NTV Telugu Site icon

ORR Accidents: సెలబ్రిటీలకు కలసిరాని ఓఆర్ఆర్.. రవితేజ తమ్ముడు మొదలు లాస్య నందిత దాకా !

Celelb Kids Died

Celelb Kids Died

Celebrities Road Accidents at ORR Became Hot Topic: దేశంలో వరుస ప్రమాదాలు కారణంగా రోడ్డు నెత్తురోడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట రహదారులపై ఎందరో ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులు కావడం జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ ఓఆర్ఆర్ విషయానికి వస్తే ప్రభుత్వ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గడం లేదు. అతి వేగంతో కూడిన డ్రైవింగ్‌, నిద్రమత్తు, నిర్లక్ష్యం వల్ల ఎన్నో బతుకులు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ మధ్య ప్రమాదాలకు సంబంధించిన వార్త లేకుండా పత్రికలు లేవంటే అతిశయోక్తి లేదు. ప్రతిరోజు ఏదో ఒక చోట ప్రమాదాలు జరిగి ప్రాణాలను కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. అజాగ్రత్తతో వాహనాలు నడపడం, మద్యంమత్తులో వాహనాలు నడపడం, అతివేగం వలన శీతా కాలంలో ఏర్పడే మంచువలన రహదారులు సరిగ్గా కనబడక పోవడం,తెల్లవారుజామున నిద్రమత్తులో వాహనాలు నడపడం, అనుకోకుండా ఏదైనా అకస్మాత్తుగా వాహనాలకు అడ్డు రావడం, రోడ్డు భద్రతకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం, అనుకోకుండా వాహనంలో ఏవైనా సమస్యలు ఏర్పడటం, రహదారులు సక్రమంగా ఉండకపోవడం లాంటి కారణాల వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద ఎంతో మంది ప్రముఖులు, ప్రముఖుల పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. వారిపై ఒక లుక్ వేద్దాం.

కోమటిరెడ్డికి విషాదం మిగిల్చిన కొడుకు
మెదక్ జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరు ఓఆర్ఆర్ వద్ద డిసెంబర్ 19, 2011 జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మరణించారు. ప్రతీక్ రెడ్డితో పాటు సుచిత్ రెడ్డి, చంద్రారెడ్డి అనే యువకులు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. వేగంగా వెళ్తున్న ప్రతీక్ రెడ్డి కారు డివైడర్‌కు ఢీకొట్టి నుజ్జు నుజ్జుయింది. హైదరాబాద్ నుంచి పటాన్‌చెరులోని ఓ మిత్రుడి ఇంటికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

అజారుద్దీన్ ఇంట విషాదం
ఔటర్ రింగ్ రోడ్డుపై బైక్ రేసింగ్‌ల్లో పాల్గొన్న భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కొడుకు మొహమ్మద్ అయాజుద్దీన్(19) మృతి చెందాడు. బైక్‌పై నుంచి పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అయాజుద్దీన్ సెప్టెంబర్ 17, 2011న మృతి చెందాడు. దీంతో అజారుద్దీన్ కుటుంబంలో తీరని శోకం మిగిలింది.

కోట శ్రీనివాసరావు ఇంట విషాదం
జూన్ 20, 2010న జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు వెంకటసాయి ప్రసాద్‌(39) మృతి చెందారు. కోట వెంకట సాయిప్రసాద్‌ తన స్పోర్ట్స్‌ బైక్ ‌పై ఓఆర్ఆర్ నుంచి శంషాబాద్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఓ వేడుకలో పాల్గొనేందుకు ఫిలింనగర్‌ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్‌ హోటల్ ‌కు బయల్దేరి ప్రసాద్‌ తన 1000 సీసీ స్పోర్ట్స్‌ బైకు(ఏపీ0938 డీఎక్స్‌-8474)పై ఒంటరిగా వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అకాడమీ (అప్పా) దాటిన తరువాత దర్గా మలుపు వద్ద ఓ డీసీఎం(ఏపీ29టీఏ-4656) రింగ్ రోడ్డు పైకి దూసుకొచ్చిన క్రమంలో బైక్ ‌పై వేగంగా వెళుతున్న ప్రసాద్‌ డీసీఎంను గమనించి హఠాత్తుగా బ్రేక్‌ వేశారు. దీంతో బైక్‌ రోడ్డును రాసుకుంటూ వెళ్లి డీసీఎం వ్యానును ఢీకొట్టింది. ప్రసాద్‌ ఎగిరి ఇరవై అడుగుల దూరంలో పడగా తలకు తీవ్ర గాయాలై మరణించారు.

రవితేజ సోదరుడు భరత్ రాజు
సినీ రవితేజ సోదరుడు, నటుడు భూపతిరాజు భరత్ రాజు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ కన్నుమూశారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఆగిఉన్న లారీని భరత్ ప్రయాణిస్తున్న స్కోడా కారు వెనుక నుంచి ఢీ కొట్టగా ఈ ప్రమాదంలో భరత్ ముఖం గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమైంది, ఆయన రవితేజ సోదరుడని గుర్తించలేకపోయారు. కారు నంబర్ ఆధారంగా భరత్‌ను గుర్తించారు.

లాస్య నందిత మరణం
ఈరోజ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్‌చెరు సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ఓఆర్‌ఆర్‌ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. వాహనం అదుపుతప్పి రోడ్డు మార్జిన్ గడ్డర్లను బలంగా ఢీకొట్టింది. అతివేగం, నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పటాన్‌చెరు సమీపంలోని సుల్తాన్‌పూర్‌ సమీపంలో ఎక్స్‌ఎల్‌6 రోడ్డు రెయిలింగ్‌ను ఢీకొంది. మేడ్చల్ బయలుదేరే ప్రదేశం సుల్తాన్‌పూర్ ORR ఎగ్జిట్ కు సమీపంలో ఉన్న ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటన జరిగిన సమయంలో ఆ రోడ్డుపై వెళ్తున్న వారు పోలీసులకు సమాచారం అందించారు.