NTV Telugu Site icon

Saindhav Review: సైంధ‌వ్ రివ్యూ

Saindhav Movie

Saindhav Movie

Saindhav Review: విక్టరీ వెంకటేష్ హీరోగా తన లాండ్ మార్క్ 75 వ సినిమాగా సైంధవ్ చేశాడు. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ముఖేష్ రిషి, ఆర్య, రుహనీ శర్మ, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆండ్రియా కీలక పాత్రలలో నటించారు. హిట్, హిట్ 2 సినిమాలతో డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న డాక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమాకి ప్రమోషన్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. వెంకటేష్ 75వ సినిమా కావడంతో ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్ లో చేయడంతో సినిమా మీద అంచనాలు కూడా పెరిగాయి..మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం పదండి.

సైంధవ్ కథ:
సైంధవ్ కథ అంతా చంద్రప్రస్థ అనే ఒక పోర్ట్ సిటీలో జరుగుతూ ఉంటుంది. ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ లక్షల కోట్లు సంపాదిస్తున్న ఒక కార్టెల్ గ్రూప్ సైకో(వెంకటేష్) మళ్లీ తిరిగి వస్తాడని అలెర్ట్ అవుతుంది. ఐదేళ్ల క్రితం కార్టెల్ కు దూరం అయిన సైకో పార్టీల్ హిస్టరీ లోనే బిగ్గెస్ట్ డీలుగా చెబుతున్న ఒక డీల్ క్యాన్సిల్ చేసేందుకు వస్తాడని కార్టెల్ లీడర్ విశ్వామిత్ర (ముఖేష్ రిషి) సహా అతని వద్ద పనిచేసే వికాస్ మాలిక్(నవాజుద్దీన్ సిద్ధిఖీ) , జాస్మిన్(ఆండ్రియా) భావిస్తూ ఉంటారు. అదే సమయంలో సైకో తన కుమార్తె గాయత్రి ఒక అరుదైన జెనెటిక్ డిసార్డర్ తో బాధపడుతున్న విషయం తెలుసుకుంటాడు. ఆ డిసార్డర్ నుంచి బయట పడాలంటే 17 కోట్ల రూపాయల విలువ కలిగిన ఒక ఇంజక్షన్ చేయించాలని తెలుస్తుంది. అన్నీ వదిలేసి పోర్టులో ఒక క్రేన్ ఆపరేటర్ గా జీవిస్తున్న సైకో ఆ 17 కోట్ల రూపాయలు తీసుకురావడానికి తన ప్రయత్నం తాను చేస్తూ ఉంటాడు. పెద్ద డీల్ గా భావిస్తున్న ఒక షిప్పుకు సరిపడా ఆయుధాలను సైకో దాచేస్తాడు. దీంతో సైకోకి ఆ ఇంజక్షన్ దొరక్కుండా చేసి దాచేసిన కంటైనర్లను ఇస్తేనే ఇంజక్షన్ ఇస్తామని బేరానికి దిగుతాడు వికాస్ మాలిక్. అంతే కాదు కస్టమ్స్ ఆఫీసర్ మూర్తి(జయ ప్రకాష్) ను చెంపేస్తామని బెదిరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో సైకో 17 కోట్ల రూపాయలు సంపాదించి తన కూతురిని కాపాడుకున్నాడా? ఈ క్రమంలో అతనికి మైకేల్ డిష్యుసేన్ గుప్తా చేసిన సాయం ఏంటి? అలాగే మను ( శ్రద్దా శ్రీనాథ్), మానస్ (ఆర్య), డాక్టర్ రేణు ( రుహానీ శర్మ) సైకోకి ఎలా సహాయం చేశారు? చివరికి సైకో ఏం చేశాడు అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ
వెంకటేష్ 75 సినిమాగా సైన్ధవ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు సినిమా ఓపెనింగ్ నుంచి ఆ అంచనాలను క్యారీ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చాడు దర్శకుడు శైలేష్. నిజానికి సినిమాలో వెంకటేష్ లుక్ కానివ్వండి, రిలీజ్ అయిన ట్రైలర్లో వెంకటేష్ యాక్షన్ ఎపిసోడ్లు ఒకరకంగా ఆసక్తి రేకెత్తించాయి. గతంలో కూడా వెంకటేష్ మాస్ సినిమాలు ఇలాంటి గ్యాంగ్ స్టార్ డ్రామాలు కొన్ని చేశారు. కానీ ఇందులో సైకో అనే పేరు పెట్టడమే కాదు అంతకు మించి సైకోయిజం ఫైట్స్ లో చూపించినట్టు అనిపించింది. ఇక సినిమా మొదలుపెట్టడమే అసలు విషయం ఏమిటో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఒక పెద్ద డీల్ జరుగుతోంది, ఆ డీల్ ఆపడానికి సైకో వస్తాడు అని అందరూ భయపడుతున్న సమయంలో సైకోగా చెప్పబడే వెంకటేష్ కూతురికి ఒక అరుదైన వ్యాధి బయటపడటం. ఆ వ్యాధి నుంచి బయటపడాలి అంటే దాదాపు 17 కోట్ల రూపాయల ఇంజక్షన్ చేయించాలి అనే కనెక్షన్ ఇవ్వడం ఆసక్తికరంగా ఉంది. చంద్రప్రస్థ అనే ఒక ఫిక్షనల్ సిటీని సృష్టించి అందులోనే కథ మొత్తం జరుగుతున్నట్టు చూపించాడు దర్శకుడు. అయితే వెంకటేష్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసే సమయంలో ఒక సూపర్ హీరోలాగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. కానీ నాలుగేళ్ల పాటు టెర్రరిస్టులకు ఇచ్చే శిక్షణ తీసుకున్న కుర్రాళ్ళు సైతం అతని ముందు నిలవలేకపోవడం, వందల మంది వచ్చినా తొక్కుకుంటూ ముందుకు వెళ్లిపోవడం లాంటివి ఎందులో కొంచెం కన్విన్సింగ్ గా చెప్పలేకపోయారని పించింది. సాధారణంగా హీరో అంటే వందల మందిని ఒట్టి కరిపిస్తారు, కానీ ఆ ఎలివేషన్ వర్కౌట్ అయ్యి కటౌట్ ని చూస్తే కొన్ని కొన్ని నమ్మేయాలి అనిపించేలా డిజైన్ చేసుకున్నప్పుడు మాత్రమే అవి పండుతాయి. అన్నీ వదిలేసి ఒక క్రేన్ ఆపరేటర్ గా బతుకుతున్న వ్యక్తి ఈ రేంజ్ లో అది కూడా ఈ వయసులో అద్భుతాలు చేస్తాడని చూపించడం కొంచెం కన్వింన్సింగ్ అనిపించలేదు. ఇక తన కూతురికి అరుదైన వ్యాధి ఉందనే విషయం తెలిసిన తర్వాత ఒక తండ్రిగా ఆయన రెస్పాండ్ అయిన తీరు ఎమోషనల్ గా వెంకీ నటన ఆకట్టుకునేలా ఉన్నాయి. వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ హీరోగా పేరు ఉంది. అలాంటి ఆయన ఎమోషనల్ డ్రామాలు ఒకప్పుడు చాలా చేశాడు. ఇప్పుడు కొంచెం ట్రాక్ మార్చి మాస్ మసాలా మూవీల మీద ఫోకస్ పెట్టినట్టు అనిపించింది. ఇక ఈ సినిమా మొత్తం మీద వెంకటేష్ మార్క్ కామెడీ అయితే కనిపించలేదు. సీరియస్ మూడ్ లోనే సినిమా అంతా సాగుతూ ఉంటుంది. అయితే దర్శకుడు చెప్పినట్టు ఈ డిజార్డర్ గురించి ప్రజలకు తెలిసే అవకాశం ఉంది కానీ అసలు ఎందుకు ఈ డిజార్డర్ వస్తుందనే విషయాన్ని కన్వే చేయలేకపోయారు. అయితే ఫైట్ సీన్స్ డిజైన్ చేసిన విధానం బాగుంది. యాక్షన్ లవర్స్ కి నచ్చేలా డిజైన్ చేశారు.

