NTV Telugu Site icon

పాతికేళ్ళ ‘ఇంట్లో ఇల్లాలు – వంటింట్లో ప్రియురాలు’

కొన్ని కాంబినేషన్స్ జనాన్ని భలేగా అలరించి, విజయాలనూ సొంతం చేసుకుంటాయి. కానీ, ఎందుకనో రిపీట్ కావు. అదే విచిత్రంగా ఉంటుంది. చిత్రసీమలో ఇలాంటి చిత్రవిచిత్రాలు సాధారణమే అనుకోవాలి. హీరో వెంకటేశ్ తో దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ అలాంటి చిత్రమైన పరిస్థితినే చూశారు. నిజానికి వెంకటేశ్ కుటుంబ సభ్యులద్వారానే ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకునిగా మారారు. అయితే వెంకటేశ్ సొంత సంస్థ అయిన సురేశ్ ప్రొడక్షన్స్ లో ఆయనను డైరెక్ట్ చేయలేకపోయానని ఇ.వి.వి. సత్యనారాయణ అంటూ ఉండేవారు. వెంకటేశ్, ఇ.వి.వి. కాంబినేషన్ లో రెండే రెండు చిత్రాలు వచ్చాయి. అవి రెండూ మంచి విజయం చూశాయి. ఆ రెండు సినిమాలూ రీమేక్స్ కావడం మరో విశేషం. వీరి కాంబోలో వచ్చిన తొలి చిత్రం ‘అబ్బాయిగారు’. ఈ సినిమాకు తమిళంలో భాగ్యరాజా నటించి, రూపొందించిన ‘ఎంగ చిన్న రాజా’ చిత్రం ఆధారం. ఇక రెండో సినిమా ‘ఇంట్లో ఇల్లాలు – వంటింట్లో ప్రియురాలు’ చిత్రానికి కూడా భాగ్యరాజా కథతో తెరకెక్కిన ‘తాయ్ కులమే తాయ్ కులమే’ మూలం కావడం విశేషం!

తమిళంలో విజయం సాధించిన ‘తాయ్ కులమే తాయ్ కులమే’ చిత్రంలో పాండ్యరాజన్ హీరో. దర్శకుడు ఎన్.మురుగేశ్. ఈ చిత్రానికి భాగ్యరాజా కథను మాత్రమే అందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఇ.వి.వి. సత్యనారాయణ తనదైన పంథాలో మలిచి, ఇసుకపల్లి మోహనరావు మాటలతో మజా చేశారు. ఇక ‘ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు’ కథ విషయానికి వస్తే – శ్రీరామ్, సీత అన్యోన్య దంపతులు. వారికి పిల్లలు ఉండరు. పరీక్ష చేయిస్తే, సీతలోనే లోపం ఉందని తేలుతుంది. అయితే భార్య మనోవేదనకు గురవుతుందని శ్రీరామ్, ఆ లోపమేదో తనలోనే ఉందని చెప్పుకుంటాడు. అనుకోకుండా బిజినెస్ పనిమీద నేపాల్ వెళ్ళిన శ్రీరామ్, అక్కడ మనీషా అనే అమ్మాయిని చూస్తాడు. ఆమెతో చనువుగా ఉంటే, అక్కడి ఆచారం ప్రకారం వారికి పెద్దలు పెళ్ళిచేస్తారు. మనీషా కొడుకును కంటుంది. ఆ అబ్బాయిని శ్రీరామ్ తీసుకు వస్తాడు. తన బిడ్డను చూసుకోవడానికి మనీషా, శ్రీరామ్ ఇంట్లోనే వంటమనిషిగా చేరుతుంది. భార్యకు నిజం తెలిస్తే, ఆమె అనారోగ్యకారణంగా మరణిస్తుందేమోనని శ్రీరామ్ భయం. దాంతో నిజం చెప్పలేడు. చివరకు తనయుడు నిందలు పడుతూఉంటే, శ్రీరామ్ తండ్రి అసలు విషయం బయటపెడతాడు. మనీషను తన ఇంట్లోనే ఉండమని సీత కోరడంతో కథ సుఖాంతమవుతుంది.

ఈ చిత్రంలో శ్రీరామ్ గా వెంకటేశ్, సీతగా సౌందర్య, మనీషాగా వినీత నటించారు. మిగిలిన పాత్రల్లో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబూమోహన్, ఏవీయస్, మల్లికార్జునరావు కనిపించారు. ఇందులో హీరో కొడుకుగా నటించిన మాస్టర్ అన్వేష్ ఈ మధ్యే ‘వినవయ్యా రామయ్యా’ చిత్రంతో హీరో అయ్యాడు.

శ్రీదుర్గా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎస్ .గోపాల్ రెడ్డి సమర్పకుడు. నిర్మాత డాక్టర్ కె.ఎల్.నారాయణ. ఈ చిత్రంలోని ఏడు పాటలను సామవేదం షణ్ముఖ శర్మ రాయగా, కోటి సంగీతం సమకూర్చారు. “బోలు బోలు బోలు రాజా…”, “ప్రియురాలే ప్రేమగా…”, “చిలకతో మజా…”, “అమ్మనే అయ్యాను రా…” పాటలు అలరించాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అనేక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్ర వందరోజుల వేడుక కర్నూల్ లో వైభవంగా జరిగింది. ఇదే కథ తరువాత హిందీలో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో “ఘర్ వాలీ – బాహర్ వాలీ” పేరుతో అనిల్ కపూర్ హీరోగా రీమేక్ అయింది.

(మే 22న ‘ఇంట్లో ఇల్లాలు – వంటింట్లో ప్రియురాలు’కు 25 ఏళ్ళు)