Vijay Deverakonda, Mrunal Thakur’s Family Star Movie Review: విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. ఎలా అయినా హిట్ కొట్టాలని ఆయన తనకు కెరీర్ బెస్ట్ మూవీ ఇచ్చిన పరశురాం దర్శకత్వంలో ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు- శిరీష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రమోషన్స్, ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించిన ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది. ఇక ఈ సినిమా ఎలా ఉందో? విజయ్ దేవరకొండకి మరో హిట్ వచ్చిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం పదండి.
కథ:
ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పని చేసే గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) తన కుటుంబ బాధ్యతలు అన్నీ తన భుజాల మీదే మోస్తూ ఉంటాడు. తాగుడుకు బానిసైన ఒక అన్న(రవి ప్రకాష్), ఏదో వ్యాపారం పెట్టడానికి డబ్బులు కోసం తిరిగే మరో అన్న (రాజా చెంబోలు) వారి భార్యలు ఇద్దరూ(వాసుకి, అభినయ), వారి పిల్లలు వారి స్కూళ్ల ఖర్చు ఇలా ఒక్కటేమిటి అన్ని విషయాలు తానే చూసుకుంటూ ఫ్యామిలీని పోషిస్తూ ఉంటాడు. అలాంటి గోవర్ధన్ జీవితంలోకి సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసేందుకు వచ్చిన ఇందు (మృణాల్ ఠాకూర్) ఎంట్రీ ఇస్తుంది. ముందు ఆమెను దూరంగానే ఉంచినా చివరికి అనూహ్యంగా ప్రేమలో పడి ఆమెకు ప్రేమను వ్యక్తం చేసే సమయానికి ఒక ఊహించని షాక్ తగులుతుంది. ఆ దెబ్బకి గోవర్ధన్ ఏం చేశాడు? ఇందు గోవర్ధన్ కి ఇచ్చిన షాక్ ఏంటి? ఇందును ప్రేమించిన గోవర్ధన్, చివరికి ఏం చేశాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
విజయ్ దేవరకొండతో గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరుశురాం ఈసారి ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో వచ్చాడు. అయితే ఈసారి ఎంచుకున్న కథ ఈ జనరేషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా లేదు. పోనీ కథనం విషయంలో అయినా జాగ్రత్త తీసుకున్నారా అంటే చాలా లాజిక్స్ కి అందని విషయాలు సినిమా మొత్తం మీద కనిపించాయి. ఫ్యామిలీ స్టోరీ అంటేనే ఎమోషన్స్ తో ఉంటుందని అందరూ ఆశిస్తారు. కానీ ఈ సినిమాలో ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇంట్లో అన్న తాగుడికి బానిస అయినట్లు చూపిస్తారు, కానీ జరిగిన ఒక చిన్న గొడవకే ఏళ్ల తరబడి తాగుతూ ఉండడం లాజిక్ కి దూరమనిపిస్తుంది.. అదేవిధంగా కోట్లకు వారసురాలైన హీరోయిన్ అది కూడా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి సీఈఓ పనిచేస్తూ పీహెచ్డీ చేయడం కోసం పరితపించడం కూడా ఎందుకో లాజిక్ కి దూరమనిపిస్తుంది. అయితే ఫస్టాఫ్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రజన్స్ బాగుంది. మృణాల్ తో కెమిస్ట్రీ బాగానే ఉంది కానీ గీతగోవిందంతో పోలిస్తే కాస్త తక్కువ అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం కాస్త ఆసక్తి రేకెత్తిస్తుంది. ఫస్టాఫ్ అంతా ఇండియాలో జరిగితే సెకండ్ హాఫ్ మాత్రం అమెరికాకి షిఫ్ట్ అవుతుంది. ఇక సినిమా కథ కథనం విషయంలో ఎందుకో పూర్తిస్థాయిలో కేర్ తీసుకున్నట్లు అనిపించలేదు. అయితే డైలాగ్స్ మాత్రం ఆకట్టుకునే విధంగా రాసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఈ జనరేషన్ ఆడియన్స్ ముఖ్యంగా యూత్ కి ఫ్యామిలీ విలువలు నేర్పించే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. సినిమా ప్రమోషన్స్ లో ముందు నుంచి చెబుతూ వచ్చినట్లుగానే ఇది కొత్త కథ కాదు, మనలో ఒకరి కథ. మనందరి కథ అని చెప్పక తప్పదు. కుటుంబాన్ని వేరే స్థాయికి తీసుకువెళ్లడానికి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరు కష్టపడుతూ ఉంటారు. వాళ్లకి మాత్రం సినిమా కనెక్ట్ అవుతుంది.
నటీనటుల విషయానికి వస్తే.. గోవర్ధన్ అనే ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రలో విజయ్ దేవరకొండ ఇమిడిపోయాడు. తనకు బాగా అచ్చొచ్చిన గీత గోవిందం సినిమాలోని గోవింద్ పాత్రకు దగ్గర పోలికలు ఉన్న గోవర్ధన్ పాత్ర ఆకట్టుకునేలా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సఫలమయ్యాడు. గతంతో పోలిస్తే డాన్స్ విషయంలో కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. మృణాల్ ఠాకూర్ తో విజయ్ కెమిస్ట్రీ బాగానే ఉంది కానీ పూర్తిస్థాయిలో మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. అయితే మృణాల్ ఠాకూర్ తన పాత్రతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే సినిమాలో జగపతిబాబు, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను వంటి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి పూర్తిస్థాయి నటనకు స్కోప్ లేదు. ఉన్నంతలో పర్వాలేదు అనిపించారు. వాసుకి అభినయ వంటి వాళ్లు నటించారు కానీ వారి పాత్రలు కూడా అంతంత మాత్రమే. బామ్మ పాత్రలో నటించిన మరాఠీ రోహిణి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. దివ్యాంశ కౌశిక్ ఎందుకో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో మెరిసింది. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే పాటలు రిలీజ్ అయినప్పటి నుంచి కాపీ ట్యూన్స్ అని ఆరోపణలు వచ్చినా తెరమీద మాత్రం బాగానే అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఒకటి రెండు సందర్భాలలో మినహా పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించలేదు. సినిమా మొత్తం మీద ప్రధానమైన అసెట్ ఏదైనా ఉందంటే అది ప్రొడక్షన్ వాల్యూస్. ఎడిటింగ్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.
ఫైనల్ గా లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చొచ్చు, కానీ యూత్ కూడా కనెక్ట్ అయితే వేరేలా ఉండేది.