తెలుగువారిలో ఈ నాటికి అధికశాతం జనం రైతుబిడ్డలే! అందువల్ల ‘రైతుబిడ్డ’ అన్న మాట వినగానే మన మనసులు పులకించిపోతాయి. రైతే దేశానికి వెన్నెముక అన్న సత్యాన్ని చాటుతూ అనేక తెలుగు చిత్రాలు తెరకెక్కాయి. ఇక రైతు సౌభాగ్యమే దేశప్రగతికి మూలం అంటూ 1939లోనే గూడవల్లి రామబ్రహ్మం ‘రైతుబిడ్డ’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో రైతుల జీవనశైలి, అప్పటి రాజకీయాల నేపథ్యం చోటు చేసుకొని సంచలన చిత్రంగా నిలచి, అనూహ్య విజయం సాధించింది. ఆ తరువాత కూడా పలు తెలుగు సినిమాల్లో అలాంటి వాతావరణం విరిసి జనాన్ని మురిపించాయి. రామబ్రహ్మం ‘రైతుబిడ్డ’ తరువాత 32 సంవత్సరాలకు యన్టీఆర్ హీరోగా బి.ఏ.సుబ్బారావు దర్శకత్వంలో ‘రైతుబిడ్డ’ రూపొంది, ఘనవిజయం సాధించింది.
రంగుల నడుమ ‘రైతుబిడ్డ’ హంగామా!
యన్.టి.రామారావు, దర్శకుడు బి.ఏ.సుబ్బారావు కాంబినేషన్ తెలుగువారికి మరపురాని చిత్రాలను అందించింది. అందాల నటుడు యన్టీఆర్ పై పలు ప్రయోగాలు చేసి, విజయం సాధించిన దర్శకుడు బి.ఏ.సుబ్బారావు. అందువల్ల యన్టీఆర్, బి.ఏ.సుబ్బారావు సినిమా అనగానే జనాల్లో ఓ ప్రత్యేక ఆసక్తి ఉండేది. అందుకు తగ్గట్టుగానే ‘రైతుబిడ్డ’పై కూడా అభిమానులకు అంచనాలు ఉండేవి. అప్పటికే తెలుగు సినిమా రంగం రంగుల చిత్రాలపై మోజు పెంచుకుంది. పెద్ద, చిన్న అన్న తేడా లేకుండా అందరు హీరోలు కలర్ మూవీస్ పై మనసు పారేసుకున్నారు. జనం కూడా తెలుపు-నలుపు చిత్రాలు చూసి చూసి, కొత్తగా రంగుల చిత్రాలు అనగానే ఆసక్తి చూపించసాగారు. అప్పట్లో కలర్ ముడి ఫిలిమ్ ధర ఎక్కువగా ఉండేది. అందువల్ల యన్టీఆర్ తన నిర్మాతలకు భారం పెరగరాదని, బ్లాక్ అండ్ వైట్ సినిమాలకే ప్రాధాన్యమిస్తూ వచ్చారు. తెలుగునాట తొలి రంగుల చిత్రంగా వెలసిన ‘లవకుశ’ కథానాయకుడే అయినా, రామారావు తన నిర్మాతలకు వ్యయం తగ్గించడానికి తెలుపు-నలుపు చిత్రాలలోనే నటించసాగారు. అలా వచ్చిన చిత్రాలలో ఈ ‘రైతుబివడ్డ’ ఒకటి. ఇతర రంగుల చిత్రాల సందడిలోనూ ‘రైతుబిడ్డ’ జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది.
