NTV Telugu Site icon

Love Guru Review: విజయ్ ఆంటోనీ ‘లవ్ గురు’ రివ్యూ!

Love Guru Review

Love Guru Review

Vijay Antony’s Love Guru Movie Review: మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందించి ఆ తరువాత కాలంలో హీరోగా మారాడు విజయ్ ఆంటోనీ. డాక్టర్ సలీం, బిచ్చగాడు, బేతాళుడు లాంటి విభిన్నమైన సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులకు కూడా ఎప్పటికప్పుడు ఆసక్తి కలిగిస్తూ వస్తున్న ఆయన ‘లవ్ గురు’ అనే సినిమాతో ఇప్పుడు ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా ఈరోజు రిలీజ్ అవుతుంది. అయితే సినిమా మీద ఉన్న నమ్మకంతో రెండు రోజులు ముందుగా ఉగాది రోజే తెలుగు మీడియా సహా వారి కుటుంబ సభ్యులకు స్పెషల్ ప్రీమియర్ వేశారు. అయితే ఈ లవ్ గురు సినిమా ఎలా ఉంది? లవ్ గురు సినిమా ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

కథ:
చిన్నప్పుడే బాధ్యతలు మీద పడడంతో మలేషియా వెళ్లి డబ్బులు సంపాదించి అప్పులన్నీ తీర్చి కొన్ని ఆస్తులు కూడ పెడతాడు అరవింద్ (విజయ్ ఆంటోనీ). 35 ఏళ్లు వచ్చేసాయి ఇండియా వచ్చేయమని తల్లిదండ్రులు కోరడంతో ఇండియా వచ్చేసిన అరవింద్ వాళ్ళ కోరిక మేరకు పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమవుతాడు. అయితే ఎవరో ఒక అమ్మాయి కాదని చూడగానే ప్రేమ కలిగితేనే చేసుకుంటానని కండిషన్ పడతాడు. అనుకోకుండా చావు ఇంటికి వెళ్లి చనిపోయిన వ్యక్తి మనవరాలు లీల(మృణాళిని రవి)ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె కుటుంబానికి ఆర్థికంగా కూడా అండగా నిలబడి ఎట్టకేలకు వివాహం చేసుకుంటానని ప్రపోజల్ పెడతారు. అయితే ఎప్పటికైనా ఒక స్టార్ హీరోయిన్ అవ్వాలని ఆశతో ఉండే లీల ముందు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా తండ్రి ఆంక్షల కంటే ఇలాంటి ఒక అమాయకుడిని పెళ్లి చేసుకుంటే హీరోయిన్ అవ్వచ్చని భావించి చేసుకుంటుంది. అయితే చేసుకున్న మొదటి రోజు నుంచి అరవింద్ కి లీల నరకం చూపిస్తూ ఉంటుంది. అయితే ముందు ఆమె ఆట పట్టిస్తుందని భావించినా చివరికి ఆమె మనసు అర్థం చేసుకున్న అరవింద్ ఆమె హీరోయిన్ అవడానికి ఏం చేశాడు? ఆమె మీద పిచ్చి ప్రేమ పెంచుకున్న అరవింద్ ఎందుకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు? చివరికి వీరిద్దరూ విడాకులు తీసుకున్నారా? లాంటి విషయాలు తెలియాలి అంటే లవ్ గురు సినిమా మొత్తం చూడాల్సిందే.

