NTV Telugu Site icon

Tillu Square Review: టిల్లు స్క్వేర్ రివ్యూ

Tillu

Tillu

డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు ఏడాది పైనే అవుతుంది. సినిమా హిట్ అయిన వెంటనే సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. అయితే ఆ సీక్వెల్ తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఇంత కాలం పట్టింది. ఎట్టకేలకు టిల్లు స్క్వేర్ పేరుతో ఒక సినిమా రూపొందించారు. మొదటి భాగానికి విమల్ డైరెక్షన్ చేయగా రెండో భాగాన్ని మాత్రం మల్లిక్ రాం డైరెక్ట్ చేశాడు. కథ సిద్దు జొన్నలగడ్డ అందించిన ఈ సినిమా ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే ఒక్కసారిగా అమాంతం సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ట్రైలర్ తో పాటు పాటలు కూడా సినిమా మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

టిల్లు స్క్వేర్ కథ:
సినిమా కథ డీజే టిల్లు పూర్తి అయినప్పటి నుంచి మొదలవుతుంది. రాధిక చేతిలో మోసపోయిన టిల్లు (సిద్దు జొన్నలగడ్డ) టిల్లు ఈవెంట్స్ పేరుతో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పాటుచేసి పెళ్లిళ్లు, ఫంక్షన్లు చేస్తూ ఉంటాడు. ఒకరోజు పబ్ కి వెళ్ళిన సమయంలో అక్కడ లిల్లీ (అనుపమ పరమేశ్వరన్) పరిచయమవుతుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి క్రష్ ఏర్పడడంతో ఫిజికల్ గా కూడా ఒకటవుతారు. అయితే ఉదయాన్నే లేచేసరికి లిల్లీ సిద్దు కి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆమె కోసం వెతుకుతున్న సమయంలో ఆమె నెల రోజులకు కనపడి తాను ప్రెగ్నెంట్ అని షాక్ ఇస్తుంది. ముందు నమ్మకం కలగకపోయినా సిద్దు జొన్నలగడ్డ ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. అలా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన క్రమంలో ఒకరోజు ఎవరూ ఊహించని విధంగా మరో లిల్లీ షాక్ ఇస్తుంది. అసలు టిల్లుకి లిల్లీ ఇచ్చిన షాక్ ఏంటి? టిల్లు లిల్లీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? చివరికి లిల్లీ ఇచ్చిన షాక్ నుంచి టిల్లు ఎలా తేరుకున్నాడు? మధ్యలో షేక్ మహబూబ్ భాయ్ (మురళీ శర్మ) ఎవరు? టిల్లుకి, లిల్లీకి మెహబూబ్ భాయ్ కి మధు సంబంధం ఏమిటి? అనేది తెలియాలి అంటే సినిమా థియేటర్లలో చూడాల్సిందే.