నటీనటుల విషయానికి వస్తే సినిమా మొత్తాన్ని వెంకటేష్ తన భుజస్కందాల మీద వేసుకుని నడిపించాడు అనిపించింది. సినిమా మొత్తం మీద చాలామంది నటీనటులు ఉన్న మెయిన్ ఫోకస్ అంతా వెంకటేష్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో వెంకీ మామ అదరగొట్టాడు. వికాస్ మాలిక్ పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ వెంకటేష్ కి బలమైన విలన్ గా నిలబడలేకపోయాడు. కానీ బలహీనుడైనా గుంట నక్కలా ప్రవర్తించే వ్యక్తిగా ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు. ఇక ఆర్య, ఆండ్రియా, శ్రద్ధ శ్రీనాథ్ , రుహానీ శర్మ, ముఖేష్ ఋషి వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే డైరెక్టర్ గా రెండు హిట్ సినిమాలు ఇచ్చిన శైలేష్ కొలను ఈ సినిమాతో కూడా ఖచ్చితంగా హిట్టు కొడతానని నమ్మకంతో ఉన్నాడు. అయితే కన్విన్సింగ్ గా లేని కొన్ని సీన్స్ మినహా మిగతాదంతా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంలో దాదాపు సఫలమయ్యారు. ఇక సాంగ్స్ పెద్దగా గుర్తించుకో తగ్గవి లేవు. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మాత్రం ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఫైట్స్ డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి సరిపడే విధంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు బాగున్నాయి.

టాగ్ లైన్: సైంధవ్ – ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్.. యాక్షన్ లవర్స్ ఎంజాయ్ చేస్తారు

Show comments