌ సంస్థ నుంచి 2011లో కొనుగోలు చేసిందే ఆ హెలికాప్టర్‌. వాద్వాన్‌ల ఫ్యామిలీ కంపెనీ ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 2017లో వార్వాన్‌ ఏవియేషన్‌లో చేరింది. ఆ సమయంలో హెలికాప్టర్‌ కొనుగోలు మరియు మెయింటనెన్స్‌ ఖర్చులను చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీబీఐకి హెలికాప్టర్‌ దొరికిన ఇంటి యజమాని అవినాష్‌ భోసాలేకి ఏబీఐఎల్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ పేరుతో ఒక సంస్థ ఉంది.

ఈ కంపెనీకి కూడా హెలికాప్టర్‌లో వాటా ఉన్నట్లు సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. ఈ షేర్‌ కొనుగోలు నిమిత్తం వార్వా ఏవియేషన్‌కు చెల్లించిన డబ్బు DHFL డైరెక్టర్లు బ్యాంకుల్లో తీసుకున్న లోన్‌ అమౌంట్‌ నుంచే వచ్చినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ గుర్తించింది. అందుకే హెలికాప్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అభియోగపత్రంలో వివరించింది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది. రానున్న రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఇంకెన్ని నిజాలు నిగ్గు తేలుతాయో చూడాలి.