Site icon NTV Telugu

Premature Births : ముందస్తు ప్రసవాలకు ఆందోళనలే కారణమా..?

Pregnant Stress Craft

Pregnant Stress Craft

Premature Births : అమ్మ అని పిలిపించుకోవాలని ప్రతీ స్త్రీ ఆరాటపడుతూ ఉంటుంది. తల్లి కావడం అనేది స్త్రీలకు దేవుడిచ్చిన వరం. గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు తన జన్మ సంపూర్ణమైందని అనుకుంటుంది. అయితే… ఆ అమ్మ అనే పిలుపు అందుకోవడానికి 9 నెలల పాటు తన కడుపులో బిడ్డను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే… మనకు తెలీకుండానే… బిడ్డను కడుపులో మోసే క్రమంలో ఎక్కువగా స్త్రీలు ఆందోళనకు గురౌతూ ఉంటారట. ఈ ఆందోళన కారణంగా…. బిడ్డ పుట్టాల్సిన సమయం కన్నా… ముందుగానే అంటే… ప్రీ మెచ్యూర్ డెలివరీలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల చేసిన పలు పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఆందోళనను ఎదుర్కొనే గర్భిణుల్లో నెలలు నిండకుండానే ప్రసవాలు జరిగే ప్రమాదం ఉంటుందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది.

Read Also: Washington : అక్కడ తినడమే అతను చేసిన నేరం.. అందుకే ఫైరింగ్

బిడ్డ జన్మించే పరిస్థితులను గర్భిణి మానసిక స్థితి కచ్చితంగా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు స్పష్టం చేశారు. ‘‘ప్రతి నలుగురిలో ఒకరు ఆందోళనను ఎదుర్కొంటారని గత అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది బిడ్డ జన్మించే సమయంలో తీవ్రంగా ప్రభావం చూపించవచ్చు. అమెరికాలోని డెన్వెర్‌, లాస్‌ ఏంజిలిస్‌ ప్రాంతాల్లో మొత్తం 196 మంది గర్భిణులపై మా అధ్యయనాన్ని నిర్వహించాం. వీరిలో తొలి, మూడో త్రైమాసికాల్లో ఆందోళన స్థాయులను పరిశీలించాం. సాధారణ ఆందోళన, గర్భం సంబంధిత ఆందోళన గురించి విడివిడిగా ప్రశ్నలు అడిగి సమాధానాలు సేకరించాం. మూడో త్రైమాసిక సమయంలో తమ గర్భం గురించి ఆందోళన చెందిన మహిళల్లో ప్రసవం 9 నెలలు నిండకుండానే జరుగుతున్నట్లు గుర్తించాం. ఇక తొలి త్రైమాసికంలో వారిలో ఉన్న ఇతర ఆందోళనలు కూడా ఇదే తరహాలో ముందస్తు ప్రసవానికి కారణమైనట్లు తేలింది. ఆఖరి త్రైమాసికంలో గర్భిణుల్లో ఎక్కువగా వైద్యపరమైన భయాలు, శిశువు ఎలా జన్మిస్తుందోనన్న ఆందోళనలు, డెలివరీ గురించిన ఒత్తిడి వంటివి ఎక్కువగా ఉన్నాయి’’ అని పరిశోధకులు స్పష్టం చేశారు. వైద్యులు గర్భిణుల్లో తొలి త్రైమాసికంలో ఒత్తిడి, ఆందోళనలను గమనించి, ముందుగానే సరైన మార్గదర్శనం చేయాలని వారు సూచించారు.

Exit mobile version