విశ్లేషణ:
లవ్ గురు అనే టైటిల్ వినగానే ఈ సినిమా మీద ఒక రకమైన ఆసక్తి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో 100 మందిలో 95 శాతం మంది ప్రేమలో పడుతున్నారు. ఆ ప్రేమ ఏదో ఒక కారణంతో విఫలం అవుతూనే ఉంది. ఇలాంటి వాళ్ళందరూ తమకు ఒక మంచి లవ్ గురువు దొరికితే బాగుండని తమ ప్రేమను సఫలం చేసుకునే అవకాశం ఉండేదని భావిస్తూ ఉంటారు. అయితే ఈ సినిమాలో కూడా ఒక లవ్ గురు ఉంటాడు కానీ అది విజయ్ ఆంటోనీ కాదు. సినిమా ప్రారంభోత్సవం నుంచి చెప్పాల్సిన పాయింట్ ని సూటిగా సుత్తి లేకుండా చెప్పే ప్రయత్నం చేశారు. ఫస్ట్ ఆఫ్ లోనే విజయ్ ఆంటోని విదేశాలకు వెళ్లి కష్టపడి ఇండియాకి తిరిగి రావడం పెళ్లి చేసుకోను అని ముందు నుంచి చెబుతూనే అనుకోకుండా ఒక అమ్మాయిని చూసి ఆమెతో ప్రేమలో పడటం, ఆమెకి ఇష్టం ఉందో లేదో కూడా తెలుసుకోకుండానే పెళ్లి చేసుకుని ఆమె కోరిక మేరకు హైదరాబాదు రావడం లాంటి విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. అయితే ఆమెకు వివాహం ఇష్టం లేకపోయినా ఆమె అంటే తనకు ఇష్టం కాబట్టి ఆమె ఇష్టాన్ని బట్టి మసులుకోవాలని నిర్ణయించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. మధ్యలో లవ్ గురువుగా యోగి బాబు ఎంట్రీ మరింత ఆసక్తికరం. యోగి బాబు ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంది. నిజానికి తరువాత జరిగేది ఏమిటి అనే విషయం మీద సాధారణ ప్రేక్షకుడు ఒక రకమైన అంచనాకు వచ్చేస్తాడు. అయితే ఆ అంచనాకు వచ్చిన తర్వాత అసలు అది జరగకుండా ట్విస్ట్ ఇస్తూ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు. ఊహించనిది చేస్తూ సినిమాని ముందుకు తీసుకు వెళ్ళాడు. అయితే గతంలో బాలీవుడ్ లో వచ్చిన ఒక సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్లు అనిపించినా దానికన్నా ఎగ్జిక్యూట్ చేసిన విధానం బావుంది. కథ రాసుకోవడమే కాదు దాన్ని చెప్పాలనుకున్న తీరు కూడా ఆసక్తికరంగానే ఉంది. ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా కుటుంబాలన్నింటినీ ఆకట్టుకునేలా అందరినీ అలరించేలా ఈ సబ్జెక్టు ప్రిపేర్ చేసుకున్నారు. చిన్న చిన్న లోపాలు ఉన్నా సినిమా స్క్రీన్ ప్లే సహా కథ కూడా ఆకట్టుకునేలా ఉంది.

నటీనటుల విషయానికి వస్తే:
విజయ్ ఆంటోని నటన గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఆయన నటన గురించి ఎన్నో సినిమాలతో ప్రూవ్ చేసుకున్నాడు ఈ సినిమాలో కూడా అరవింద్ అనే పాత్రలో ఇమిడిపోయాడు. హీరోయిన్గా నటించిన మృణాళిని రవికి మాత్రం నటనను ప్రూవ్ చేసుకునే పాత్ర దొరికిందని చెప్పొచ్చు. ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయింది. వీటిని గణేష్, యోగి బాబు ఏదో కామెడీ కావాలని చేసినట్లు కాకుండా కథలో భాగంగానే నవ్వులు పూయించారు. ఇంకా మిగతా నటీనటులు కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తానికి ప్రాణం పోసింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్. కొన్ని పాటలు ఉన్నా ఎందుకో అంతగా కనెక్ట్ అయ్యేలా లేవు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి బాగా ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి తగ్గట్టుగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది.

ఫైనల్లీ: లవ్ గురు ఒక ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఒక సాలిడ్ మెసేజ్ ఇస్తూనే ఎంటర్ టైన్ చేస్తుంది.

 

Show comments