Bathukamma: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సందడి నిన్న మిన్నంటేలా మొదలైంది. ఆడబిడ్డలు ఆనందోత్సాహాలతో ఆటపాటలతో పూల పండగ చేసుకుంటున్నారు. సాయంత్రం అవుతోందంటే చాలు చక్కగా ముస్తాబై వాడవాడలా వీధివీధినా కోలాటాలతో కోలాహలంగా వేడుకను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి ముదుసలి వరకు అందరూ ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పొద్దస్తమానం ఇంటికే పరిమితం కాకుండా అప్పుడప్పుడూ అలా బయటికి వచ్చి ఇరుగుపొరుగువారితో ముచ్చట్లు పెడుతుంటారు.
కానీ.. సిటీల్లో చాలా మంది గృహిణులు ఎంటర్టెయిన్‌మెంట్ కోసం టీవీలకు, సెల్‌ఫోన్లకే పరిమితమవుతారు. నలుగుర్ని కలవటానికి అవకాశం తక్కువ. అలాంటి లోటును ఈ ఈవెంట్ ముచ్చటగా తీరుస్తోంది. ఒకరకంగా వాళ్లకు లాంగ్ టైం హోం క్వారంటైన్ నుంచి రోజుకి కనీసం రెండు మూడు గంటలైనా రిలీఫ్ కల్పిస్తోంది. హోల్ అండ్ సోల్‌గా ఈ ఫెస్టివల్‌ని లేడీస్ ఓన్ చేసుకుంటున్నారు. దీనికి తగ్గట్లే తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా మహిళలను ఆర్థికంగా, అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోంది. బతుకమ్మ పేరిట బహుమతి రూపంలో చీరలను పంపిణీ చేస్తోంది. సంబరాల నిర్వహణకు డబ్బులు సైతం ఇస్తోంది.
read also: Tiumala Brahmotsavam Live: తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణకు ఈ పండుగ పెద్ద బ్రాండ్ ఇమేజ్‌లాగా డెవలప్ అయింది. గ్రామ స్థాయి నుంచి గ్లోబల్ లెవల్‌కి ఎదిగింది. ప్రపంచంలోనే ఎత్తైన భవనం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా అనే సంగతి తెలిసిందే. గతేడాది దానిపైన సైతం బతుకమ్మ వీడియో ప్రజెంటేషన్ జరగటం విశేషం. ఈ ప్రదర్శన నిర్వహించిన స్క్రీన్ కూడా వరల్డ్‌లోనే అతి పెద్దదవటం మరో ముఖ్య విషయం. ఈ స్పెషల్ షోను దేశవిదేశాలకు చెందిన లక్షల మంది వీక్షించటం ముందుగా తెలంగాణకు, తద్వారా ఇండియాకు గర్వకారణం అనటంలో ఎలాంటి సందేహం లేదు.
అందుకే కవి మిట్టపల్లి సురేందర్ బతుకమ్మ గీతానికి ‘తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి.. లోకమంతా తిరిగేవటే..’ అంటూ వినసొంపుగా, విశిష్టంగా అక్షరబద్ధం చేశారు. ఆయనొక్కరే కాదు. పలువురు కవులు, కళాకారులు, గాయకులు బతుకమ్మ సందర్భంగా స్పెషల్ సాంగ్స్ రూపొందించి విడుదల చేస్తున్నారు. వాటికి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయంటే శ్రోతలు, ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆదరిస్తున్నారో అర్థంచేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి సంవత్సరం బతుకమ్మకు సంబంధించిన కొత్త సాహిత్యం అందుబాటులోకి వస్తోంది. ఈ ఉత్సవాలకు అన్ని రకాల మీడియా అద్భుతంగా కవరేజీ ఇస్తోంది.
గణేష్ నవరాత్రోత్సవాల తర్వాత ఇన్ని రోజులపాటు ఇంత భారీఎత్తున జరిగే సెలబ్రేషన్స్‌లో బతుకమ్మ తప్ప మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఒక వైపు దుర్గామాతకు, మరో వైపు బతుకమ్మకు ఆడపడుచులు ఏక కాలంలో భక్తిశ్రద్ధలతో పూజలు జరుపుకుంటున్నారు. తీరొక్క పువ్వును సేకరించి, అందంగా అలంకరించి, అందరూ ఒక చోటకి చేర్చి, ప్రేమతో కొలిచి, బతుకమ్మను సామూహికంగా, సంతోషంగా తీసుకెళ్లి జలాశయంలో సాగనంపి వస్తున్నారు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే అన్నట్లు బతుకమ్మ దగ్గర కూడా అందరూ సమానమే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
కులాలకు, ఆర్థిక స్తోమతలకు అతీతంగా మహిళలంతా ఒక్కటిగా ముందడుగు వేసే అరుదైన సందర్భాల్లో ఇది కూడా ఒకటి కావటం గమనార్హం. ఇదే కాదు. బతుకమ్మ పేరు సైతం ఓ సందేశమిస్తోంది. క్షణికావేశంలో గానీ, ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా గానీ ఆత్మహత్య వంటి కఠిన నిర్ణయాల జోలికి వెళ్లకమ్మా అని ఓ అమ్మగా బిడ్డలకు సూచిస్తోంది. బతుకమ్మా.. బతికి చూపమ్మా.. అంటూ పెద్ద మనసుతో బతిమాలుతోంది. చనిపోయి సాధించేదేముందని ప్రశ్నిస్తోంది.
భూదేవి అంతటి ఓపిక కలిగిన తల్లులు సైతం రకరకాల కారణాలతో తమ జీవితాలను తామే అంతమొందించుకుంటూ పిల్లలను అనాథలను చేస్తుండటం పట్ల బతుకమ్మ మౌనంగా తల్లడిల్లుతోంది. మీకోసం నేనున్నానంటూ ప్రతి సంవత్సరం ఇలా ఒకసారి ప్రేమగా వచ్చి వెళుతోంది. గతేడాది తన కోసం ఆడిపాడిన ఆడబిడ్డలను మరొక్కసారి మనస్ఫూర్తిగా చూసిపోదామని మర్చిపోకుండా నిన్న వచ్చింది. తొమ్మిది రోజుల పాటు తనివితీరా పూజలందుకొని తరలిపోతుంది. వచ్చే ఏడాది మరలి వస్తుంది. ఈ నవరాత్రులే కాదు. ఆడ బిడ్డలు యాడ ఉన్నా వాళ్లకు సర్వ దినాలూ పర్వ దినాలుగా మారాలని బతుకమ్మ కోరుకుంటోంది.