ఈ ‘రైతుబిడ్డ’ తీరే వేరు…
కథ విషయానికి వస్తే, ఓ జమీందార్ కు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కొడుకు రాము, చిన్న భార్య కొడుకు ప్రసాద్. ఇద్దరినీ సొంతబిడ్డల్లా చూసుకుంటూ ఉంటారు తల్లి లక్మీదేవి. ఈ జమీందార్ కుటుంబానికంటే తానే మిన్న అనిపించుకోవాలని ఆ ఊరి కామందుకు ఎప్పటి నుంచో కోరిక. అతని కూతురునే ప్రసాద్ ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. దాంతో ఆ కామందు అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి విడదీస్తాడు. అతని దుర్మార్గాన్ని కన్న కూతురే ప్రశ్నిస్తుంది. అప్పుడు ప్రసాద్ కళ్ళు తెరచుకుంటాయి. అయితే అప్పటికే, అల్లుడితో సంతకాలు పెట్టించుకొని, ఆస్తిని తన పేర రాయించుకొని ఉంటాడు ఆ కామందు. అంతేకాదు, రాము ప్రేమించిన శాంత అనే అమ్మాయిని చెరపట్టాలని చూస్తాడు. చివరకు రాము, తన యుక్తితో అతని నుండి ఆస్తిని రాబట్టి, తగిన గుణపాఠం చెబుతాడు. అతని వల్ల అన్యాయం అయిపోయిన వారు కామందును అంతమొందించాలనుకుంటారు. కానీ, రాము అడ్డుపడి అతనిలోనూ పరివర్తన తీసుకు వస్తాడు. ఈ చిత్ర కథ మొదట్లో చూస్తే, పి.పుల్లయ్య తెరకెక్కించిన ‘అర్ధాంగి’ లా కనిపిస్తుంది. పైగా ఆ చిత్రంలో తల్లీకొడుకులుగా నటించిన శాంతకుమారి, జగ్గయ్య ఇందులోనూ అవే పాత్రల్లో నటించారు. అయితే, ఆ సినిమాలో కొడుకు కోరిందల్లా ఇవ్వాలనుకొనే తల్లిగా శాంతకుమారి నటిస్తే, ఇందులో తన పెద్దకొడుకు రామును ఎంతగానో అభిమానించే అమ్మగా ఇందులో ఆమె పాత్ర ఉంటుంది. ఈ కారణంగా ఆ యేడాది సూపర్ హిట్ గా నిలచిన రంగుల చిత్రం ‘దసరాబుల్లోడు’ హీరో ఏయన్నార్ అభిమానులు, ‘రైతుబిడ్డ’ తమ సినిమా కాపీ అన్నారు. కానీ, ‘అర్ధాంగి’లో కేవలం ఓ కుటుంబం చుట్టూ, వారి చుట్టు పక్కల ఉన్న వారి నడుమ కథ సాగుతుంది. కానీ, ఇందులో హీరో, తన మనుషులు అనుకున్నవారి కోసం, గ్రామం కోసం పాటు పడిన వీరోచితం కనిపిస్తుంది. ఎవరు ఎన్ని విధాలా ప్రచారం చేసినా ‘రైతుబిడ్డ’ జనం మదిని గెలిచింది. విజయం సాధించింది. అందుకు యన్టీఆర్ స్టార్ డమ్ కారణమని వేరే చెప్పాలా!?
పాటలతో అలరించిన ‘రైతుబిడ్డ’
యన్టీఆర్, జగ్గయ్య అన్నదమ్ములుగా నటించిన ఈ చిత్రంలో వాణిశ్రీ, శాంతకుమారి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, రాజనాల, రాజబాబు, ఛాయాదేవి, అనురాధ, ప్రసన్నరాణి , శ్రీధర్ నటించారు. ఈ చిత్రానికి సాలూరు రాజేశ్వరరావు అన్న సాలూరు హనుమంతరావు సంగీతం సమకూర్చారు. కొసరాజు, సి.నారాయణరెడ్డి పాటలు రాశారు. జి.బాలసుబ్రహ్మణ్యం రాసిన కథకు పినిశెట్టి సందర్భో్చితమైన సంభాషణలు పలికించారు. లక్మీకళా చిత్ర పతాకంపై ఈ చిత్రాన్ని కోట్ల వెంకట రామయ్య నిర్మించారు. ఇందులోని 8 పాటలు జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా “దేవుడు సృష్టించాడు లోకాలు… ఈ మనిషే కల్పించాడు తేడాలు…” , “ఓ విరిసిన మరుమల్లి జరుగును మన పెళ్ళి… “, “అ అమ్మ, ఆ ఆవు…” , “రైతే రాజ్యం ఏలాలి…” , “మనిషిని నమ్మితే ఏముందిరా…” పాటలు జనాన్ని భలేగా అలరించాయి. సినిమా చివరలో ఆ పాటలను ఓవర్ ప్లే చేస్తూ, ఎవరి పాటను వారిపై చూపించడం విశేషం.
మొదటి సారి విడుదలైనప్పుడే విశేషాదరణ చూరగొన్న ‘రైతుబిడ్డ’ రిపీట్ రన్స్ లోనూ తనదైన బాణీ పలికించింది. ఈ సినిమా కథను అనుసరిస్తూ ఆ తరువాతి రోజుల్లో పలు చిత్రాలు తెరకెక్కాయి. ముఖ్యంగా ‘సమష్టి వ్యవసాయం’ అన్న అంశం ఇందులో చోటు చేసుకొని ఆకట్టుకుంది. ఇప్పటికీ కొన్ని చిత్రాలలో రైతులంతా ఒక్కటిగా కలసి వ్యవసాయం చేసి, లాభాలను సైతం సమానంగా పంచుకోవాలనే సందేశమివ్వడానికి ఈ ‘రైతుబిడ్డ’ స్ఫూర్తిగా నిలచిందని చెప్పవచ్చు.
(మే 19న ‘రైతుబిడ్డ’కు యాభై ఏళ్ళు)