విశ్లేషణ:
డీజే టిల్లు అనే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి సిద్దు జొన్నలగడ్డకి ఏర్పడిన క్రేజ్ అంతా కాదు.. హైదరాబాది లాంగ్వేజ్ లో మాట్లాడుతూ బాగా కనెక్ట్ అయిపోయాడు. ఒక రకంగా మొదటి భాగం అంత సూపర్ హిట్ కావడానికి టిల్లు క్యారెక్టరైజేషన్ ప్రధాన కారణం అని చెప్పాలి. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ అనగానే బేసిక్ గానే అందరికీ భారీ అంచనాలు ఉంటాయి. అయితే ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలాగా ఈ సినిమా సెటప్ చేసుకున్నారు. ప్రేక్షకులు ఏమి ఆశిస్తున్నారో దాన్ని సమపాళ్లలో అందించే ప్రయత్నం చేశారు. మొదటి భాగంలో అమ్మాయి ప్రేమలో పడి ఆమె మోసం చేస్తే ఆ మోసం నుంచి బయటపడి ఎలా నిలబడ్డాడు అనే కోణంలో సాగితే ఇది కాస్త భిన్నంగా సాగుతుంది. సినిమా మొదలైన వెంటనే కథలోకి తీసుకువెళ్లి సిద్దు జొన్నలగడ్డ ఏర్పాటు చేసిన టిల్లు ఈవెంట్స్ వ్యాపారం, దాన్ని తల్లిదండ్రులతో కలిసి నిర్వహించే తీరు ఆకట్టుకుంటుంది. ఒకసారి ప్రేమలో మోసపోయిన సరే మరోసారి ప్రేమలోకి వెళ్లాలనుకునే ప్రయత్నించి ఎలాంటి తిప్పలు పడ్డాడు అనేది ఈ రెండవ భాగం. అయితే టిల్లు నుంచి ప్రేక్షకులు ఆశించే కామెడీ, వన్ లైనర్లు వంటివి ఎక్కడ తగ్గకుండా చూసుకున్న మేకర్స్ కథనం విషయంలో అలాగే సినిమాలోని ట్విస్టుల విషయంలో మాత్రం పెద్దగా కేర్ తీసుకోలేదేమో అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఆకట్టుకునేలా రాసుకున్నా అప్పటి వరకు ఉన్న కామెడీ సినిమా సీరియస్ మోడ్ లోకి వెళుతుంది. అయుట్3 సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ మొదటి భాగంతో ఈ టిల్లు స్క్వేర్ సినిమాని కనెక్ట్ చేసిన విధానం మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా మొదట్లోనే అనుపమతో సిద్దు జొన్నలగడ్డ రొమాన్స్ సీన్లు కాస్త ఫ్యామిలీ ఆడియన్స్ ని దూరం పెట్టే అవకాశం ఉందేమో అనిపిస్తుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే డీజే టిల్లు అనగానే సిద్దు జొన్నలగడ్డ కచ్చితంగా గుర్తొచ్చేస్తాడు. అంతలో ఆయన ఆ క్యారెక్టర్ కు సెట్ అయ్యాడు. ఈ సినిమాలో సిద్దు చేసిన పాత్ర ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. చాలా ఈజ్ తో ఈ పాత్రను చేసేశాడు సిద్ధూ. ఇక లిల్లీ అనే పాత్రలో అనుపమ పరమేశ్వరన్ ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజీ. ముందు నుంచి ఆమె ఈ పాత్ర చేస్తున్నప్పుడు ఒక గ్లామర్ డాల్ అనే అందరూ అనుకున్నారు కానీ సినిమా చూసిన తర్వాత కచ్చితంగా వారి అభిప్రాయం మారేలాగా ఆమె పాత్ర ఉంది. ఇక ఈ పాత్రకు అనుపమ పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఆమె పాత్రను బేస్ చేసుకుని వచ్చి ట్విస్టులు ఆకట్టుకునేలా ఉంటాయి. ఇక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ప్రియాంక జవాల్కర్ తో పాటు నేహా శెట్టి చెరొక సీన్లో ఆకట్టుకునేలా కనిపించారు. ముఖ్యంగా రాధిక కనిపించగానే థియేటర్లో ఒక రేంజ్ రెస్పాన్స్ కనిపించేలా ఆమె ఎంట్రీ ఉంది. ముఖ్యంగా రాధిక నుంచి ఎలాంటి సీన్ ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి సీన్లో ఆమె కనిపించింది. టిల్లు తండ్రి పాత్ర చేసిన మురళీధర్ గౌడ్ కి మరొకసారి మంచి పాత్ర పడింది. ఆయనకు మంచి నటనకు స్కోప్ కూడా దొరికింది. మార్కస్ పాత్రలో నటించిన నటుడు కూడా ఆకట్టుకున్నాడు. మురళీ శర్మ, ప్రిన్స్ వంటి వాళ్లు కొన్ని సీన్స్ లో కనిపించినా నటనకు స్కోప్ ఉన్న పాత్రలు అయితే కాదు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచింది మ్యూజిక్. భీమ్స్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పాటు రామ్ మిరియాల ఇచ్చిన రీమిక్స్ సాంగ్ సినిమాకి బాగా ప్లస్ అయింది. కథ పర్వాలేదు అనిపించినా కథనం విషయంలో మాత్రం మరింత కేర్ తీసుకుని ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. ఎడిటర్ క్రిస్పీగా కట్ చేయడంలో సఫలమయ్యాడు. సినిమాటోగ్రాఫర్ సినిమా మొత్తాన్ని కలర్ ఫుల్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు.

మొత్తంగా చెప్పాలంటే డీజే టిల్లు సినిమాకి ఒక పర్ఫెక్ట్ సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ నిలుస్తుంది. కథ, కథనాలు, లాజిక్స్ లాంటివి పక్కన పెట్టి చూస్తే టిల్లు గాడు ఎంటర్టైన్ చేస్తాడు.

Show comments